-డి ఆర్ ఓ పెంచల కిషోర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
యోగా ను మన దైనందిన జీవితంలో కొంత సమయం కేటాయించి అలవర్చుకోవడం ద్వారా శారీరక, మానసిక ఒత్తిడిని జయించి దృఢంగా ఆరోగ్యంగా ఉంటారని జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ పేర్కొన్నారు.
శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఉద్యోగులు, జిల్లా, వివిధ స్థాయి అధికారులు, విద్యార్థులు, యోగ అభ్యాసకులు తదితరులు హాజరవగా ప్రాతః కాల యోగ ప్రార్థనతో యోగా కార్యక్రమం మొదలు పెట్టి సూర్య నమస్కారాలు, యోగ, ధ్యానం నిర్వహించిన అనంతరం, యోగాలో జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో పాల్గొన్న బాల బాలికలు, యోగాభ్యాస బాలలు యోగా ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఈ సంవత్సరం యోగా ఫర్ సెల్ఫ్ అండ్ ఫర్ సొసైటీ అనే థీమ్ తో జిల్లా కలెక్టర్ మరియు జెసి సూచనల మేరకు కలెక్టరేట్ ఉద్యోగులు, జిల్లా, వివిధ స్థాయి అధికారులు, సెట్విన్, ఆయుష్, వైద్య ఆరోగ్య శాఖ, స్పోర్ట్స్ తదితర శాఖలు సంయుక్తంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. మన పూర్వీకులు సుమారు 5000 సం. కు ముందే సనాతన ధర్మ కాలం నుండి ఈ యోగా అనే అద్భుతమైన సాధనను మనకు అందించారని, ప్రతి ఒక్కరూ యోగా సాధన మన దైనందిన జీవితంలో అలవర్చుకోవడం ద్వారా శారీరక, మానసిక ఒత్తిడిని జయించి దృఢంగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. దైనందిన జీవితంలో ఉద్యోగులు, విద్యార్థులు ఇతరులు అందరూ తమ శారీరక మానసిక దృఢత్వం కోసం యోగా కోసం ప్రతి రోజూ కొంత సమయం కేటాయించి ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. చిన్నారులు చేసిన యోగాసనాలలో లిఖిత, దివ్యానంద్ చేసిన విన్యాసాలు, గ్రూప్ విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో యోగా ట్రైనర్ శ్రీనివాసులు, ఎస్డిసి లు భాస్కర్ నాయుడు, మురళి, డిఎంహెచ్ఓ శ్రీహరి, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య, సిపిఓ ప్రేమ్ చంద్ర రెడ్డి, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అధికారి సయ్యద్, డిఈఓ శేఖర్, జిల్లా ఎక్సైజ్ అధికారి జానకి రాములు, కలెక్టరేట్ సిబ్బంది, విద్యార్థులు, యోగా అభ్యాసకులు తదితరులు పాల్గొన్నారు.