మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేయుటకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డిఆర్ఓ ఎం. వెంకటేశ్వర్లు జిల్లా అధికారులు క్షేత్రాధికారులతో జగనన్న సురక్ష కార్యక్రమం అమలుపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 23వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని . లాంఛనంగా ప్రారంభిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వీసీ ద్వారా మండల స్థాయి వరకు అధికారులందరూ ప్రజా ప్రతినిధులతో కలిసి తప్పనిసరిగా పాల్గొని విధివిధానాలు తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. ప్రతి ఇంటి సమస్యను తెలుసుకొని పరిష్కరించదమే కార్యక్రమ ప్రధాన ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమం గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఇంటిలో ఉన్న సమస్య పరిష్కారమై ప్రజల్లో సంతృప్త స్థాయి పెరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈనెల 24వ తేదీన ప్రతి మండలము, మునిసిపాలిటీలో ఒక గ్రామాన్ని, వార్డును పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని సచివాలయ పరిధిలో ఈ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. ప్రజల నుండి స్పందన ఎలా ఉందో గమనించాలని వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని సూచించారు. ఇలా రెండు మూడు రోజులు అక్కడి పరిస్థితులు గమనించాక లోటుపాట్లు ఏమైనా వుంటే వాటిని సవరిస్తూ అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా పరిషత్ సీఈవో ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాలుగు డెస్కులు ఏర్పాటు చేయాలని మొదటి డెస్క్ లో రిజిస్ట్రేషన్ చేపట్టాలని, రెండో డెస్క్ లో డాక్యుమెంట్ల పరిశీలన, మూడో డెస్క్ లో సర్వీస్ అభ్యర్థన, నాలుగో డెస్క్ లో హెల్ప్ డెస్క్ గా గ్రామీణ పట్టణ ప్రాంతాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సహాయ సహకారాలు అందించాల్సి ఉంటుందన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్లో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసిల్దార్లు తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News