-ప్రకృతి రక్షణకై నడుం బిగిద్దాం.. మట్టి, నీరు, గాలి కలుషితం కాకుండా కాపాడుకుందాం
-మొక్కలను నాటుదాం.. పర్యావరణానికి రక్షణగా నిలుద్దాం
-వేస్ట్ నుండి ఎనర్జీ దిశగా పయనం ప్రగతికి ముందడుగు
-కాలుష్య నివారణలో అందరం భాగస్వాములవుదాం
-పర్యావరణహిత జీవనశైలి అందరూ అలవర్చుకోవాలి..
-ఏపీపీసీబీ మెంబర్ సెక్రటరీ బి. శ్రీధర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకృతిని రక్షిద్దాం.. భావితరాలకు ఆదర్శంగా నిలుద్దామని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సభ్య కార్యదర్శి బి. శ్రీధర్ పిలుపునిచ్చారు. విజయవాడలోని ఎన్ ఏ సీ కళ్యాణమండపంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం – 2024 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బి. శ్రీధర్ మాట్లాడుతూ.. మానవ మనుగడ సజావుగా సాగాలంటే ప్రకృతిని కాపాడుకోవాలన్నారు. ప్లాస్టిక్, వేస్ట్ మేనేజ్ మెంట్ పై అవగాహన లేకపోతే భావితరాల భవిష్యత్ ను చేజేతులా మనమే నాశనం చేసినవాళ్లమవుతామని హెచ్చరించారు. ప్రధానంగా మట్టి, నీరు, గాలి కలుషితం కాకుండా ఇప్పటి నుండే చర్యలు తీసుకునే విధంగా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని కోరారు. 1972 నుంచి జూన్ 5వ తేదీన పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని ఇది 52వ పర్యావరణ దినోత్సవమని తెలిపారు. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో పర్యావరణ రక్షణకై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వేస్ట్ నుండి ఎనర్జీ దిశగా అడుగులు మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అంతే కాకుండా పర్యావరణహిత జీవనశైలిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై ప్రతి ఒక్కరూ తమ వంతుగా నిషేధం పాటించాలని, మార్కెట్ కు వెళ్లేటప్పుడు క్లాత్ సంచిని తీసుకువెళ్లాలని సూచించారు. పెద్ద పరిశ్రమల నుండి వెలువడే కార్బన్ డై ఆక్సైడ్ మాత్రమే కాలుష్యం అనుకుంటున్నామని, ఆహార వృథా సైతం పరోక్షంగా పర్యావరణ కాలుష్యానికి కారణమవుతోందన్నారు. ఒక వ్యక్తి ఒక పూట తీసుకునే ఆహారం పండించడానికి కనీసం 4 వేల లీటర్ల నీరు అవసరమవుతోందన్న విషయంపై సామాజిక స్పృహ కలిగి ఉండాలన్నారు. తద్వారా ఆహార, నీటి వృథాను సమర్థవంతంగా అరికట్టవచ్చన్నారు. భావితరాల భవిష్యత్ మన చేతుల్లోనే ఉందని.. ఎన్విరాన్ మెంట్ పరిరక్షణకు ఇప్పటి నుండే నడుం బిగించాలని బి.శ్రీధర్ పిలుపునిచ్చారు. ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా భూమిలోని ఖనిజాలను వెలికితీస్తున్నామని ఇది క్షేమకరం కాదన్నారు. వర్షపు నీరు వృథా కాకుండా, భూమి కోతకు గురికాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో మొక్కలను నాటాలని బి.శ్రీధర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
అకడమిక్స్ డైరెక్టర్ JNTU (కాకినాడ) ప్రొ. K.V.S.G మురళీకృష్ణ మాట్లాడుతూ.. మానవుడి ప్రథమ కర్తవ్యం ప్రకృతిని కాపాడటమేనని అన్నారు. మానవుల ప్రవర్తన ప్రకృతి హితంగా ఉండాలని, పుడమి ఇచ్చిన అవకాశాన్ని నాశనం చేసుకోరాదని హెచ్చరించారు. ఆంధ్రా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ డా. కె. కామేశ్వరరావు మాట్లాడుతూ… సహజ వనరులు వృథా చేసుకోవడం క్షమించరాని నేరమన్నారు. భూమిపై ఒక సెంటిమీటర్ మట్టి పొర ఏర్పడాలంటే కనీసం వందేళ్లు పడుతుందన్నారు. పర్యావరణంపై ప్రేమను పెంచుకోవాలని కోరారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుండే ఒక ఉద్యమంలా ప్రారంభించేలా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేసి మనసా వాసా కర్మణా పాటించాలని కోరారు.
కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ కళాకారులు ప్రదర్శించిన బుర్రకథ ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకుల మనస్సులను రంజింపచేశాయి. అనంతరం క్విజ్, చిత్రలేఖనం, వ్యాసరచన తదితర పోటీల్లో విజేతలుగా నిలిచిన కేబీఎన్ కళాశాల, విఎస్పీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు బహుమతులు అందచేశారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎన్. వి. భాస్కర రావు, పరిరక్షణ సంస్థ అధ్యక్షులు ఎ.వి.రత్నం, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి జోనల్ కార్యాలయ అధికారి జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పి.మునిస్వామి నాయుడు, ప్రాంతీయ కార్యాలయ అధికారి పి.శ్రీనివాసరావు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.