– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల వద్దకు పాలనను తీసుకొచ్చే గొప్ప కార్యక్రమం జగనన్న సురక్ష అని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 29 వ డివిజన్ మధురానగర్లో శుక్రవారం నిర్వహించిన సురక్ష శిబిరంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది అందిస్తున్న సేవలను పరిశీలించారు. ‘జగనన్నకు చెబుదాం’కు అనుబంధంగా చేపట్టిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. గతంలో ఏ సర్టిఫికెట్ ఏ అధికారి ఇస్తారో., ఎవరికి దరఖాస్తు చేసుకోవాలో తెలియని అయోమయ స్థితిలో ప్రజలు ఉండేవారని గుర్తుచేశారు. కానీ ఈ ప్రభుత్వంలో వాలంటీర్లే ఇంటింటికి వచ్చి ఏ సర్టిఫికెట్లు కావాలో అడిగి మరీ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆఫీసుల్లో జారీ అయ్యే 11 రకాల ధ్రువీకరణ పత్రాలను పూర్తి ఉచితంగా అందించడంతో పాటు సంక్షేమ పథకాలకు అర్హులైన ఏఒక్కరూ మిగిలిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇందుకోసం వారం రోజుల పాటు వాలంటీర్ల ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం, సచివాలయ సిబ్బంది ఇంటింటా అర్హులను జల్లెడపట్టి.. వారికి ఆయా సేవలను అందించడం జరుగుతోందన్నారు. అర్హులకు క్యాంపుల ద్వారా సర్టిఫికెట్లను అందజేయడంతో పాటు సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేస్తున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. డివిజన్లోని 62 క్లస్టర్ల పరిధిలో 1,474 మంది వివిధ రకాల పత్రాలు కోసం వినతులు సమర్పించినట్లు మల్లాది విష్ణు తెలిపారు. వీరిలో 781 మంది కుల సర్టిఫికెట్ల కోసం., 652 మంది ఆదాయ., ముగ్గురు EWS., ఒకరు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, 11 మంది బియ్యం కార్డుల కోసం అర్జీలు ఇచ్చినట్లు చెప్పారు. వీరందరికీ ఎటువంటి రుసుం లేకుండా సర్టిఫికెట్లను అందజేసినట్లు చెప్పారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందించడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మల్లాది విష్ణు అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సురక్ష శిబిరాలను ప్రజలందరూ సద్వినియోపరచుకోవాలని కోరారు. అనంతరం సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీఓయూసిడి శకుంతల, స్పెషల్ ఆఫీసర్ అనసూయ, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News