Breaking News

పలు అభివృద్ధి పనులకు సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన, శిలా ఫలకాల ఆవిష్కరణ…

-బద్వేలుకు ఆర్డీఓ కార్యాలయం మంజూరు
-నిండు కుండలా బ్రహ్మం సాగర్‌ ప్రాజెక్టు
-లీకేజీలు లేకుండా రూ.45 కోట్లతో పనులు
-ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ డయాఫ్రమ్‌ కటాఫ్‌ వాల్‌ నిర్మాణం
-దీంతో ఎల్లప్పుడూ ప్రాజెక్టులో 17 టీఎంసీల నీరు
-ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రకటన
-బద్వేలు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు
-రూ.500 కోట్లకు పైగా వ్యయంతో పనులకు శ్రీకారం
-రూపురేఖలు మారనున్న నియోజకవర్గం
-బద్వేలు బహిరంగ సభలో సీఎం  వైయస్‌ జగన్‌


బద్వేలు, వైయస్సార్‌ జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
బద్వేలులో పలు అభివృద్ధి పనులకు శిలా ఫలకాల ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభలో సీఎం  వైయస్‌ జగన్‌ ప్రసంగించారు.  అనంతపురం, వైయస్సార్‌ జిల్లాల పర్యటనలో ఉన్న సీఎం  వైయస్‌ జగన్, రెండో రోజు ఇడుపులపాయ నుంచి నేరుగా బద్వేలు చేరుకున్నారు. అక్కడ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, శిలా ఫలకాల ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు.
బద్వేలు బహిరంగ సభలో సీఎం  వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ…
బ్రహ్మంసాగర్‌ ఏనాడూ నిండలేదు:
‘బద్వేల్‌ నియోజకవర్గం రాష్ట్రంలో వెనబడిన వాటిలో ఒకటి. ఇవి రాష్ట్రంలో చాలా తక్కువగా ఉన్నాయి. అలా వెనకబడిన వాటిలో బద్వేలు నియోజకవర్గం ఒకటి. గతంలో ఈ నియోజకవర్గానికి ఏనాడూ మంచి జరిగిన పరిస్థితి లేదు. నేను 2009లో ఎంపీగా ఎన్నికయ్యాక, చాలా సార్లు ఇక్కడికి వచ్చినప్పుడు నాకనిపించేది.. నాన్నగారి హయాంలో మాత్రమే బ్రహ్మంసాగర్‌ రిజర్వాయర్‌లో 14 టీఎంసీల నీళ్లు నిల్చాయి.. ఆ తర్వాత ఆయన మరణం తర్వాత ఎందుకు నాలుగైదు టీఎంసీలకు మించి నీరు నిల్వ లేవు అని ఎప్పుడూ అనిపించేది. కారణం పాలకుల్లో చిత్తశుద్ధి లేదు. పాలకుల్లో మంచి చేయాలన్న తపన, ఆలోచన లేదు’.
మరి ఈ రెండేళ్లలో పరిస్థితి:
‘అదే బద్వేలు నియోజకవర్గం. అదే బ్రహ్మంసాగర్‌ ప్రాజెక్టు ఈ రెండు సంవత్సరాలలో మీ అందరి చల్లని దీవెనలు, దేవుడి దయతో మళ్లీ నిండు కుండలా కనిపిస్తోంది. ఎప్పుడూ ఈ ప్రాజెక్టు అలా నిండు కుండలా ఉండాలన్న ఉద్దేశంతో చిన్న చిన్న సమస్యలు, చిక్కుముడులు ఒక పద్ధతి ప్రకారం పరిష్కరించే విధంగా అడుగులు వేశాం’.
ఇందు కోసం ఏమేం చేశాం?:
‘వెలుగోడు నుంచి 0 నుంచి 18 కి.మీ వరకు కాలువ సక్రమంగా లేదు. లైనింగ్‌ లేకపోవడం వల్ల నీళ్లు కిందికి రావడం లేదు. ఇది అందరికీ తెలిసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. అందుకే అధికారంలోకి రాగానే రూ.300 కోట్లు మంజూరు చేసి లైనింగ్‌ పనులు మొదలు పెట్టాం. దాదాపు 80 శాతం లైనింగ్‌ పనులు పూర్తి కాగా, మిగిలినవి అక్టోబరు నాటికి పూర్తి అయి, నీళ్లు నేరుగా సులభంగా ఈ రిజర్వాయర్‌కు వచ్చే వీలు కలుగుతుంది. ఇదే బ్రహ్మంసాగర్‌ ఎప్పుడూ నిండు కుండలా ఉండేందుకు అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే కుందూనది మీద లిఫ్ట్‌ కట్టాలని రూ.600 కోట్లు మంజూరు చేసి పనులు కూడా మొదలు పెట్టాం. 2 ఏళ్లలో అవి పూర్తవుతాయి. దాంతో బ్రహ్మంసాగర్‌ఎప్పుడూ నిండు కుండలా ఉంటుందని మీ బిడ్డలా సగర్వంగా తెలియజేస్తున్నాను’.
