-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-30 వ డివిజన్ 246 వ సచివాలయ పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సర్వత్రా ప్రశంసలు అందుకుంటూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయంగా మారాయని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 30 వ డివిజన్ 246 వ వార్డు సచివాలయ పరిధిలో శుక్రవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. దేవీనగర్ లో విస్తృతంగా పర్యటించి 366 గడపలను సందర్శించారు. ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలుచేశారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అన్ని రంగాల్లో బకాయిలు పెట్టి వెళ్లిందని.. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల కోసం తీసుకొచ్చిన నిధులను సైతం పక్కదారి పట్టించారని ఆరోపించారు. పైగా అధికారంలోకి వస్తే నవరత్నాల కన్నా ఎక్కువ పథకాలు అందిస్తామని చంద్రబాబు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని దుయ్యబట్టారు. బాబు ఇటీవల ప్రకటించిన ఆరు మోసపూరిత హామీలను.. అధికారంలో ఉండగా ఎందుకు అమలు చేయలేకపోయారని ప్రశ్నించారు. కానీ ఈ ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ శాచ్యురేషన్ పద్ధతిలో సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు వివరించారు. సెంట్రల్లోని 96 వార్డు సచివాలయాల పరిధిలో సగటున రూ. 3 నుంచి 5 కోట్ల సంక్షేమాన్ని ప్రతి ఒక్క సచివాలయంలో అందజేసినట్లు తెలిపారు. అనంతరం స్థానిక సమస్యలు తెలుసుకుంటూ.. వాటన్నింటినీ పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులు, సచివాలయ సిబ్బందికి సూచించారు.
నారా లోకేష్ వి దిగజారుడు రాజకీయాలు
టీడీపీ నేత నారా లోకేష్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మల్లాది విష్ణు మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నేరుగా ఎదుర్కొనే సత్తా లేక ఆయన కుటుంబ సభ్యులపై అసత్యాలు ప్రచారం చేసే స్థాయికి దిగజారారని ధ్వజమెత్తారు. నెల్లూరు కేంద్రంగా వైఎస్ భారతీ గారిపై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. అధికారం లేదన్న ఫ్రస్ట్రేషన్లో తెలుగుదేశం నేతలు హద్దులు మీరి మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. రాజకీయంగా విమర్శలు సహజమని.. కానీ వీటితో ఏమాత్రం సంబంధంలేని మహిళలను ఇందులోకి లాగడం టీడీపీ నేతల సంస్కారహీనతను అద్దం పడుతోందన్నారు. పైగా అవినీతిపరులు నారాయణ, సోమిరెడ్డి వంటి వారిని పక్కన పెట్టుకొని లోకేష్ అవినీతి గూర్చి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.
అచ్చెన్నాయుడివి మతిలేని మాటలు
ఆంధ్రరాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళితే.. తెలుగుదేశం నేతలకు ఎందుకంత ఉలికిపాటు అని మల్లాది విష్ణు ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఒంటరిగా పోటీ చేసే దమ్ము, ధైర్యం లేక టీడీపీ నేతలు ఆంబోతుల్లా రంకెలేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పని అయిపోయిందని.. పార్టీ లేదు తొక్క లేదన్న అచ్చెన్నాయుడు టీడీపీ గ్రాఫ్ పెరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలో ఉంటూ 23 స్థానాలకు పడిపోయిన టీడీపీ గ్రాఫ్ పెరిగినట్లా..? 151 స్థానాలతో అధికారంలోకి రావడంతోపాటు ప్రతిఒక్క ఎన్నికలోనూ తిరుగులేని మెజార్టీతో దూసుకుపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగినట్లా..? అచ్చెన్నాయుడు సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అప్రతిహాసంగా ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సీడీఓ జగదీశ్వరి, నాయకులు మార్తి చంద్రమౌళి, తుంపాల వరప్రసాద్, గడియారం కామేశ్వరరావు, కొట్టు కృష్ణ, సామంతకూరి దుర్గారావు, వానపాల రమేష్, అరవింద్, పవన్, నారాయణరెడ్డి, ప్రసాద్, మనోహర్, మణికంఠ, డి.దుర్గారావు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News