Breaking News

ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకర జీవితం…

-మిద్దెపై వ్యవసాయంతో ప్రయోజనాలు…
-ఇటువంటి సదస్సులు మరిన్ని జరగాలి.
-రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిరంజీవి చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలో ప్రతి మనిషి ఆరోగ్యంగా జీవించేందుకు ప్రకృతితో మమేకమై పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిరంజీవి చౌదరి అన్నారు.

మిద్దె పై వ్యవసాయం అనే అంశంపై వన్ ఎర్త్- వన్ లైఫ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నెలకొన్న కలుషిత వాతావరణం దృష్ట్యా ప్రతి ఒక్కరు మనం తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఆహారం అంశంలో అన్నిటిని నిరోధించలేకపోయినా కొన్ని మాత్రం మన చేతిలోనే ఉంటాయన్నారు. వీటిలో ప్రధానమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటివి మనం నివసిస్తున్న భవనాలపైనే రసాయన రహితంగా పండించుకునేందుకు ఉన్న అవకాశాలను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు. నేడు మనం కొనుగోలు చేస్తున్న కూరగాయలు, ఆకుకూరల్లో సైతం విషపూరిత రసాయనాలు ఉంటాయన్నారు. మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటామని అయినప్పటికీ ఈ రసాయనాలను పూర్తిగా తొలగించలేమని పేర్కొన్నారు. ఐదు దశాబ్దాల క్రితం ఉన్న వాతావరణం, భూసార పరిస్థితులు నేడు లేకపోవడంతో రైతులు కూడా వ్యాపార కోణంలోనే ఆలోచిస్తున్నారని వివరించారు. ఈ అంశంలో మనం ఎవరినీ నిందించకుండా మన పంట మనమే పండించుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గతంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు నగరాన్ని టెర్రస్ గార్డెన్ సిటీగా మార్చాలని ఒక సమావేశంలో చేసిన వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది ఈ తరహా పంటలకు సిద్ధం కావడం అభినందనీయమన్నారు. వాతావరణంలో ఉన్న కాలుష్యాన్ని నిరోధించడంలో కూడా సమాజంలో క్రమశిక్షణ, బాధ్యత కలిగిన పౌర సమాజం చొరవ చూపాలని సూచించారు. దేశంలోని కొన్ని నగరాలలో పెరుగుతున్న వాయు కాలుష్యం ద్వారా లక్షలాది రూపాయలు వైద్య ఖర్చులకు వెచ్చించాల్సి వస్తోందన్నారు. అటువంటి విపత్కర పరిస్థితులు అధిగమించేందుకు ప్రకృతిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలన్నారు. ప్లాస్టిక్ వినియోగంలో కూడా సమాజం మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. గతంలో ప్రభుత్వం అర్బన్ ఫార్మింగ్ స్కీం లో భాగంగా గతంలో మంజూరు చేసిన విత్తనాలతో కూడిన కిట్ల ను కొన్ని కారణాలతో నిలుపుదల చేశామని తిరిగి వాటిని అందిస్తున్నామని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిరంజీవి చౌదరి అన్నారు.

ఉద్యాన శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎం.జి. దేవముని రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రకృతి వ్యవసాయం చేసే వారికి అందిస్తున్న సహాయ, సహకారాలను వివరించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రకృతి వ్యవసాయం కూడా ఒక భాగం మాత్రమేనన్నారు. అయితే ఎవరికివారు తమంతట తాముగా భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని గాలి, నీరు, అటవీ సంపద, నీటి వనరులు కలుషితం కాకుండా కాపాడుకునేందుకు బాధ్యతగా ఉండాలన్నారు.

మిద్దెపై వ్యవసాయంలో సంపూర్ణ పరిజ్ఞానం ఉన్న తుమ్మేటి రఘోత్తమ రెడ్డి మాట్లాడుతూ మిద్దెపై వ్యవసాయం చేసేందుకు అవకాశం ఉన్న ప్రతి ఒకరికి అవగాహన కల్పించేందుకు ఇటువంటి సదస్సులు మరిన్ని నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. ”మన ఇల్లు -మన పంట” అనే సందేశం సమాజంలో ప్రతి ఒక్కరికి చేరాలని పేర్కొన్నారు.

ఇళ్లలో పెంచుకునేందుకు అనువైన కొన్ని విత్తనాల రకాలను సమావేశ అనంతరం పంపిణీ చేశారు.

సమావేశంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి బాలాజీ కుమార్, వన్ ఎర్త్ వన్ లైఫ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు లీలా కుమారి, శ్యాం ప్రసాద్, సురేష్ నగరంలో మిద్దె పై వ్యవసాయం చేస్తున్న పలువురు ఔత్సాహిక మహిళలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపు

-భక్తితో పాటు బాధ్యతగా వినాయక చవితి జరుపుకుందాం. -వినాయక పందిళ్లకు ఉచిత విద్యుత్తుపై మంత్రి హర్షం అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *