-జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు
-పటిష్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపు: సీపీ పీహెచ్‌డీ రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన కౌంటింగ్ ప్రక్రియను చేపట్టేందుకు పటిష్ట ప్రణాళికతో ఏర్పాట్లు చేయడం జరిగిందని.. అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి ఓట్ల లెక్కింపును విజయవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నోవా, నిమ్రా కళాశాలల్లో ఓట్ల లెక్కింపునకు చేసిన ఏర్పాట్లు, కౌంటింగ్ రోజు భద్రతా ఏర్పాట్లు తదితరాలపై కలెక్టర్ డిల్లీరావు, పోలీస్ కమిషనర్ పీహెచ్‌డీ రామకృష్ణ.. జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తదితరులతో కలిసి రిటర్నింగ్ అధికారులు, వివిధ విభాగాల నోడల్ అధికారులు, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రాలకు అధికారులు, సిబ్బంది సకాలంలో చేరుకునేలా చేయడంతో పాటు వాహనాల పార్కింగ్, భద్రత, మొబైల్ ఫోన్ల కలెక్షన్ పాయింట్లు, ఆహారం, తాగునీరు, మరుగుదొడ్లు, అంబులెన్సులు, వైద్య శిబిరాలు, ఎక్కడా ఎలాంటి గందరగోళానికి తావులేకుండా సూచిక బోర్డుల ఏర్పాట్లు, గుర్తింపు కార్డుల జారీ, అంతరాయం లేని విద్యుత్ సరఫరా, టెంట్లు, కుర్చీలు వంటి వసతుల ఏర్పాటు, అభ్యర్థులు, ఎలక్షన్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లకు అవసరమైన సౌకర్యాలు, మీడియా సెంటర్ తదితరాలపై సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంతో పాటు కేతనకొండ, కొండపల్లి తదితర ప్రాంతాల నుంచి బస్సుల ఏర్పాటుకు సంబంధించి సూచనలు చేశారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఆరు గంటలకు చేరుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ కమిషనర్ పీహెచ్‌డీ రామకృష్ణ తెలిపారు. పార్కింగ్, ఎంట్రీ గేట్, మొబైల్ కలెక్షన్ పాయింట్లు తదితరాల వద్ద చేపడుతున్న ఏర్పాట్లను వివరించారు. సమావేశంలో డీసీపీలు అధిరాజ్ సింగ్ రాణా, కె.శ్రీనివాసరావు, అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోఖ్వాల్, డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, రిటర్నింగ్ అధికారులు బీహెచ్ భవానీ శంకర్, కె.మాధవి, ఎ.రవీంద్రరావు, ఇ.కిరణ్మయి, జి.వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, డ్వామా పీడీ కె.సునీత తదితరులతో పాటు పోలీస్ అధికారులు, నోడల్ అధికారులు ఉన్నారు.