– ప్రభుత్వ సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు చేరువ చేద్దాం
– రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపరచి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలపాలన్న గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనలను ఆచరణలో పెట్టడంతో పాటు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరికీ చేరువ చేయడంలో సమాచార, పౌర సంబంధాల శాఖ సఫలీకృతమయ్యేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు; గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు; గృహ నిర్మాణ శాఖ మంత్రిగా నియమితులైన కొలుసు పార్థసారథిని శుక్రవారం పెనమలూరు మండలం, తాడిగడప కామినేని ఆసుపత్రి రోడ్డులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందజేశారు. అనంతరం సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రచార విధివిధానాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి వంటి సమాచార, పౌర సంబంధాల శాఖ పనితీరు ఎంతో కీలకమైందన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి పేద, బడుగు, బలహీన వర్గాల ఆర్థికాభివృద్ధికి అమలుచేసే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువచేయడంలో వినూత్న విధానాలను అవలంబించాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుతం అమలుచేస్తున్న విధానాలతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని భిన్న ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడంలో సఫలమైనప్పుడు, వాటిని ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నప్పుడు ముఖ్యమంత్రి ఆలోచనలను ఆచరణలో పెట్టినవారమవుతామని అన్నారు. ఈ దిశగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమన్వయపరచుకొని ముందుకు వెళ్లాలని మంత్రి కొలుసు పార్థసారథి సమాచార శాఖ అధికారులకు సూచించారు.
మంత్రిని కలిసిన వారిలో సమాచార, పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు ఎల్.స్వర్ణలత, సంయుక్త సంచాలకులు పి.కిరణ్ కుమార్, టి.కస్తూరిబాయి, చీఫ్ ఇంజనీర్ ఒ.మధుసూధన్‌రావు, ఆర్ఐఈ సీవీ కృష్ణారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్లు బి.పూర్ణచంద్రరావు, ఏడీలు జీవీ ప్రసాద్, ఎం.భాస్కర్ నారాయణ, డీఐపీఆర్‌వో యు.సురేంద్రనాథ్, డీపీఆర్‌వో ఎస్‌వీ మోహనరావు, డివిజనల్ పీఆర్‌వో కె.రవి, ప్రచార సహాయకులు వీవీ ప్రసాద్, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.