బద్వేలుకు మోక్షం:
‘ఇక్కడ (బద్వేలు నియోజకవర్గం) దాదాపు రూ.500 కోట్లకు పైగా నిధులతో వివిధ పనులకు శంకుస్థాపన చేస్తున్నాం. అవన్నీ పూర్తైతే ఇక్కడ రూపురేఖలన్నీ మారుతాయి’.
‘మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ పరిధిలో ఇక్కడ బద్వేలు పట్టణంలో దాదాపు రూ.130 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నాం. సుమారు 143 కి.మీ పొడవుతో కొత్తగా సీసీ రోడ్లు, మూడు పార్కులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అధునాతన కూరగాయల, చేపల మార్కెట్‌తో పాటు, మూడు వాణిజ్య సముదాయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతో పాటు, ఆరు స్మశాన వాటికలను అభివృద్ధి చేస్తున్నాం. రూ.130 కోట్లతో జరిగే ఈ అభివృద్ధి పనుల వల్ల బద్వేలు నియోజకవర్గానికి ఎంతో మంచి జరుగుతుందని మనసారా నమ్ముతున్నాను’.
సాగు నీటి సదుపాయం:
‘అదే విధంగా రూ.80 కోట్లతో లోయర్‌ సగిలేరు ప్రాజెక్టు, ఎడమ ప్రధాన కాలువను 23 కిలోమీటర్ల మేర వెడల్పు పనులకు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాం. దీని ద్వారా బద్వేలు, బి.కోడూరు మండలాల్లో 35 చెరువులకు ఏటా సులభంగా నీరు నింపవచ్చు. దీని కోసం రూ.80 కోట్లు ఆనందంతో ఖర్చు చేస్తున్నామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను.
అదే విధంగా బ్రహ్మంసాగర్‌ఎడమ, కుడి కాల్వల పెండింగ్‌ పనుల కోసం రూ.54 కోట్ల వ్యయంతో పనులకు శ్రీకారం. దీని వల్ల సుమారు 30 వేల ఎకరాల ఆయకట్టుకు పూర్తి సామర్థ్యంతో నీరందించవచ్చు’.
నీటి లీకేజీ లేకుండా..:
‘మరోవైపున బహ్మంసాగర్‌ ప్రాజెక్టు గట్టుకు ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ డయాఫ్రమ్‌ కటాఫ్‌ వాల్‌ నిర్మాణం పనులు రూ.45 కోట్లతో ఇవాళ మొదలు పెడుతున్నాం. ఎందుకుంటే నిండు కుండలా జలాశయం నిండితే లీకేజీలు కనిపించాయి. కాబట్టి ఈ మరమ్మతులు చేపట్టాం. దీని వల్ల ప్రాజెక్టులో మొత్తం 17 టీఎంసీలు ఎప్పుడూ నింపుకోవచ్చు. ఆ పనులకు కూడా ఇవాళ శంకుస్థాపన చేస్తున్నామని సంతోషంగా తెలియజేస్తున్నాను’.
పెరగనున్న ఆయకుట్టు:
‘ఇంకా రూ.36 కోట్లతో బ్రహ్మంసాగర్‌ జలాశయం ఎడమ కాలువలో మూడు ఎత్తిపోతల పథకాలకు ఇవాళ శ్రీకారం చుడుతున్నాం. దీని వల్ల అక్షరాలా 8,268 క్యూబిక్‌ లీటర్ల నీటిని, సముద్ర మట్టానికి 278 మీటర్ల ఎత్తున ఉన్న ఇటుకలపాడు, సావిశెట్టిపల్లి, కొండరాజుపల్లి, వరికుంట్ల, గంగనపల్లి చెరువులను పూర్తిగా నింపడంతో పాటు, కాశినాయన మండలంలో సుమారు 3500 ఎకరాల ఆయకట్టు సాగులోకి తీసుకురావచ్చు. ఈ మంచి కార్యక్రమానికి కూడా ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాం’.
నాణ్యమైన విద్యుత్‌ సరఫరా:
‘రూ.10 కోట్లతో 5 గ్రామాలకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కోసం 5 సబ్‌ స్టేషన్ల నిర్మాణం. ఇది ఇక్కడి వ్యవసాయానికి ఎంతో మేలు చేస్తుంది. విద్యుత్‌ సరఫరాలో నాణ్యత చాలా పెరుగుతుంది’.
