Breaking News

ఆంధ్రప్రదేశ్ యువతకు జర్మనీలో ఉద్యోగాలు : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్

-ఇప్పటికే 12 మంది బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థుల వీసా ప్రక్రియ పూర్తి
-అంంతర్జాతీయ స్థాయి ఉపాధి కల్పనకు కృషి చేస్తున్న ఏపీఎస్ఎస్డీసీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలను కల్పిస్తోన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ తాజాగా జర్మనీలో పనిచేసేందుకు 150 మంది అర్హులైన బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ కోసం విడుదల చేసిన ప్రకటనకు విశేష స్పందన లభించిందని ఆయన స్పష్టం చేశారు. నాలుగు దశల్లో పూర్తికానున్న ఉద్యోగ ఎంపిక ప్రక్రియలో భాగంగా జులై, 6వ తేదీ గురువారం నాడు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా కేఎల్ యూనివర్సిటీ వేదికగా A1, A2 B1 లెవల్ వరకు అభ్యర్థులకు జర్మనీ భాష లో శిక్షణ ఇవ్వనున్నట్టు నైపుణ్యశాఖ పేర్కొంది. జర్మనీలో ఉద్యోగం చేసేందుకు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 10వ తేదీ నుండి.. టక్ట్ ఇంటర్నేషనల్, ఆక్సిలా అకాడమీ బృందం సంయుక్తంగా జర్మన్ భాషలో రెండు నెలల పాటు శిక్షణనిచ్చి అనంతరం వీసా ప్రక్రియ పూర్తి చేస్తుందన్నారు.

స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్, నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఇంటర్నేషనల్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నియామకాలను మరింత సులభం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అందుకోసం ఓవర్సీస్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (OMCAP), ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ(APNRTS), విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఏర్పాటైన రిజిస్టర్ రిక్రూట్ ఏజెన్సీ తదితర సంస్థల సహకారంతో అవసరమైన మానవవనరులను అందించేందుకు రాష్ట్రం తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. గత నెలలో 12 మంది బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియను టక్ట్ ఇంటర్నేషనల్ మరియు ఆక్సిలా అకాడమీ బృందం విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు వారి వీసా ప్రక్రియ చివరి దశకు చేరుకున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే వారు జర్మనీలో నర్సులుగా తమ ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించనున్నట్లు ఆ బృందంలోని సభ్యులు తెలిపారు. ఇప్పటికే నైపుణ్యాభివృద్ధి సంస్థ దీనికి సంబంధించి టాక్ట్ ఇంటర్నేషనల్, ఏపీఎన్ఆర్టీఎస్ తో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం 2 నెలల పాటు రోజుకు 6 గంటల చొప్పున వారానికి 48 గంటలు శిక్షణ ఉంటుందని, శిక్షణ సమయంలో హాస్టల్ లో ఉండే అభ్యర్థులు హాస్టల్ ఫీజులను వారే చెల్లించుకోవాలన్నారు. అభ్యర్థి తన బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లు, పాస్ పోర్ట్, అనుభవ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఆఫర్ లెటర్ పొందిన అభ్యర్థులకు విమాన ఛార్జీలు ఉచితమని, అలాగే మొదటి 6 నెలలు ఆహారం, వసతి కూడా ఉచితంగా అందిస్తామని వివరించారు. ఈ సమయంలో నెలకు 1,000 యూరోలు (రూ.89వేలు) జీతం కూడా ఇవ్వనున్నట్లు నైపుణ్య శాఖ వివరించింది. ఆసక్తి ఉన్నవారు ఏపీఎస్ఎస్డీసీ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలని, నైపుణ్యాభివృద్ధి సంస్థ హెల్ప్ లైన్ నంబర్ 99888 53335 సంప్రదించాలన్నారు.

కేవలం హెల్త్ కేర్ (నర్సింగ్) కు సంబంధించిన ఉద్యోగాలే కాకుండా ఐటీ, హాస్పిటాలిటీ, ప్లాస్టిక్, ఇతర ప్రాధాన్యత రంగాల్లోనూ అవకాశాలను కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు తెలిపారు.జర్మనీలో 6 నెలలు బీ2 సర్టిఫికేషన్ శిక్షణ ఇస్తారని, బీ2 స్థాయిలో ఉత్తీర్ణత సాధించిన తరువాత నెలకు 2,500 యూరోలు (రూ.2.20 లక్షలు) జీతం కూడా ఇచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి… : ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు

-భక్తిశ్రద్ధలతో గణపతి మహోత్సవాలు నిర్వహిస్తున్న ప్రజలకు కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *