గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల నిర్వహణలో సెక్ట్రోరల్ అధికారులది కీలక పాత్ర అని, ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు సెక్ట్రోరల్ అధికారుల ఎన్నికల సజావుగా జరగడానికి భాధ్యత తీసుకోవాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కీర్తి చేకూరి తెలిపారు. సాదారణ ఎన్నికల విధులపై సెక్ట్రోరల్, రూట్ అధికారులకు అదనపు కమిషనర్ పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ కె.రాజ్యలక్ష్మీతో కలిసి శనివారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 22 మంది సెక్ట్రోరల్, 22 మంది రూట్ అధికారులకు విధులు కేటాయించామన్నారు. ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన నాటి నుండి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వస్తుందని, సెక్ట్రోరల్ అధికారులు ముందుగా తమకు కేటాయించిన ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలన్నారు. సెక్ట్రోరల్ అధికారులు ముందుగా ఎన్నికల సంఘం నిబందనలు, మార్గాదర్శకాలతో కూడిన హ్యాండ్ బుక్ ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సూచించారు. ఎన్నికల కోడ్ వచ్చిన అనంతరం జిఎంసిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు. సెక్ట్రోరల్ అధికారులు పోలింగ్ కేంద్రాల పరిశీలనకు వెళ్లినప్పుడు స్థానిక బిఎల్ఓలు అందుబాటులో ఉంటారని, పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల కమిషన్ నిబందనల మేరకు రూపొందించిన చెక్ లిస్టు మేరకు పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులకు, వికలాంగులకు, వీలుగా ర్యాంపులు, విద్యుత్, త్రాగునీటి సరఫరా, మరుగు దొడ్లు వంటి కనీస వసతులపై రిపోర్ట్ ఇవ్వాలన్నారు. శనివారం సాయంత్రానికి పోలింగ్ స్టేషన్ నంబర్, పేరు, ప్రాంతం, బిఎల్ఓ, రూట్ ఆఫీసర్, మ్యాప్ తదితర వివరాలతో ప్రత్యేకంగా సెక్ట్రోరల్ అధికారులతో ఏర్పాటు చేసిన వాట్స్ అప్ గ్రూప్ లో పోస్ట్ చేస్తామన్నారు. ఎన్నికల సంఘం ఈ పర్యాయం నూతనంగా క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో లోపల, వెలుపల వెబ్ క్యాస్టింగ్ చేయాలని నిర్ణయం చేసిందని, అందుకు తగిన విధంగా విద్యుత్ లైన్, కేబుల్ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఏ సమస్య ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
కార్యక్రమంలో ఏఆర్ఓ నిరంజన్, ఏఈఆర్ఓ ప్రదీప్ కుమార్, మేనేజర్ శివన్నారాయణ, ఎన్నికల విభాగ సూపరిండెంట్లు సాంబశివరావు, ప్రసాద్, పద్మ, సెక్ట్రోరల్ అధికారులు, రూట్ అధికారులు, వివిధ విభాగాల సూపరిండెంట్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News