Breaking News

జిల్లాలో 2,44,302 మంది లబ్దిదారులకు జూలై 1 న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ

-రూ.165.13 కోట్ల నగదు ఇంటింటి పంపిణీకి ఏర్పాట్లు
-జిల్లా వ్యాప్తంగా 9552 క్లస్టర్ ను ఉద్యోగులతో మ్యాపింగ్ ప్రక్రియ
-సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు తీసుకోవడంలో అప్రమత్తంగా వ్యవహరించాలి
-కలెక్టర్ ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జూలై ఒకటవ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ, సీజనల్ వ్యాధుల వ్యాప్తి నివారణ కోసం ముందస్తు కార్యాచరణ ప్రణాళిక తో అధికారులు సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

శుక్రవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరం నుంచి డివిజనల్, మండల, మునిసిపల్ స్థాయి అధికారులతో పింఛన్లు పంపిణీ, సిజనల్ వ్యాధులు, స్వచ్ఛమైన త్రాగునీటి సరఫరా అంశలపై జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ తో కలిసి దిశా నిర్దేశనం చెయ్యడం జరిగింది.

ఈ సంధర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం చేపట్టిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించి, లబ్దిదారులకు అత్యంత పకడ్బందీగా పెన్షన్ నగదు చెల్లింపులను జరపాల్సి ఉందన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు తూ. ఛా. అమలు చేయాలని స్పష్టం చేశారు. ఇంటింటికీ సామాజిక భద్రతా పింఛన్లు ప్రభుత్వ ఉద్యోగులు ద్వారా అందించే క్రమంలో ఎక్కడా ఎటువంటి ఆటంకాలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అన్నారు. జూలై ఒకటవ తేదీన పెన్షన్లు పంపిణీ చేసే క్రమంలో జూన్ 29 వ తేదిన బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణ చేసి, జూలై ఒకటవ తేదీన ఉదయం 5 గంటల నుంచి నగదు చెల్లింపులు జరిగేలా మండల అభివృద్ది అధికారులు, మునిసిపల్ కమిషనర్ లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 9,552 క్లస్టర్ వారీగా 2,44,302 మంది పెన్షన్ లబ్దిదారులను గుర్తించడం జరిగిందని తెలిపారు. ఆయా క్లస్టర్ వారీగా సి ఎఫ్ ఎమ్ ఎస్ గుర్తింపు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధిదారులను అనుసంధానం చేయనున్నట్లు ప్రశాంతి తెలిపారు. ఆమేరకు ట్యాగ్ చేసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దారులకి జూలై ఒకటవ తేదీ సోమవారం ఉదయం 5 గంటల నుంచి ఇంటింటికీ వెళ్లి పెన్షన్ నగదు చెల్లింపులను జరపాల్సి ఉందన్నారు. ఆధార్ బేస్డ్, బయో మెట్రిక్, ఐరిష్ గుర్తింపు విధానంలో చెల్లింపులు జరపాలని, ప్రతి ఒక్కరి నుంచి నగదు చెల్లింపులకు చెందిన రశీదు తీసుకోవాల్సి ఉంటుందని ఆదేశించారు. బయో మెట్రిక్ ఐరిష్ పరికరాల వినియోగం పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం ముఖ్యం అన్నారు. లబ్దిదారుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా సమర్ధవంతమైన సిబ్బందిని నగదు చెల్లింపుల కోసం గుర్తించాలన్నారు.

సీజనల్ వ్యాధుల నివారణ పై కలెక్టర్ ఆదేశాలు జారీ:
ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి చెందకుండా తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. డయెరియా సంబంధించిన కేసులు విషయములో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా లోతట్టు, ముంపు ప్రాంతాలను గుర్తించి అక్కడ సంరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. డయెరియా కేసులు నమోదు అయిన సందర్భంలో ఆయా ప్రాంతాల్లో పర్యటించి క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేసి, నివేదిక అందచేయాలని తెలిపారు. త్రాగునీటి సరఫరా చేసే ప్రదేశంలో నమూనా పరీక్షలు నిర్వహించి, ఆమేరకు ధ్రువపత్రాలు జారీ చేయాలన్నారు. గ్రామాల్లో, పురపాలికల్లో వో హెచ్ ఆర్, ట్యాంకుల నిర్వహణా వ్యవస్థ పై స్వయం గా తనిఖీలు నిర్వహించి రానున్న రెండు మూడు రోజుల లో నివేదిక అందచేయాలని పేర్కొన్నారు. ఆ క్రమంలో ఇంజనీరింగ్ సహయకుల సేవలు వినియోగించు కోవాలన్నారు. క్షేత్ర స్థాయిలో పబ్లిక్ హెల్త్, ఆర్ డబ్ల్యూ ఎస్, పంచాయతీ రాజ్, అంగన్వాడీ కార్యకర్తలు, హెల్త్ వర్కర్లు ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆయా కమిటీలు క్షేత్ర స్థాయిలో పర్యటన చేసి సమగ్ర నివేదిక, చేపట్ట వలసిన పనులపై కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని కోరారు.

జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, పి డి డిఆర్డిఎ ఎన్ వి వి ఎస్ మూర్తి, జిల్లా సూక్ష్మ నీటి యాజమాన్య అధికారి ఏ. దుర్గెశ్, జిల్లా భూగర్భ జల అధికారి వై. శ్రీనివాస్, డివిజనల్ అభివృద్ది అధికారులు పి. వీణా దేవి, వి. శాంత మణి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *