Breaking News

గంజాయి, డ్రగ్స్ విచ్చల విడి వినియోగం పై ఉక్కుపాదం మోపుతాం

-రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గంజాయి, డ్రగ్స్ విచ్చల విడి వినియోగంపై మరియు అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలపై ఉక్కుపాదం మోపడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో పటిష్టమైన చర్యలు చేపడతామని రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. బుధవారం ఉదయం 11.19 గంటల సమయంలో అమరావతి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ను విచ్చల విడిగా వినియోగించడం జరుగుచున్నదని, మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపేందుకు ఒక టాస్కుఫోర్సును కూడా త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రజలు శాంతి భద్రత విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని, అటు వంటి సమస్యలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపడతామన్నారు. దిశ చట్టం లేకుండా దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారని, ఆ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా మారుస్తామన్నారు. పోలీస్ శాఖ పరంగా కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు, చాలా పోలీస్ స్టేషన్లలో కనీస సౌకర్యాలు లేకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నారని, ఆ సమస్యలు అన్నింటినీ రాబోయే రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. తమ పార్టీ నాయకులు, ప్రతినిధుల కోసం కాకుండా ప్రజల కోసం, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ అధికారులు ఎటు వంటి రాజీ లేకుండా పనిచేయాలని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా విచ్చల విడిగా విమర్శించేలా, వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా పోస్టులు పెట్టడాన్ని ఏమాత్రము సహించబోమని ఆమె హెచ్చించారు.

ఒక సామాన్య మద్యతరగతి కుటుంబానికి చెందిన తనను రాష్ట్ర హోమ్ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, కొణిదల పవన్ కళ్యాణ్ మరియు కూటమి నాయకులు అందరికీ మరియు పాయకరావుపేట నియోజకవర్గం ప్రజలు అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎంతో నమ్మకంతో తనపై ఉంచిన గురతర భాద్యతను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందజేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

వేద మంత్రోచ్ఛారణల మధ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వంగలపూడి అనిత…
బుధవారం ఉదయం 11.19 గంటల సమయంలో అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర హోమ్ మరియు విప్తత్తుల నిర్వహణ శాఖ మంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం రెండో బ్లాక్ గ్రౌండ్ ప్లోర్లో ఆమెకు కేటాయించిన ఛాంబరులో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఎంతో ఘనంగా రాష్ట్ర మంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా భాద్యతలు చేపట్టేందుకు రాష్ట్ర సచివాలయానికి విచ్చేసిన ఆమెకు వేదపండితులు పూర్ణకుంభంతోను అధికారులు పుష్పగుచ్ఛాలతోను ఘనంగా స్వాగతం పలికారు. పండితుల వేదమంత్రాల మధ్య శాస్త్రోత్తంగా ఆ భగవంతునికి పూజలు జరిపిన తదుపరి తమ సీటులో ఆసీనులయ్యారు.

డిజీపి హరీష్ కుమార్ గుప్తా, హోమ్ ప్రిన్సిఫల్ సెక్రటరీ జి.విజయకుమార్, ఇంటెలిజెన్సు అదనపు డిజీ కుమార విశ్వజిత్, రైల్వేస్ డిజీ త్రిపాఠి ఉజాల, అడిషనల్ డిజీ (లా & ఆర్డర్) ఎస్.బాగ్చీ, ఎపిఎస్పీ అదనపు డిజీ అతుల్ సింగ్, డిఐజీ రాహుల్ దేవ్ శర్మ, పోలీస్ పెర్సనల్ ఐజీ పి.వెంకటరామి రెడ్డి, ఎస్.ఇ.బి. ఐజీ రవి ప్రకాష్, ఎస్పీఎఫ్ ఐజీ త్రివిక్రమ్ వర్మ, ఎపీఎస్పీ డిఐజీ రాజకుమారి తదితర పోలీస్ అదికారులతో పాటు పలువురు అనధికారులు మంత్రికి పుష్పగుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *