Breaking News

ప్రజలు మనల్ని బలంగా నమ్మారు… మనం అంతే బలంగా వారి కోసం పని చేద్దాం

-పారదర్శకంగా, బాధ్యతతో కూడిన పాలన అందిస్తాం
-రాజకీయాలను కెరీర్ చేసుకోవాలనే స్ఫూర్తిని యువతలో నింపుతాం
మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యేల సమావేశంలో పవన్ కళ్యాణ్ 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘ప్రజలు మనల్ని బలంగా నమ్మి కనీవినీ ఎరుగని విజయాన్ని అందించారు. మనకు వచ్చిన ప్రతీ ఓటు మనకు బాధ్యతను గుర్తు చేసేదే. అయిదు కోట్ల మందికీ జవాబుదారీగా ఉండాలి’ అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్  స్పష్టం చేశారు. బుధవారం ఉదయం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ తరఫున విజేతలుగా నిలిచిన అభ్యర్థులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ప్రజల కష్టం నుంచి పన్నులు కట్టే సొమ్మును ఓ ప్రజా ప్రతినిధిగా జీతం రూపంలో బాధ్యతగా తీసుకుంటాను. నేను రూపాయి జీతం తీసుకుంటాను లాంటి ఆర్భాటపు మాటలు కాకుండా ప్రజా ఖజానా నుంచి సంపూర్ణ జీతం తీసుకుంటాను. ఎందుకంటే ప్రజలు మా పన్నుల ద్వారా వచ్చిన డబ్బును జీతంగా తీసుకుంటున్నావు… మాకు పనులు ఎందుకు చేసి పెట్టవని అడగడానికి వారికి అజమాయిషీ ఉంటుంది. నాకు కూడా ప్రజల డబ్బులు జీతంగా తీసుకుంటున్నాననే బాధ్యత నిరంతరం ఉంటుంది. అందుకే నేను సంపూర్ణంగా జీతం తీసుకొని… అంతే సంపూర్ణంగా ప్రజల కోసం కష్టపడతాను. ప్రజల కోసం ఎంత జీతం తీసుకున్నా వెయ్యి రెట్లు దానికి మించి వారికి కష్టాల్లో ఇస్తాను. అది వేరే విషయం. ప్రజలకు అన్ని కష్టాల్లో అండగా నిలుస్తాను.

ప్రజల మన్ననలు పొందేలా నడుచుకోవాలి
సినిమాలకు సెన్సార్ ఉంటుంది. ఇంట్లో టీవీలకు ఉండదు. టీవీల్లో చూసేవి ఇంట్లో అందరినీ ప్రభావితం చేస్తాయి. శాసనసభ సమావేశాలుగానీ, ప్రజాప్రతినిధుల మాటలుగానీ టీవీల్లో చూస్తున్నప్పుడు భావి తరాల వారు వాటిని స్ఫూర్తిగా తీసుకునేలా జనసేన నాయకులు మాట్లాడాలి, నడుచుకోవాలి. అలాగే జనసేన ప్రయాణం ఉంటుంది. రాజకీయాలను కెరీర్ చేసుకోవాలనే స్ఫూర్తిని యువతలో నింపేలా జనసేన ముందుకు సాగుతుంది. నాయకులు కూడా అంతే బాధ్యతగా మెలగాలని ఆశిస్తున్నాను. జవాబుదారీతనంతో కూడిన పారదర్శక పాలన ఎలా ఉంటుందో ప్రజలకు మనం చూపిద్దాం. రాష్ట్రానికి సంబంధించిన ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రజల మన్ననలు అందుకొనేలా నడుచుకోవాలి. గెలుపు తీసుకువచ్చే అతిశయం ఉండకూడదు.
ఇప్పుడు కేంద్రంలోనూ ఆంధ్రప్రదేశ్ కీలకం కానున్న తరుణంలో జనసేన నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీలు రాష్ట్ర సమస్యలను పార్లమెంటులో లేవనెత్తాలి. ప్రతి చర్చలో పాల్గొనేలా ప్రజలకు సంబంధించిన ప్రతి అంశం మీద స్పందించేలా దేశమంతా జనసేన వాణి వినిపించేలా ఎంపీలు పనిచేయాలి. గెలిచిన ఇద్దరూ 5 కోట్ల మంది తరఫున నిలబడాలి. ఇప్పటి వరకు దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి ఇవ్వని గెలుపును రాష్ట్ర ప్రజలు జనసేనకు అందించారు. ఇదో పెద్ద బాధ్యత దానిని అంతే సక్రమంగా నిర్వర్తించాలి. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తీర్చేలా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా జాగ్రత్తగా పనిచేయాలి. నాతో సహా అందరికీ భారీ మెజార్టీని ఇచ్చి ప్రజలు గెలిపించారు. అంటే ప్రజలు అంత నమ్మకాన్ని మనమీద ఉంచారని అర్థం చేసుకోండి.

ప్రజలకు ఏ కష్టం వచ్చిన స్పందిస్తాము
నాతో సహా ప్రతి ఒక్కరు బాధ్యతగా ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం ఉన్నత దశలో పయనించాలి. దానికి ప్రతి ఒక్కరు ప్రణాళికబద్ధంగా పనిచేయాలి. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కష్టాల్లోనే ఉన్నారు. వారిని బయటకు తీసుకురావాల్సిన అవసరం ప్రజాప్రతినిధులుగా మన మీద చాలా ఉంది. దానిని మనం వందశాతం నెరవేర్చాలి. అవినీతిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ను బయటకు తీసుకొచ్చి నవ పునాదులు బలంగా నిర్మించాలి. దీనికి ప్రతి ఒక్కరి శ్రమ అవసరం. ప్రజాప్రతినిధులు అంటే ఇంత అద్భుతంగా ఉంటారా అని ప్రజలు మనల్ని మెచ్చుకునేలా పని చేద్దాం. జనసేన పార్టీ కార్యాలయం కొత్తగా నిర్మితమవుతోంది. దానిని 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దుతాం. ప్రజలకు ఏ కష్టం వచ్చినా… ఏ నష్టం పలకరించినా ఎల్లవేళలా జనసేన పార్టీ కార్యాలయం తలుపులు తెరిచే ఉంటాయి. వారికి అండగా ఉండేందుకు అన్ని సమయాల్లో సదా సిద్ధంగా ఉందాం” అన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *