-ఈ ఏడాది 67 సీట్లు వచ్చే అవకాశం
-కరోనా బ్యాచ్ తోనూ ఉత్తమ ఫలితాలు
-మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షల్లో ఎస్సీ గురుకుల విద్యార్థులు కనబరిచిన ప్రతిభ కారణంగా ఐఐటీ, ఎన్ఐటీ, నిఫ్ట్, సెంట్రల్ యూనివర్సిటీల్లో ఈ ఏడాది 67 సీట్లు రానున్నాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. కరోనా కాలంలో పరీక్షలు రాయకుండానే పదోతరగతి పాసైన విద్యార్థుల బ్యాచ్ తోనే ఈ ఫలితాలను సాధించగలిగామని తెలిపారు.
జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాల వెలువడిన నేపథ్యంలో సోమవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో అంబేద్కర్ గురుకులాల విద్యార్థులకు ఈ ఏడాది 67 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. గతేడాది జేఈఈ అడ్వాన్స్ డ్ లో ఉన్న కటాఫ్ మార్కుల ఆధారంగా చూసినప్పుడు ఈ ఏడాది ఐఐటీల్లో 16, ఎన్ఐటీలలో 39, నిఫ్ట్, ఇతర సెంట్రల్ యూనివర్సిటీల్లో 12 చొప్పున మొత్తం 67 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నామని తెలిపారు. చిన్నటేకూరు (కర్నూలు) శిక్షణా కేంద్రానికి చెందిన విద్యార్థుల్లో 28 మంది సీట్లు సాధించే అవకాశం ఉండగా వీరిలో 8 మంది ఐఐటీ, 16 మంది ఎన్ఐటీ, 4 ఇతర యూనివర్సిటీల్లో సీట్లు పొందే అవకాశం ఉందని చెప్పారు.ఈడ్పుగల్లు (కృష్ణా) శిక్షణా కేంద్రానికి చెందిన విద్యార్థుల్లో 29 మందికి సీట్లు వచ్చే అవకాశం ఉండగా వీరిలో 6 మంది ఐఐటీ, 17 మంది ఎన్ఐటీ, 6 మంది ఇతర యూనివర్సిటీల్లో సీట్లు పొందే అవకాశం ఉందన్నారు. అడవి తక్కెళ్లపాడు (గుంటూరు) శిక్షణా కేంద్రానికి చెందిన 10 మంది విద్యార్థులకు సీట్లు వచ్చే అవకాశం ఉండగా వీరిలో ఇద్దరు ఐఐటీ, 6 మంది ఎన్ఐటీ, మరో ఇద్దరు ఇతర యూనివర్సిటీల్లోనూ సీట్లు పొందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని నాగార్జున వివరించారు. ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్ డ్ రాసిన విద్యార్థులు గతంలో కరోనా కాలంలో పరీక్షలు రాయకుండానే 9, 10 తరగతులు ఉత్తీర్ణులైన వారని వివరించారు. అయినప్పటికీ గతేడాది జేఈఈ అడ్వాన్స్ డ్ లో సాధించిన స్థాయిలోనే ఈ ఏడాది కూడా సీట్లను నిలుపుకోగలిగామన్నారు. అయితే వచ్చే ఏడాది ఈ పరీక్షల్లోనూ ఎస్సీ గురుకుల విద్యార్థులు అద్భుతాలను సృష్టిస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు. ఇటీవల వెలువడిన నీట్ పరీక్షల్లోనూ ఎస్సీ గురుకుల విద్యార్థులు ఎంబీబీఎస్, డెంటల్ లో 44 సీట్లను సాధించే దిశగా సత్తా చూపిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. జేఈఈ అడ్వాన్స్ డ్ లో ఉత్తమ ఫలితాలను సాధించడానికి కృషి చేసిన గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శ ఆర్. పావనమూర్తి, ఏఎంఓ ఎన్.సంజీవరావు, ఇతర అధ్యాపకులను ఈ సందర్భంగా అభినందించారు.
Prajavartha Online Telugu News