మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రకృతి వైపరీత్యాల వలన దెబ్బతిన్న 93,665 మంది రైతులను ఆదుకునేందు కోసం రాష్ట్ర ప్రభుత్వం 101.44 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి లోని వారి క్యాంపు కార్యాలయం నుండి 2023 లో వర్షాభావం, డిసెంబర్ 2023లో మిచౌంగ్ తుఫాను ప్రభావంతో సంభవించిన అధిక వర్షాల వలన నష్టపోయిన వ్యవసాయ ఉద్యానవన రైతులు 11.60 లక్షల మందికి రు.1295 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని బటన్ నొక్కి వారి ఖాతాలో నేరుగా జమ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి మచిలీపట్నం కలెక్టరేట్ విసీ హాల్ నుండి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సరం డిసెంబర్ 3 వ తేదీ నుంచి 6 వ తేదీ వరకు కురిసిన మిచౌంగ్ తుఫాను వర్షం వలన ఖరీఫ్ 2023లో సాగు చేయబడి వివిధ దశలో ఉన్న వరి, మొక్కజొన్న, మినుము, వేరుశనగ, పత్తి పంటలు ముంపునకు గురై నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ, మండల, రెవెన్యూ డివిజనల్ స్థాయిల్లో వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో ఇన్యుమరేషన్ కమిటీ ఏర్పాటు చేసి మిచౌంగ్ తుఫాను వర్షము వలన పంటలు కోల్పోయిన రైతుల జాబితాలను గ్రామాల వారీగా తయారుచేసి నష్టపరిహారం కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. జిల్లాలో 58,835.56 హెక్టార్లలో వ్యవసాయ పంటలు నష్టపోయిన 92,318 మంది రైతులకు రు.99.90 కోట్లు సబ్సిడీ, 462.42 హెక్టారులలో ఉద్యాన పంటలు నష్టపోయిన 1209 మంది రైతులకు 1.12 కోట్ల రూపాయలను ఇన్పుట్ సబ్సిడీ మొత్తం 93,527 మంది రైతులకు రు.101.02 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. అలాగే గత మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న జొన్న పంటలలో 164.84 హెక్టార్లలో కోత అనంతరం జరిగిన పంట నష్టాలకు గాను 138 మంది రైతులకు 41.21 లక్షల పంట నష్టపరిహారం నేడు ముఖ్యమంత్రి సంబంధిత రైతుల ఖాతాలో జమ చేశారన్నారు. ఆ ప్రకారం జిల్లా మొత్తం కలిపి 93,365 మంది రైతులకు 101.44కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా కొందరు రైతులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారి అభిప్రాయాన్ని తెలియజేశారు వారి వివరాలు ఇలా ఉన్నాయి:
పేకేటి సీతారామిరెడ్డి, కాజా గ్రామం, మొవ్వ మండలం.
డిసెంబర్ మాసంలో వచ్చిన మిచౌంగ్ తుఫాను వలన, తాను 5 ఎకరాల్లో వేసిన వరి పంట నష్టపోయి దిగాలుగా ఉన్న సమయంలో వెంటనే ప్రభుత్వం స్పందించి పంట నష్టం వివరాలను అంచనా వేయుటకు గ్రామాలకు వ్యవసాయ బృందాలను పంపించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల పట్ల ప్రేమతో ఎకరాకు రు.6800 లు చొప్పున పంట నష్టపరిహారం చెల్లించడం జరిగిందన్నారు. అ ప్రకారం తనకు 5 ఎకరాలకు గాను 34 వేల రూపాయలు తన ఖాతాలో జమ అయిందన్నారు. అంతే కాకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా తనకు 80% సబ్సిడీ కింద మినుము విత్తనాలను అందజేసి ఆదుకున్నారన్నారు. సచివాలయాల పరిధిలో యంత్ర సేవా పథకం కింద కంబైన్డ్ హార్వెస్టర్ లను సమకూర్చడంతో పాటు ఈ క్రాప్ విధానం ద్వారా దళారుల ప్రమేయం లేకుండా ధాన్యంకు ఎక్కువ మద్దతు ధర వస్తుందన్నారు.
ఆర్.బి.కెల ద్వారా మంచి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పచ్చిరొట్ట విత్తనాలు అందజేస్తున్నారన్నారు. వ్యవసాయం మీద ఖర్చు తగ్గించేందుకు అన్ని విధాల గ్రామాల్లో ఉండే వ్యవసాయ సహాయకులు తోడ్పడుతున్నారన్నారు. ఇన్ని విధాలుగా ఆదుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.
2. జి శ్రీనివాసరావు ఎస్ఎన్ గొల్లపాలెం మచిలీపట్నం
తనకున్న 5 ఎకరాల వ్యవసాయ భూమి లో వరి నాట్లు వేశానని పంట చేతికి వచ్చే సమయంలో గత డిసెంబరు మాసంలో మిచౌంగ్ తుఫాను వచ్చి పంట అంతా పూర్తిగా నష్టపోయానని ఆ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వ్యవసాయ అధికారులు తమ గ్రామానికి వచ్చి ఆ పంట నష్టం అంచనాలు వేశారన్నారు. ఆ ప్రకారం నేడు ఎకరాకు 6,800 రూపాయల చొప్పున 5 ఎకరాలకు 34 వేల రూపాయలను జమ చేసి ఆదుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తన తరపున రైతాంగం తరపున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. అలాగే తుఫాను వలన రంగు మారిన ధాన్యము, మొలకెత్తిన ధాన్యము అన్ని కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా సరైన మద్దతు ధరకు కొనుగోలు చేసి హమాలీ రవాణా చార్జీలు కూడా అన్నీ కలిపి నా అకౌంట్ కు 21 రోజుల్లో జమ చేస్తారని చెప్పినప్పటికీ అంతకు ముందుగానే 5 రోజులకే నగదు జమ చేయడం వలన చాలా ఉపయోగం కలిగిందన్నారు. 80 శాతం సబ్సిడీతో మినుము విత్తనాలు ఇచ్చారని వాటిని చల్లినామని ఈ రోజున రెండో పంటగా మినుము బాగా పండిందన్నారు.
వైఎస్ఆర్ రైతు భరోసా కింద సంవత్సరానికి 13500 రూపాయలు రైతులకు వ్యవసాయ పెట్టుబడి కింద ఎంతగానో మేలు జరుగుతుందన్నారు.
వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద గత రెండు సంవత్సరాల వచ్చిన నివార్ తుఫాను వలన దెబ్బతిన్న పంటకు 15 వేల రూపాయలు ఉచితంగా బీమా వచ్చిందన్నారు. రైతాంగాన్ని అన్ని విధాల ఆదుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కి హృదయపూర్వకంగా తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకటరామయ్య(నాని), పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ జన్ను రాఘవరావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్పర్సన్ జమల పూర్ణమ్మ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ బోర్డు డైరెక్టర్ దిలీషాద్ నజరానా,జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.పద్మావతి, జిల్లా ఉద్యాన అధికారి జే. జ్యోతి వ్యవసాయ శాఖ డిడి మణిదర్, మనోహర్, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు శ్రీకాకుళ నాగేశ్వరరావు, పట్టపు నాని వివిధ రైతు సంఘాల నాయకులు పలువురు రైతులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News