-ఉపాధి హామీ నిధులు సద్వినియోగం కావాలి
-నిధుల వినియోగం, సోషల్ ఆడిట్ నిర్వహణపై సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
-ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ అధికారులతో రెండున్నర గంటలపాటు సమీక్ష
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా గ్రామాల్లో పకడ్బందీగా సోషల్ ఆడిట్ చేపట్టాలని ఆదేశించారు. మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) విభాగం అధికారులతో పవన్ కళ్యాణ్ గురువారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. సోషల్ ఆడిట్ ప్రక్రియపై కూలంకషంగా చర్చించారు. సుమారు రెండున్నర గంటలసేపు సమీక్ష సమావేశం సాగింది.
ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ జరిగే తీరును, నిధుల దుర్వినియోగం జరిగితే గుర్తించే పద్ధతిని అధికారులు పవన్ కళ్యాణ్ కి వివరించారు. సోషల్ ఆడిట్ సమావేశాలు గ్రామాల్లో ఎన్ని నిర్వహించారు, అందుకు సంబందించిన వివరాలను తెలియ చేశారు. క్షేత్రస్థాయిలో ఉపాధి మేట్లు పరిధిలో జరిగిన పనులు, వాటి వివరాలు, ఉపాధి హామీ పనుల పురోగతి, నిధులు ఏ మేరకు సద్వినియోగం అయ్యాయి, దుర్వినియోగానికి సంబంధించిన కేసులను వివరించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉపాధి హామీ పథకంలో నిధులను సద్వినియోగం చేసుకొంటేనే సత్ఫలితాలు వస్తాయని, ఈ విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా ఉండాలని స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని మరింత విస్తృతంగా గ్రామీణ అభివృద్ధి కోసం ఎలా వినియోగించుకోవచ్చు అనే అంశంపై చర్చించారు. సోషల్ ఆడిట్ పక్కాగా జరగాలని, గ్రామాల్లో సోషల్ ఆడిట్ సభలు ప్రోటోకాల్ ను అనుసరించి ఓ పద్దతి ప్రకారం నిర్వహించాలని చెప్పారు. అలాగే ఉపాధి హామీ నిధులు ఏమాత్రం దుర్వినియోగం కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ పక్కగా ఉండాలని ఆదేశించారు.