– ఈ నెల 16న విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు పూర్తి సన్నద్దంగా ఉండాలి
– 25 కేంద్రాల్లో 11,112 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు
– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 16వ తేదీ ఆదివారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించనున్న ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష-2024కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
యూపీఎస్సీ ఈ నెల 16న దేశ వ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్ నిర్వహించనున్న నేపథ్యంలో కలెక్టర్ డిల్లీరావు శుక్రవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో యూపీఎస్సీ పరిశీలకులు సుబ్రహ్మణ్యంతో కలసి పరీక్షా కేంద్రాల సూపర్ వైజర్లు, సహాయ సూపర్ వైజర్లతో సమావేశం నిర్వహించారు. పరీక్ష నిర్వహణ సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు మాట్లాడుతూ విజయవాడలో 25 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్న పరీక్షకు 11,112 మంది అభ్యర్థులు హాజరుకానున్న నేపథ్యంలో పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలన్నారు. ఉదయం 9.30 గం. నుంచి 11.30 గం. వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గం. నుంచి 4.30 గం. వరకు పేపర్-2 పరీక్ష జరగనుందని తెలిపారు. పరీక్ష నిర్వహణకు 25 మంది రూట్ అధికారులు, 25 మంది సూపర్‌వైజర్లు, 25 మంది సహాయ సూపర్‌వైజర్లు పరీక్ష నిర్వహణను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖను, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆయా రూట్లలో అదనపు బస్సులను నడపాలని ప్రజా రవాణా అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీటీవీల నిఘాతో పాటు జామర్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ డిల్లీరావు ఆదేశించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లను చేయాలని.. చెక్ లిస్ట్ ప్రకారం ఏర్పాట్లను పూర్తిచేయాలని స్పష్టం చేశారు. అభ్యర్థులు నిబంధనలను తూచా తప్పకుండా పాటించేలా చూడాలని స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్, డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్యం, విద్యుత్, ఏపీఎస్ఆర్‌టీసీ, మునిసిపల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.