విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అజిత్ సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ ఎన్డీఏ అసెంబ్లీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా ప్రజలు ముఖ్యంగా అజిత్ సింగ్ నగర్, రాజీవ్ నగర్, కండ్రిక, వాంబే కాలనీ ప్రాంతాలకు చెందిన ప్రజలు కలుషిత మైన నీరు త్రాగటం వలన అనేక అనారోగ్యాలకు గురి అవుతున్నారని ఈ విషయమై తనకు కూడా అనేక ఫిర్యాదులు అందటంతో కార్పొరేషన్ అధికారులతో మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి తగు చర్యలు తక్షణం చేపట్టాలని కోరటం జరిగిందని తెలిపారు . వారు స్పందించి ఎక్కడైతే త్రాగునీరు సరఫరా చేసే పైపులైనులో లీకులు ఉన్నాయో అవి సరి చేస్తామని, మంచి నీటిని క్లోరినేషన్ చేస్తామని మరియు అనారోగ్యం బారిన పడిన ప్రజలను తక్షణం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా చికిత్సను అందజేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
ప్రజలు కూడా కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని, పరిశుభ్రత పాటించాలని తెలియజేశారు. కార్పొరేషన్ అధికారులు, వైద్యాధికారులు ప్రజారోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ చూపించాలని ప్రజలు డయేరియా బారిన పడుతున్నారని, చిన్నపిల్లలు, వృద్ధులు వాంతులు విరోచనాలతో వైద్యశాలల్లో చేరుతున్నారని వారిని తక్షణం ఆదుకోవాలని తెలియజేశారు. విజయవాడ నగరంలో అనేక సంవత్సరాలుగా త్రాగునీటి పైపు లైన్లు మరమ్మత్తులు చేయకపోవడం వలన వాటి లీకులలో కలుషిత నీరు కలిసి ఈ రకంగా జరిగి ఉండొచ్చని ఆందోళన వెలుబుచ్చారు.
తాను రేపటినుండి క్షేత్రస్థాయిలో ముఖ్యంగా స్లమ్ ఏరియాలలో పర్యటించి ఆ పరిసర ప్రాంతాల్లో సమస్యలను అధికారుల దృష్టికి , వైద్యాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యలను పరిష్కరించటంలో కృషి చేస్తానని తెలిపారు. ఇప్పటికే సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కలుషిత నీరు తాగి ఇబ్బంది పడుతున్న ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. ప్రజలు పరిశుభ్రత పాటించి కాచి చల్లార్చిన నీటిని తాగాలని ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని తెలియజేశారు. రాబోయేది వర్షాకాలమని కలుషితమైన నీరు త్రాగటం వలన డయేరియా, కలరా వంటి వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని కాబట్టి త్రాగు నీరు విషయంలో శ్రద్ధ వహించాలని ప్రజలకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, మాజీ ఏఎంసి డైరెక్టర్ ఘంటా కృష్ణమోహన్ పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …