-రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల భాగస్వామ్యం అవసరం.
-పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలు ఇచ్చిన తీర్పులో ఉద్యోగుల పాత్ర కీలకమని ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో ఉద్యోగుల సహకారం ఎంతో అవసరమని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు.
విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన కేశినేని శివనాథ్ చిన్నిని మంగళవారం నగరంలోని గురునానక్ కాలనీ నందు గల ఆయన కార్యలయంలో జిల్లా ఎన్జీవో సంఘ అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ ఏ. విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగులు మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసినేని శివనాధ్ (చిన్ని) మాట్లాడుతూ ఉద్యోగులు గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో మానసిక, ఆర్ధిక ఇబ్బందులు పడ్డారని, అనేక కేసులు ఎదుర్కున్నారన్నారు. చిరు ఉద్యోగి నుండి ఉన్నత స్థాయి అధికారి వరకు కనీసం ఒకటో తేదీన జీతాలు పొందలేకపోయారన్నారు. ప్రస్తుత ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు ప్రయోజనాలు సంక్షేమంపై చూపిన ప్రత్యేక శ్రద్ద గత ముఖ్యమంత్రి ఉద్యోగుల పట్ల ప్రవర్తించిన తీరు బేరీజు వేసుకొని ఉద్యోగులు మార్పును కోరుకున్నారన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రజలను చైతన్య వంతులను చేసి అభివృద్ధి పధంలో నడిపించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో ఉద్యోగులు కీలక పాత్ర వహించారన్నారు. ఉద్యోగులు ప్రజలు పెట్టుకున్న ఆశలకు అనుగుణంగా రాష్టాభివృద్దికి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం నుండి అవసరమైన నిధులు మంజూరు చేయించి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఆదర్శ వంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న తన ఆలోచనలను ఆచరణలో పెట్టడంలో ఉద్యుగుల సహకారం ఎంతో అవసరమన్నారు.
ఈ సందర్భంగా ఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు జేఏసీ చైర్మన్ ఏ విద్యాసాగర్ మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిడమానూరు ఫ్లై ఓవర్, ఈస్ట్రన్ బైపాస్ నిర్మాణాలకు సంబంధించి ఎంతో కృషి చేసారన్నారు. విజయవాడ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికవ్వటం ముదావహమని, ఆయన ఇప్పటివరకు ప్రజలకు ఎన్నో సేవ కార్యక్రమాలను చేపట్టారని, తిరువూరు ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అందించిన సేవలు మరువలేనివన్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంటారని విద్యాసాగర్ తెలిపారు. గత ఐదు సంవత్సరాలలో కూటమి ప్రభుత్వం ఏర్పడినాక మాత్రమే ఉద్యోగులు ఉపాధ్యాయులు కమిషనర్లు ఒకటే తారీఖున జీతాలు, పెన్షన్లు పొందగలిగారని తెలిపారు.
తొలుత పార్లమెంటు సభ్యుడు కేసినేని చిన్నిని ఉద్యోగ సంఘాల నాయకులు దుస్సా లువాతో సత్కరించారు. పార్లమెంటు సభ్యుడిని కలిసిన వారిలో ఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్, కార్యదర్శి డి. సత్యనారాయణ రెడ్డి, మాజీ కార్యదర్శి ఎండి ఇక్బాల్, జిల్లా నాయకులు బి. సతీష్ కుమార్, కె .శివలీల, ఎం . రాజబాబు, నగర శాఖ కార్యవర్గ సభ్యులు సీహెచ్ వి ప్రసాద్, నజిరుద్దీన్, రాజశేఖర్, విజయశ్రీ, ప్రభుత్వ రంగ సంస్థల ఫెడరేషన్ చైర్మన్ ఏ. సాంబశివరావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు సాయిరాం, శ్రీనివాస్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి చెందిన ఎం. శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.