అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర చిన్న ,మధ్య సూక్ష్మ పరిశ్రమల, సెర్ప్, ఎన్నారై సంబంధాల శాఖ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ రాష్ట్ర సచివాలయంలోని ఐదవ భవనంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సమేతంగా సచివాలయం చేరుకున్న మంత్రి వేద పండితుల ఆశీర్వచనాల మధ్య శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు చేపట్టి తొలుత శాఖాపరమైన ఫైల్స్ పై సంతకాలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో నాకు ఇచ్చిన ఈ బాధ్యతలను అత్యంత క్రమ శిక్షణతో నిర్వహిస్తానని మంత్రి అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపేందుకు ముఖ్యమంత్రి కొత్తగా మూడు శాఖలను సమన్వయం చేస్తూ ఏర్పాటు చేసిన ఈ శాఖల ద్వారా రాష్ట్రంలో చిన్న పరిశ్రమల ఏర్పాటు, ఎన్నారైల సహకారంతో యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి, ద్వాక్రా గ్రూప్ మహిళల పారిశ్రామిక ఎదుగుదలకు ఒక రోడ్ మ్యాప్ ను త్వరలోనే రూపొందించడం జరుగుతుంది అని మంత్రి తెలిపారు. ఇరవై ఆదర్శ మండలాలకు పది లక్షల రూపాయల చొప్పున నిధులు, ఎస్సీ, ఎస్టీ,ఎస్ హెచ్ జి లకు అందుబాటులో ఉన్న నిధులతో వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తూ రెండు ఫైల్స్ పై బాధ్యతలు స్వీకరిస్తూ తొలి సంతకాలు చేశాను అని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. ప్రిన్సిపల్ కార్యదర్శి శశి భూషణ్ కుమార్,పరిశ్రమల శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్. యువరాజ్,సంబంధిత శాఖల అధికారులు,ఉద్యోగులు మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు.
Tags amaravathi
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …