అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా జనాబ్ నస్యం మహమ్మద్ ఫరూఖ్ శుక్రవారం పదవీ బాధ్యతలను చేపట్టారు. రాష్ట్ర సచివాలయం 3వ బ్లాక్ లో తనకు కేటాయించిన ఛాంబర్ (రూమ్ నెంబర్ 212)లో మధ్యాహ్నం 2 గంటలకు సర్వమత ప్రార్థనలు, ప్రత్యేకంగా నమాజ్ అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించి తొలిసారిగా సంతకం చేయడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి జన్ వికాస్ కేంద్రం (పీఎంజేవీకే) వంటి కేంద్ర పథకాల ద్వారా మైనారిటీల కోసం నైపుణ్యాభివృద్ధి విద్య, ఆరోగ్యం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అంశంపై ఉన్నతాధికారులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. పీఎంజేవీకే క్రింద 2014-19లో మంజూరైన రూ.643.54 కోట్ల విలువైన 77 ప్రాజెక్టులను గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ క్రమంలో గత ఐదేళ్లలో ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి పురోగతి లేని కారణంగా జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు ఇచ్చి త్వరగా వాటిని పూర్తి చేయాల్సిందిగా మైనార్టీల సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ.కె. హర్షవర్థన్ కు సూచించినట్లు తెలిపారు. రాష్ట్రం తరపున కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.
రెవెన్యూ లో ఉన్న వక్ఫ్ బోర్డును, పాఠశాల విద్యాశాఖలో ఉన్న ఉర్దూ అకాడమీని, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి వాటిని ఏకం చేసి మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ గా నామకరణం చేసిన ప్రక్రియలో తన పాత్రను మంత్రి ఫరూఖ్ ఈ సందర్బంగా గుర్తుచేశారు. గతంలో మైనారిటీలోని ముస్లింలు, క్రిస్టియన్ ల అభివృద్ధికి కృషి చేశామన్నారు. ప్రస్తుతం దర్గాలు, వక్ఫ్ బోర్డుల్లో పలు సమస్యలు ఉన్నాయని తమ దృష్టికి వచ్చాయని వాటన్నింటిపై కూలంకషంగా చర్చించి పరిష్కరిస్తామన్నారు. వక్ఫ్ బోర్డుకు కోట్లాది ఆస్తులు ఉన్నాయని వాటిని కాపాడుతామన్నారు. గతంలో ముస్లిం యువత కోసం కర్నూలు, కడపలో కమర్షియల్ కాంప్లెక్స్ లు కట్టించి తద్వారా ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. ప్రస్తుతం ముస్లిం, మైనారిటీలకు ఉపాధి కల్పించే బాధ్యతను తీసుకుంటామన్నారు. చర్చిల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేసిన కృషిని వివరించారు. హజ్ యాత్రికుల కోసం మంచి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మైనారిటీల ఆర్థిక జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. గత ప్రభుత్వం ముస్లిం, మైనారిటీ కోసం చేసిందేమీ లేదన్నారు. పెళ్లికానుకతో సహా పలు పథకాలు, సంక్షేమం పేరుతో మభ్య పెట్టిందన్నారు.
విదేశీ విద్య కు “డా. ఏపీజే అబ్దుల్ కలాం విదేశీ విద్య”గా నామకరణం చేయడం జరిగిందన్నారు. రాష్ట్రపతిగా ఈ దేశానికి సేవ చేసిన ఆయన పేరును ఈ పథకానికి పెట్టడం సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే సంబంధిత ఫైల్ ను ముఖ్యమంత్రి అనుమతి కోసం పంపిస్తామన్నారు. గతంలో విదేశీ విద్యకు ఎన్టీఆర్, అంబేద్కర్ వంటి వారి పేర్లు ఉండేవని, గత ప్రభుత్వం ఆయా పేర్లను తొలగించిన విషయాన్ని మంత్రి ఫరూఖ్ గుర్తుచేశారు. మైనార్టీల సంక్షేమం, నాణ్యమైన విద్య అమలు కోసం వందలాది కోట్లు ఖర్చు చేసిన ఘనత తమదే అన్నారు.
న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా తనకు అవకాశం కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. నారా చంద్రబాబు నాయుడు కు ధన్యవాదాలు తెలిపారు. ఎమెల్యేగా, మండలి ఛైర్మన్ గా, డిప్యూటీ స్పీకర్ గా, గతంలో, ప్రస్తుతం మంత్రిగా తనకు పలుమార్లు మంచి అవకాశాలు కల్పించినందుకు దివంగత ఎన్టీ రామారావు, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు, లోకేష్ కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. 2024లో కూటమి ఘన విజయంపై సంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ స్పష్టం చేశారు.
రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖగా పదవీ బాధ్యతలు స్వీకరించిన జనాబ్ నస్యం మహమ్మద్ ఫరూఖ్ కు న్యాయ, మైనారిటీ శాఖ అధికారులు, సిబ్బంది పుష్ఫగుచ్చాలు అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నసీర్, మైనారిటీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ హర్షవర్దన్, న్యాయశాఖ కార్యదర్శి ప్రభాకర్ రావు, వక్ఫ్ బోర్డు సీఈవో అబ్దుల్ ఖాదర్, ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మస్తాన్ వలీ, ఎంహెచ్ పీఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు మౌలానా హుస్సేన్ అహ్మద్, న్యాయ, మైనారిటీ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.