Breaking News

రాజన్న పాలన ఓ స్వర్ణయుగం : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా వైఎస్సార్ జయంతి, మల్లాది విష్ణు జన్మదిన వేడుకలు…
-సంక్షేమ పథకాల రథసారథి వైఎస్సార్…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దివంగ‌త నేత డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి  72వ జ‌యంతి, శాసనసభ్యులు మల్లాది విష్ణు  జన్మదిన వేడుకలు సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు పలు డివిజన్ లలో పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాలలో శాసనసభ్యులు మల్లాది విష్ణు పాల్గొని రాజశేఖర్ రెడ్డి చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పలు డివిజన్ లలో మొక్కలు నాటడంతో పాటు.. మహిళలకు చీరలు, కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. అనంతరం మల్లాది విష్ణు  మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని తన కుటుంబంగా భావించిన ప్రజానాయకులు రాజశేఖర్ రెడ్డి అని కీర్తించారు. ఆయన జీవితం భావితర నాయకులకు ఒక పాఠ్యపుస్తకమన్నారు. ఎందరికో అసాధ్యమయిన అనేక అభ్యుదయ పథకాలను సుసాధ్యం చేసి సంక్షేమ రథసారథిగా తెలుగు రాజకీయ యవనికపై తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారన్నారు. మాట తప్పని మడమతిప్పని ఆయన నైజం పేదల జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. వైఎస్సార్‌ సంక్షేమ స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతుందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ను రైతాంగానికి స్వర్ణసీమగా మార్చిన నేత…
రైతును రాజును చేయడానికి రాజశేఖర్ రెడ్డి వేసిన ప్రతి అడుగు.. ఆయనను ప్రజల హృదయాలలో రైతు బాంధవుడిగా నిలిపిందని  మల్లాది విష్ణు  అన్నారు. టీడీపీ పాలనలో రైతు సంక్షేమాన్ని గాలికొదిలేయగా.. 2004లో వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే రాష్ట్రంలో రైతులకు మంచి రోజులు వచ్చాయన్నారు. ఉచిత విద్యుత్ అందించి వ్య‌వ‌సాయానికి వెన్నుద‌న్నుగా నిలిచారన్నారు. వ్యవసాయం దండగంటూ చంద్రబాబు ఈసడించినా.. దానిని పండగ చేసి అన్నదాతల మోముపై చిరునవ్వులు విరబూయించిన నాయకులు వైఎస్సార్ అని చెప్పుకొచ్చారు. జలయజ్ఞం పేరుతో రైతుల బతుకు చిత్రాన్ని పూర్తిగా మార్చివేశారన్నారు. కనుకనే ఆ మహానేత జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు వెల్లడించారు.

సంక్షేమ పథకాల ఆద్యుడు రాజన్న…
దేశంలో సంక్షేమ పథకాల విప్లవం తీసుకువచ్చిన వ్యక్తి  వైఎస్ రాజశేఖర్ రెడ్డి  అని మల్లాది విష్ణు  అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, జలయజ్ఞం, రైతాంగానికి ఉచిత విద్యుత్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలకు ఆయనే ఆద్యులు అని చెప్పుకొచ్చారు. వైఎస్సార్  స్ఫూర్తితో ఆయన ఆశయాల సాధనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  కృషి చేస్తున్నారని మల్లాది విష్ణు తెలిపారు. పేదవాడి సంక్షేమం కోసం రాజన్న రెండు అడుగులు ముందుకు వేస్తే.. జగనన్న వంద అడుగులు ముందుకు వేస్తున్నార‌ని పేర్కొన్నారు. ప్రతి అడుగులోనూ జగన్మోహన్ రెడ్డి .. రాజనన్నను గుర్తుకు తెస్తున్నారన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటల టీడీపీ ప్రభుత్వానికి, చేతల వైఎస్సార్‌ సీపీ పాలనకు వ్యత్యాసం చూపించారన్నారు.

దేవినేని ఉమా నోరు అదుపులో పెట్టుకో…
గత ఐదేళ్ల పాలనలో ఆంధ్ర రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ భ్రష్టుపట్టించిందని మల్లాది విష్ణు  పేర్కొన్నారు. చంద్రబాబునాయుడి రెండు కళ్ల సిద్ధాంతం కారణంగానే విభజనతో రాష్ట్రానికి ఈ పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. పదేళ్ల ఉమ్మడి రాజధానిని కూడా గత తెలుగుదేశం ప్రభుత్వ అసమర్థత వల్ల వదులుకోవాల్సి వచ్చిందన్నారు. ఫలితంగా నేడు కరోనా బాధితులు తెలంగాణలో అడుగుపెట్టలేని పరిస్థితి తలెత్తిందన్నారు. విభజన కష్టాలు, నదీ జలాల వివాదాలకు చంద్రబాబునాయుడి చేతగానితనమే కారణమన్నారు. తెలుగుదేశం పార్టీ చేసిన తప్పులను వైఎస్సార్ సీపీపై రుద్దాలని చూడటం సిగ్గుచేటని దేవినేని ఉమాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పోలవరాన్ని 2019 నాటికి పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికి.. పూర్తి చేయలేకవడం మీ చేతగానితనానికి నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు. మంత్రిగా ఉండి కూడా గెలవలేకపోయినందుకు దేవినేని ఉమా సిగ్గుపడాలన్నారు. వైఎస్సార్ గారి గురించి, జగన్మోహన్ రెడ్డి  గురించి అవాకులు చవాకులు పేలితే కృష్ణా జిల్లా ప్రజలు చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు.

వైఎస్సార్ విగ్రహావిష్కరణ…
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  చిరస్మరణీయులని మల్లాది విష్ణు గారు అన్నారు. ఆయన విగ్రహాన్ని చూసినప్పుడల్లా రాజశేఖర్ రెడ్డి  ఆశయాల సాధన కోసం కృషి చేయాలనే దృఢ సంకల్పంతో పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు. వైఎస్సార్ స్ఫూర్తితో స్థానిక కార్పొరేటర్  కుక్కల అనిత  ప్రజలకు అందుబాటులో ఉండేందుకు, వారి సమస్యలను తక్షణం పరిష్కరించేదుకు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. అనంతరం డివిజన్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించారు.

మల్లాది వెంకట సుబ్బారావు  ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆనందయ్య మందు పంపిణీ…
కరోనా కోరల్లో చిక్కుకున్న బాధితులకు ఆనందయ్య మందు సంజీవిని లాంటిదని  మల్లాది విష్ణు  అన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి  జయంతిని పురస్కరించుకుని మల్లాది వెంకట సుబ్బారావు  ఫౌండేషన్ ఆధ్వర్యంలో సత్యనారాయణపురం, సూర్యారావుపేట కర్నాటి రామ్మోహన్ రావు ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 10వేల మంది పేదలకు ఆనందయ్య మందును పంపిణీ చేశారు.

Check Also

రాష్ట్రంలో 6 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల ఫీజిబులిటీ స్టడీ కోసం రూ. 2.27 కోట్ల నిధులు విడుదల చేయనున్నాం : మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

-కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, తుని – అన్నవరం, తాడేపల్లి గూడెం, ఒంగోలులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధికి ప్రతిపాదనలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *