-జనసేన బలోపేతానికి కృషి చేయాలి…
-జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన ప్రధాన లక్ష్యం సగటు ప్రజల కన్నీళ్లు తుడవటమే అని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పవన్ కొవిడ్ బారిన పడి మృతిచెందిన వారికి సంతాపం తెలిపారు. నంద్యాలకు చెందిన సోమశేఖర్ కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ‘‘కరోనా విపత్తులో తొలి, రెండో దశలో దేశంలో లక్షల మంది చనిపోయారు. జన సైనికులు, వారి కుటుంబ సభ్యులు, నా సన్నిహితులు, బంధువులు చాలా మందిని కోల్పోయాను. విపత్తులో చనిపోయిన ప్రతి ఒక్కరికి జనసేన తరఫున నివాళులు. ప్రజాస్వామ్య విలువలు నిలబెట్టడానికి జనసేన కృషి చేస్తోంది. అందరి అభిమానం, నాయకుల అండతో పార్టీ నిలబడింది. పార్టీ బీమా పథకానికి నేను రూ.కోటి ఇచ్చా. అందరూ తమ వంతు సహకారం అందిస్తున్నారు’’ అని పవన్ అన్నారు. భవిష్యత్తు లో జనసేన పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేయాలని కోరారు.
జనసేన పార్టీ రాష్ట్ర నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు క్రియాశీలక సభ్యత్వం పొందిన లక్ష మంది కార్యకర్తలకు రూ.2 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించడం జరిగిందన్నారు. కరోనా కారణంగా పార్టీకి చెందిన ఎంతో మంది యువతను సైతం కోల్పోవడం ఎంతో బాధాకరమన్నారు.
జనసేన రాష్ట్ర నూతన కార్యవర్గం…
జనసేన రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. రాష్ట్ర, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను పవన్ నియమించారు. రాష్ట్ర కార్యవర్గంలోకి చల్లా మదుసూధన్‌రెడ్డి, విజయ్ కుమార్‌లను తీసుకున్నారు. లీగల్ సెల్‌కి ప్రతాప్, డాక్టర్ సెల్‌కి రఘు, ఐటీ సెల్‌కి శివరాంలను నియమించారు. చేనేత సెల్‌కి సుభాష్, పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా కల్యాణపు శ్రీనివాస్‌లను నియమిస్తూ జనసేనాని ఆదేశాలు జారీ చేశారు. అలాగే రాష్ట్రంలోని జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా కందుల దుర్గేష్, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా గోవింద్ ను నియమించారు. కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా రామకృష్ణ, విజయవాడ అధ్యక్షుడిగా పోతిన వెంకట మహేష్, కార్యదర్శిగా అమ్మిశెట్టి వాసులను నియమించారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా గాదె వెంకటేశ్వరరావు, ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా షేక్ రియాజ్‌లను నియమించారు. అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా పి.సి.వర్మ, చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పసుపులేటి హరిప్రసాద్ లను నియమిస్తూ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.