Breaking News

తొలి రోజు బౌలర్లదే హవా..!

-ఆశించని స్థాయిలో సత్తా చాటని స్టార్‌ ఆటగాళ్లు
-రెండంకెల స్కోర్‌ దాటని శ్రేయస్, పడిక్కిల్, రుతురాజ్,
-ఇండియా డీ 164 ఆలౌట్‌
-అక్షర్‌ పటేల్‌ మెరుపు ఇన్నింగ్స్‌
-ఆరు సిక్సులు, ఆరు బౌండరీలో 86 పరుగులు చేసిన అక్షర్‌
-ఆటముగిసే సమయానికి ఇండియా సీ 91/4
-దులీప్‌ ట్రోఫీ క్రికెట్‌ టోర్నమెంట్‌

అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త :
దులీప్‌ ట్రోఫి క్రికెట్‌ టోర్నమెంట్‌లోని తొలి మ్యాచ్‌లో తొలి రోజు బౌలర్లదే హవా నడిచింది. కొందరు స్టార్‌ ఆటగాళ్లు రెండంకెల స్కోర్‌ దాటలేకపోయారు. భారత జట్టు క్రీడాకారుడు అక్షర్‌ పటేల్‌ బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రతిభ చూపారు. 86 పరుగులు చేయడమే కాకుండా..2 వికెట్లు తీసుకున్నారు. అనంతపురంలోని ఆర్డీటీ స్పోర్ట్స్‌ సెంటర్‌ ప్రధాన మైదానంలో గురువారం దులీప్‌ ట్రోఫీ క్రికెట్‌ టోర్నమెంట్‌లో భాగంగా ఇండియా డీ, ఇండియా సీ జట్ల మధ్య నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌ ప్రారంభమైంది. ఆర్టీటీ స్పోర్ట్స్‌ సెంటర్‌ మైదానం మొదట్లో బౌలర్లకు అనుకూలిస్తుందని తెలుసుకున్న ఇండియా సీ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ టాస్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు.

ఇండియా డీ 164 ఆలౌట్‌
ఇండియా సీ బౌలర్ల ధాటికి ఇండియా డీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 48.3 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఇండియా సీ జట్టు బౌలర్లు విజయ్‌కుమార్‌ వైశాక్‌ 3, అన్షుల్‌ కాంబోజ్‌ 2, హిమాన్షు చౌహాన్‌ 2, మనవ్‌ సుతార్‌ , హ్రితిక్‌ షోకీన్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు. ఇండియా డీ జట్టులో శ్రేయస్‌ అయ్యర్‌ 16 బంతుల్లో ఒక బౌండరీ సాధించి కేవలం 9 పరుగులు మాత్రమే వైఖాక్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ అభిషేక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దేవదత్‌ పడిక్కిల్‌ 0, రికీ బుయీ 13 పరుగులు మాత్రమే చేశారు. 7వ నెంబర్‌ ఆటగాడిగా బరిలో దిగిన అక్షర్‌ పటేల్‌ మొదట్లో నెమ్మదిగా ఆడుతూ..ఆ తర్వాత మెరుగు ఇన్నింగ్స్‌ ఆడాడు. అవకాశం దొరికినప్పుడల్లా బంతిని బౌండరీ, సిక్సర్‌గా మలిచాడు. లాంగ్‌ ఆఫ్‌ మీదుగా కొట్టిన ఓ సిక్సర్‌ స్టేడియం బయట పడింది. 118 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో 86 పరుగులు చేసిన అక్షర్‌..షోకీన్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అతనికి తోడుగా అర్షదీప్‌ సింగ్‌ 13 పరుగులు చేశాడు. అక్షర్‌ పటేల్, అర్ష్‌దీప్‌ సింగ్‌ 9వ వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం.

ఎదురీదుతున్న ఇండియా సీ
ఇండియా సీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఎదురీదుతోంది. ఆటముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్‌ 33 ఓవర్లలో 4 వికెట్లు 91 పరుగులు చేసింది. స్టార్‌ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌ 19 బంతులు ఎదుర్కొని బౌండరీతో కేవలం 5 పరుగులు చేశాడు. ఐపీఎల్‌ స్టార్లు‡ సాయి సుదర్శన్‌ 7, రజిత్‌ పటీదార్‌ 13, మరో బ్యాట్స్‌మెన్‌ ఆర్యన్‌ జుయల్‌ 12 పరుగులు చేసి ఔట్‌ అయ్యారు. కాగా బాబా ఇంద్రజిత్‌ 15, అభిషేక్‌ పోరెల్‌ 32 క్రీజ్‌లో ఉన్నారు. ఇండియా డీ బౌలర్లలో హర్షిత్‌ రాణా, అక్షర్‌ పటేల్‌ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

కిక్కిరిసిన ఆర్డీటీ స్పోర్ట్స్‌ సెంటర్‌
భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు దులీప్‌ ట్రోఫీలో పాల్గొంటున్నారని తెలుసుకున్న క్రికెట్‌ అభిమానులు భారీ సంఖ్యలో ఆర్డీటీ స్పోర్ట్స్‌ సెంటర్‌కు తరలివచ్చారు. క్రికెట్‌ అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. మ్యాచ్‌ ఆద్యంత ఈలలు, కేకలతో హోరెత్తింది. ఏసీఏ త్రీమెన్‌ కమిటీ సభ్యులు మాంఛోఫెర్రర్, ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అన్నేఫెర్రర్, అసిస్టెంట్‌ కలెక్టర్‌ బి.వినూత్న తదితరులు పర్యవేక్షించారు.

Check Also

వరద బాధితులకు విరాళాల వెల్లువ

-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *