-ఏపీయూడబ్ల్యూజే నేతలు సుబ్బారావు, జనార్థన్
-విజయవాడ యూనిట్ కార్యదర్శిగా దారం వెంకటేశ్వరరావు ఎన్నిక
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని త్వరలో కల్సి జర్నలిస్టుల సమస్యలు ఆయన దృష్టికి తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి.సుబ్బారావు, ప్రధానకార్యదర్శి చందు జనార్థన్ తెలిపారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన యూనియన్, ప్రెస్‌క్లబ్ సంయుక్త కార్యవర్గ సమావేశానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు అనేకం పెండిరగ్‌లో ఉన్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గతంలో అమలు జరిగే కార్యక్రమాలు కూడా నిల్చిపోయాయన్నారు. ప్రమాద బీమా, మెడిక్లైయిమ్, హౌసింగ్ స్కీం, వృత్తిపరమైన కమిటీల పునరుద్ధరణ, జర్నలిస్టుల సంక్షేమ నిధి, అక్రిడిటేషన్ తదితర అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. ఎన్నికల సందర్భంగా జర్నలిస్టుల సమస్యలను అన్ని రాజకీయపార్టీలు తమ మేనిఫెస్టోల్లో పొందుపర్చాలని కోరుతూ ఆయా పార్టీల అధినేతలను కల్సి వినతిపత్రాలు సమర్పించామని గుర్తు చేశారు. అయితే వైసీపీ, తెలుగుదేశం పార్టీలు జర్నలిస్టుల నివేశనస్థలాలకు సంబంధించిన అంశాన్ని మాత్రమే మేనిఫెస్టోల్లో పేర్కొన్నాయన్నారు. వీటితో పాటు మిగిలిన సమస్యలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలిపారు. విజయవాడ యూనిట్ అధ్యక్షులు చావా రవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు కంచల జయరాజ్, కార్యదర్శి దాసరి నాగరాజు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు ఏచూరి శివ, సామ్నా రాష్ట్ర ప్రధానకార్యదర్శి సీహెచ్.రమణారెడ్డి, ఫొటో గ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు విజయభాస్కర్, ఐజేయూ కౌన్సిల్ సభ్యులు షేక్ బాబు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో విజయవాడ యూనిట్ కార్యదర్శిగా దారం వెంకటేశ్వరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.