-1979 జులై 5న ఏర్పాటై ఇప్పటి వరకు 80 లక్షల ఇళ్లు పూర్తి చేసిన గృహ నిర్మాణ సంస్థ
-నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లలో భాగంగా ప్రస్తుతం నిర్మిస్తున్న ఇళ్లతో కలిపి కోటి ఇళ్లను నిర్మించిన ఘనత ఏపీదే
-ప్రభుత్వం నిర్మించిన 5 లక్షల ఇళ్లకు వచ్చే నెలలో గృహ ప్రవేశాలు
-చరిత్రలో ఒకేసారి ఇన్ని ఇళ్లకు గృహ ప్రవేశాలు చేసే అరుదైన ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిదే..
-రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నది ఇళ్లు కాదు ఊళ్లు .. భవిష్యత్ లో మహానగరాలుగా మారే అవకాశం…
-పేదవారికి నీడ, భరోసా ఇవ్వడంలో 45 ఏళ్లుగా అహర్నిశలు కృషి చేసిన గృహనిర్మాణ సంస్థ ఉద్యోగుల పాత్ర మరవలేనిది
-రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ 45 వ వార్షికోత్సవంలో గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఐఏఎస్ అధికారులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గృహ నిర్మాణంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా ఉందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. బుధవారం విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ లో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ 45 వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఏర్పాటైన 45 ఏళ్లలో ఏపీలో దాదాపు 80 లక్షల ఇళ్లను నిర్మించడం గొప్ప విషయమన్నారు. దేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద 1 కోటి 19 లక్షల ఇళ్లు మంజూరు కాగా అందులో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే 21 లక్షల గృహాలు మంజూరు కావడం ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఘనత అన్నారు. 2 ఏళ్లు కరోనా విపత్తు కారణంగా ప్రజల సంక్షేమం, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొన్న ప్రభుత్వం ఆ తర్వాతి రెండేళ్లలోనే 25 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం విశేషమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన 5 లక్షల ఇళ్లకు వచ్చే నెలలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా గృహ ప్రవేశాలు చేయనున్నామన్నారు. చరిత్రలో ఒకేసారి ఇన్ని ఇళ్లకు గృహ ప్రవేశాలు చేసే అరుదైన ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ.జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలు వివిధ దశలలో ఉన్నాయని, పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి, కన్నీళ్లు తుడిచి, బాధలు విని దేశ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో 30 లక్షలకు పైగా పేదవారికి వారి సొంతింటి కలను నెరవేర్చడం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. పేదవారికి నీడ, భరోసా ఇవ్వడంలో 45 ఏళ్లుగా అహర్నిశలు కృషి చేసిన గృహనిర్మాణ సంస్థ ఉద్యోగుల పాత్ర మరవలేనిదన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థను మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు.
రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ శ్రీ. డి.దొరబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పేదల చిరకాల వాంఛ అయిన సొంతింటి కలను నెరవేరుస్తూ వారి కళ్లల్లో వెలుగుకు కారణమయ్యారన్నారు. కేవలం నాలుగేళ్ల కాలంలోనే 31 లక్షల ఇళ్లపట్టాలను అక్కచెల్లెమ్మల పేర్ల మీదే ఇచ్చి, రిజిస్ట్రేషన్ సైతం వారి పేర్ల మీదే చేయించడం సంతోషమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నది ఇళ్లు కాదు ఊళ్లు అని కొనియాడారు. భవిష్యత్ లో ఈ ఊళ్లు మహానగరాలుగా మారుతాయనడంలో అతిశయోక్తి లేదన్నారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణలను సకాలంలో పూర్తి చేయటానికి ప్రతి ఒక్క ఉద్యోగి మరింతగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ లక్షలాది మంది పేదల స్వంతింటి కలను నెరవేర్చడం గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగులకు దక్కిన అదృష్టంగా భావించాలన్నారు. వచ్చే నెల 5 లక్షల ఇళ్లు పూర్తితో పాటు డిసెంబర్ నాటికి మరో 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. మొత్తంగా 23 లక్షల ఇళ్ల నిర్మాణాల పూర్తికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లలో భాగంగా సహకారం అందించిన ప్రతి శాఖకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి లక్ష్యానికనుగుణంగా తలపెట్టిన గృహయజ్ఞం పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ 1979 జులై 5న ఏర్పాటైన గృహ నిర్మాణ సంస్థ ఇప్పటిదాకా దాదాపు 80 లక్షల ఇళ్లను పూర్తిచేయడం ఒక ఘనత అన్నారు. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లలో భాగంగా ప్రస్తుతం నిర్మిస్తున్న ఇళ్లతో కలిపి కోటి ఇళ్లను నిర్మించిన ఘనత ఏపీదే అన్నారు. పేదలకు భద్రతతో కూడిన నాణ్యమైన జీవితం అందించేందుకు ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు.
టిడ్కో ఎండి శ్రీధర్ మాట్లాడుతూ 45 ఏళ్ల గృహ నిర్మాణ సంస్థకు ఈ నాలుగేళ్లు మహర్ధశ అన్నారు. నాలుగేళ్లలో 51 కాలనీను ప్రారంభించామన్నారు. 21 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రపంచ రికార్డు అన్నారు. భవిష్యత్ లో ఈ కాలనీలన్నీ కార్పొరేషన్ స్థాయికి ఎదుగుతాయని భావిస్తున్నామన్నారు.
టిడ్కో ఛైర్మన్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ గృహాల కేటాయింపుల విషయంలో దేశంలోనే వైశాల్యంలో పెద్ద రాష్ట్రాలను కాదని ఆంధ్రప్రదేశ్ కు 21 లక్షల 32 వేల ఇళ్లను సాధించి తీసుకురావడం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఘనత అన్నారు.
అదే విధంగా గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ భాస్కర్ నాయుడు, రమాదేవి, నోడల్ ఆఫీసర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ 45 ఏళ్ల క్రితం ఏర్పాటైన గృహనిర్మాణ సంస్థ తొలుత పేదలకు గుడిసెలు అందించే స్థాయి నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పక్కా ఇళ్లను నిర్మించే స్థాయికి చేరుకోవడం అభినందనీయమన్నారు. ఇళ్ల శాంక్షన్ లో గానీ, ఎగ్జిక్యూషన్ లో గానీ అన్నింట్లో ఏపీ నే నెంబర్ వన్ అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచి, లక్షలాది పేదల జీవితాల్లో వెలుగులు చూసిన ఘనత రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థకే దక్కుతుందన్నారు.
కార్యక్రమంలో మంత్రి చేతుల మీదుగా రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులు, ఉద్యోగులకు, ఉద్యోగులకు నిర్వహించిన వివిధ రకాల ఆటల పోటీలలో విజేతలకు, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమం ప్రారంభంలో ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆద్యంతం ఆహుతులను ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యదర్శి రేవు ముత్యాలరాజు, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి భరత్ గుప్తా, హౌసింగ్ బోర్డు డైరెక్టర్లు, గృహనిర్మాణ సంస్థ అధికారులు, వారి కుటుంబ సభ్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News