-జిల్లాలో 99 పరీక్షా కేంద్రాల ద్వారా 39,544 విద్యార్థులకు గాను 38,822 మంది హాజరు.
-జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ప్రశాంతంగా నిర్వహిస్తున్నామని తొలిరోజు మొదటి సంవత్సరం పరీక్షకు 99 కేంద్రాల ద్వారా 39,544 మంది విద్యార్థులకుగాను 38,822 మంది హాజరు కాగా 722 మంది గైరుహాజరైనట్లు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. జిల్లాలో శుక్రవారం నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పరిశీలించారు. నగరంలోని బిషప్ అజరయ్య జూనియర్ కళాశాల, శ్రీ శారద కళాశాలలో నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి 39,544 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 38,822 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావడం జరిగిందన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. పరీక్షలను పారదర్శకంగా ప్రశాంత వాతావారణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం గది లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలలోనికి ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించడం లేదన్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా పరీక్షించి మాల్ ప్రాక్టీస్ కు పాల్పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. ఒక్కొక్క పరీక్షా కేంద్రానికి ఒక చీఫ్ సూపెరిండెంటెంట్, రెండు ఫ్లైయింగ్ స్క్వాడ్ లను, రెండు సిట్టింగ్ స్క్వాడ్ లను, 3 వేల 500 మంది ఇన్విజిలేటర్లను నియమించి పరీక్షలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలలో నిరంతరం విద్యుత్ సరఫరా, త్రాగు నీరు వంటి సౌకర్యాలను కల్పించామన్నారు. పరీక్ష హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ఏపిఎస్‌ఆర్‌టిసి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు.
Prajavartha Online Telugu News