తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలు 2024 లో భాగంగా నేడు (జూన్ 04) న జరగనున్న కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం సాయంత్రం శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో లోని కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని 7 అసెంబ్లీ , ఒక పార్లమెంటు నియోజకవర్గాలకు సంబందించి శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో జరిగే ఓట్లు లెక్కింపు ప్రక్రియ కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, కౌంటింగ్ కేంద్రాలలో బ్యారీ కేడింగ్, టేబుల్స్, కుర్చీలు, ఏజెంట్లకు సీటింగ్, మౌలిక సదుపాయాలు కల్పన, పటిష్ట బందోబస్తు చర్యలు, పార్కింగ్ ఏర్పాట్లు, మీడియా సెల్ ఏర్పాటు, తదితర అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని, ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావులేకుండా పోలీసు శాఖ ద్వారా భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొననున్న సిబ్బందికి తగిన శిక్షణ, సూచనలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.
కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో మొదలు అవుతుందని , 8.30 గం.లకు ఈవిఎం ల లెక్కింపు ప్రారంభం అవుతుందని తెలిపారు. ఉదయం 7 గం.లకు అబ్జర్వర్లు, అభ్యర్థులు, ఏజెంట్లు సమక్షంలో స్ట్రాంగ్ రూం లను తెరచి సంబంధిత కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. తిరుపతి పార్లమెంట్ కు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ మొత్తం 14 టేబుల్ లు, 3 రౌండ్లలో పూర్తి అయ్యేలా సాయంత్రం 4గం. ల కల్లా ఫలితాలు వెళ్ళడించెలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.120- గూడూరు కు సంబంధించి 294 పోలింగ్ కేంద్రాలు ఉన్న నేపథ్యంలో పిసి కొరకు 14, అసెంబ్లీ కొరకు 14 టేబుల్ లు ఏర్పాటుతో 21 రౌండ్లు సుమారు సాయంత్రం 3.50 గం.లకు ఫలితాలు ప్రకటించేలా, 121- సూళ్లూరుపేట కు సంబంధించి 304 పోలింగ్ కేంద్రాలు ఉన్న నేపథ్యంలో పిసి కొరకు 14, అసెంబ్లీ కొరకు 14 టేబుల్ లు ఏర్పాటుతో 22 రౌండ్లు సుమారు సాయంత్రం 4.10 గం. లకు ఫలితాలు ప్రకటించేలా, 122- వెంకటగిరి కి సంబంధించి 299 పోలింగ్ కేంద్రాలు ఉన్న నేపథ్యంలో పిసి కొరకు 14, అసెంబ్లీ కొరకు 14 టేబుల్ లు ఏర్పాటుతో 22 రౌండ్లు సుమారు సాయంత్రం 4.10 గం.ల వరకు ఫలితాలు ప్రకటించేలా, 167- తిరుపతి కి సంబంధించి 274 పోలింగ్ కేంద్రాలు ఉన్న నేపథ్యంలో పిసి కొరకు 14, అసెంబ్లీ కొరకు 14 టేబుల్ లు ఏర్పాటుతో 20 రౌండ్లు సుమారు సాయంత్రం 3.30 గం.ల వరకు ఫలితాలు ప్రకటించేలా, 168- శ్రీకాళహస్తి కి సంబంధించి 293 పోలింగ్ కేంద్రాలు ఉన్న నేపథ్యంలో పిసి కొరకు 14, అసెంబ్లీ కొరకు 14 టేబుల్ లు ఏర్పాటుతో 21 రౌండ్లు సుమారు సాయంత్రం 3.50 గం.ల వరకు ఫలితాలు ప్రకటించేలా, 169- సత్యవేడు కి సంబంధించి 279 పోలింగ్ కేంద్రాలు ఉన్న నేపథ్యంలో పిసి కొరకు 14, అసెంబ్లీ కొరకు 14 టేబుల్ లు ఏర్పాటుతో 20 రౌండ్లు సుమారు సాయంత్రం 3.30 గం.ల వరకు ఫలితాలు ప్రకటించేలా,చిత్తూరు పార్లమెంట్ నియోజక వర్గ 166-చంద్రగిరి అసెంబ్లీ నియోజక వర్గానికి సంబంధించి 397 పోలింగ్ కేంద్రాలు ఉన్న నేపథ్యంలో పిసి కొరకు 20 అసెంబ్లీ కొరకు 20 టేబుల్ లు ఏర్పాటుతో 20 రౌండ్లు సుమారు సాయంత్రం 3.30 గం.ల వరకు ఫలితాలు ప్రకటించేలా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రతి రౌండ్ సరాసరి 3 గం.లు పడుతుందని ఏడు నియోజక వర్గాలకు సంబంధించి 22795 పోస్టల్ బ్యాలెట్ మరియు ఈటిపీబి కలిపి మొత్తం ఉండగా, మొత్తం 28 టేబుల్ ల ఏర్పాటుతో 15 రౌండ్లలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అసెంబ్లీ నియోజక వర్గ, పార్లమెంట్ నియోజక వర్గ కౌంటింగ్ సంబంధిత ఎ ఆర్ ఓ, ఆర్ ఓ లు నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. బెల్ ఇంజినీర్లు అందుబాటులో ఏర్పాటు చేశామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత ఆగరాదని ఫలితాలు ప్రకటించే వరకు కొనసాగాలని తెలిపారు. ఈసిఐ నిబంధనల మేరకు కౌంటింగ్ జరగాలని సూచించారు. కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత సీలింగ్ ఆఫ్ ఈవిఎం లు మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కౌంటింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బంది కౌంటింగ్ కేంద్రం లోనికి సెల్ ఫోన్ అనుమతి లేదని తెలిపారు. రిటర్నింగ్ అధికారి నిర్ణయం తుది నిర్ణయం అని నిబంధనలు మేరకు చర్యలు ఉండాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రంలో ఏజెంట్లు ఎలాంటి గొడవలకు తావివ్వరాదని అలాంటి సందర్భంలో రిటర్నింగ్ అధికారి సూచనల మేరకు పోలీసుల చర్యలు ఉంటాయని సీసీటీవీలో ప్రతి అంశం రికార్డు అవుతుందని, అందరూ కౌంటింగ్ సజావుగా నిబంధనల మేరకు జరిగేలా సహకరించాలని కోరారు. ఉదయం 5:15 గంటలకు మూడవ ర్యాండమైజేషన్ చేపట్టి వారికి టేబుల్ కేటాయించడం జరుగుతుందని ఎన్నికల కమిషన్ నుండి మార్గదర్శకాల మేరకు కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు. రౌండ్ వారీగా మీడియా సెంటర్ కు కౌంటింగ్ ఫలితాలు అందజేయాల్సి ఉంటుందని సంబంధిత రిటర్నింగ్ అధికారులు తగు చర్యలు చేపట్టాలని సూచించారు.
జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో 144 సెక్షన్ అమలులో ఉందని తెలిపారు. రోడ్లు, బహిరంగ ప్రదేశాలలో బాణసంచా పేల్చడం, కాల్చడం పూర్తిగా నిషేధం అని పేర్కొన్నారు. విజయోత్సవ ర్యాలీలు విజేతలు గానీ, వారి అనుచరులు గానీ, ఊరేగింపులు నిర్వహించడానికి వీలులేదని అన్నారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అందరూ సహకరించాలని ఈ సంధర్భంగా కలెక్టర్ కోరారు.
ఈ సమావేశంలో రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ తదితర అధికారులు పాల్గొన్నారు.