రహదారుల విస్తరణ–రవాణా సదుపాయం:
‘పోరుమామిళ్ల పట్టణంలో 3.6 కిలోమీటర్ల రెండు లైన్ల రోడ్డును నాలుగు లైన్లకు రూ.25 కోట్లతో విస్తరణ పనులకు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాం. దీని వల్ల పోరుమామిళ్ల చక్కగా మారుతుంది. మరో రూ.22 కోట్లతో సగిలేరు నది మీద వేములూరు గ్రామం వద్ద వంతెన నిర్మాణానికి శంకుస్థాపన. దీని వల్ల 30 గ్రామాల ప్రజలకు రవాణ సదుపాయం కలుగుతుంది. బ్రాహ్మణపల్లి సమీపంలో సగిలేరు నది మీద రూ.9.5 కోట్లతో వంతన నిర్మాణం పనులు ఇవాళ మొదలు. కలసపాడు మండలంలోని నాలుగు గ్రామాలతో పాటు, ప్రకాశం జిల్లాకు రాకపోకలు మెరుగవుతాయి’.
గోదాముల నిర్మాణం:
‘బద్వేలు మార్కెట్‌ యార్డులో రైతుల కోసం 2 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో ఒక గోదాము, పోరుమామిళ్లలోని మార్కెట్‌ యార్డులో కూడా 2 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను రూ.7.5 కోట్ల వ్యయంతో నిర్మాణం పనులకు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాం’.
ఆలయాల అభివృద్ధి:
‘బద్వేలులో శ్రీ ప్రసన్న వెంటటేశ్వర ఆలయం, శ్రీ ఆదికేశవ దేవాలయంతో పాటు, కాశినాయన మండలంలో మరో 6 దేవాలయాల అభివృద్ధి కోసం దాదాపు రూ.4.7 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఆ పనులకు కూడా ఇవాళ శంకుస్థాపన చేశాం’.
బద్వేలులో ఆర్డీఓ ఆఫీస్‌:
‘ఇక్కడ ఎప్పటినుంచో ఒక డిమాండ్‌. ఇక్కడ ఆర్డీఓ కార్యాలయం కావాలని అడుగుతున్నారు. ఆ ఆఫీస్‌ కోసం కాశినాయన, కలసపాడు మండలాల వారు ఎంతో దూరంలో ఉన్న రాజంపేటకు వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. అక్కడి వారు రాజంపేటకు వెళ్లి రావడానికి దాదాపు 250 నుంచి 300 కిలోమీటర్లు వెళ్లి రావాల్సి వస్తోందని, ఎంపీ అవినాష్‌రెడ్డి కూడా ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్‌ కావాలని కోరారు. అందుకే ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్‌ను మంజూరు చేస్తున్నానని తెలియజేస్తున్నాను’.
అవన్నీ శాంక్షన్‌ చేస్తున్నాను.
ఇంకా రూ.34 కోట్ల విలువైన చిన్న చిన్న పనులను మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి కోరారన్న సీఎం  వైయస్‌ జగన్, అవన్నీ శాంక్షన్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.
– ఆర్‌ అండ్‌ బీ బంగ్లా మరమ్మతులు. రూ.5 కోట్లు.
– పంచాయతీ రాజ్‌ రోడ్ల మరమ్మతులతో పాటు, శిధిలావస్థలో ఉన్న తహసీల్దార్, ఎంపీడీఓ, సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులకు రూ.15 కోట్లు.
– బద్వేలు మండలంలో వీరబల్లి, కొత్తచెరువు ఎత్తిపోతల పథకం కోసం రూ.50 లక్షలు.
– బద్వేలు నియోజకవర్గంలో ఇండస్ట్రియల్‌ పార్క్‌.
ఎంత చేసినా తక్కువే:
‘ఈ నియోజకవర్గం అత్యంత వెనకబడిన ప్రాంతం. ఇక్కడ ఎంత చేసినా తక్కువే. ఇక్కడి ప్రజలు ఎల్లప్పుడూ నా మీద ఎంతో ఆదరణ చూపారు. తమ బిడ్డలా ఆప్యాయత చూపారు. మీ అందరి ప్రేమానురాగాలు, ఆప్యాయతలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని మరొక్కసారి తెలియజేస్తున్నాను.
చివరగా..:
‘మీ అందరి ఆప్యాయతకు మీ ఆదరాభిమానాలకు ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి అవ్వ, తాతకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను’.. అంటూ సీఎం  వైయస్‌ జగన్‌ తన ప్రసంగం ముగించారు.
పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎస్‌.బి.అంజాద్‌బాష, డిప్యూటీ సీఎం, మైనారిటీ సంక్షేమ శాఖ
బద్వేలు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం శుభపరిణామం. గతంలో దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారి హయాంలో మాత్రమే ఈ జిల్లా అభివృద్ది జరిగింది. మాటల ప్రభుత్వాలు చూశాం కానీ జగనన్న ప్రభుత్వం చేతల ప్రభుత్వం, ఆయన తన పాదయాత్రలో అందరి కష్టాలు తెలుసుకున్నారు, వారికి మాట ఇచ్చారు, ఇచ్చిన హమీలలో 95 శాతం హమీలు అమలుచేసిన ప్రభుత్వం. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం. ఇలాంటి ముఖ్యమంత్రి 30 ఏళ్ళు సీఎంగా ఉంటే పేదరికమనేది ఉండదని భావిస్తున్నా, ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న సీఎంగారిని అందరూ దీవించాలి, ఆశీర్వదించాలి.
ఆదిమూలపు సురేష్, విద్యా శాఖ మంత్రి, వైఎస్సార్‌ కడప జిల్లా ఇంచార్జి మంత్రి
ఈ రెండేళ్ళలో బడుగు, బలహీనవర్గాలు, దళితుల అభివృద్దికి మన జగనన్న మొక్కవోని దీక్షతో ముందుకెళుతున్నారు. సమాజాభివృద్ది జరగాలంటే విద్యాభివృద్దితోనే సాధ్యమని చెప్పిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ భావజాలాన్ని పుణికిపుచ్చుకుని వివిధ కార్యక్రమాలు అమలుచేస్తున్నారు. విద్యకు పేదరికం అడ్డురాకూడదని జగనన్న చేస్తున్న కార్యక్రమాలు తెలియనివి కావు. జగనన్న అమ్మ ఒడి కార్యక్రమంతో అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉన్నారు, పిల్లలను మీరు బడికి పంపండి నేను మంచి చదువు చెప్పిస్తాను అని వారికి కావాల్సిన ప్రతీది అందజేస్తున్నారు. జగనన్న విద్యాకానుకలో ఈ ఏడాది కొత్తగా డిక్షనరీ ఇవ్వడంతో పాటు వచ్చే ఏడాది ప్రత్యేకంగా క్రీడలకు సంబంధించి యూనిఫామ్, షూస్‌ ఇవ్వనున్నారు. పిల్లలకు మేనమామగా వారి భవిష్యత్‌కు బంగారుబాట వేస్తున్నారు. పిల్లలు పెరిగేవరకూ మీరే సీఎంగా ఉండాలని అక్కచెల్లెమ్మలు కోరుకుంటున్నారు. అణగారిన వర్గాలకు, బడుగు, బలహీనవర్గాలకు ఉపయోగపడేలా ఇంగ్లీష్‌ మీడియంను ప్రవేశపెట్టి వారి అభ్యున్నతికి పాటుపడుతున్నారు, బడుగు వికాసం పేరుతో దళిత పారిశ్రామిక వేత్తలకు సాయం చేయనున్నారు. మంత్రి వర్గంలో నేను ఒక దళితుడిగా ఉండి విద్యాశాఖను నిర్వహిస్తున్నానంటే ఆయన గుండెల్లో మనకు ఏ స్ధానం ఉందో తెలుసుకోవచ్చు.
వైఎస్‌.అవినాష్‌ రెడ్డి, కడప ఎంపీ
బద్వేలు నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం, ఇటువంటి నియోజకవర్గంలో బ్రహ్మంసాగర్‌ను దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారు పూర్తిచేసి, క్రమం తప్పకుండా ప్రతీ ఏడాది 12, 13 టీఎంసీల నీళ్ళు ఉంచేవారు. దీంతో బద్వేలు నియోజకవర్గంలో అన్ని మండలాలలోని రైతులకు సాగు నీరందేది. ఆయన మరణం తర్వాత ఏ ప్రభుత్వమైనా కనీసం 4,5 టీఎంసీలు అయినా నిల్వచేసిందా అని అడుగుతున్నా. తీవ్రమైన దుర్భిక పరిస్ధితులు ఎదుర్కొన్నారు, కానీ జగనన్న ప్రభుత్వం రాగానే బ్రహ్మంసాగర్‌ను పూర్తిస్ధాయిలో నింపడమే కాక అన్ని మండలాలకు నీరందిస్తున్నారు, అంతేకాక సీఎంగారు ఏడాది క్రితమే కుందూ నుంచి బ్రహ్మంసాగర్‌కు రూ. 600 కోట్లతో ఎత్తిపోతల పథకానికి శంకుస్ధాపన చేశారు, ఆ పనులు కూడా ఏడాదిన్నరలో పూర్తయితే బ్రహ్మంసాగర్‌లో ప్రతీ ఏడాది కచ్చితంగా 14,15 టీఎంసీల నీరు నింపవచ్చు. వెలుగోడు నుంచి బ్రహ్మంసాగర్‌కు నీటి కోసం అనేకసార్లు గత ప్రభుత్వాలకు చెప్పాం కానీ జగనన్న వచ్చిన తర్వాత రూ. 300 కోట్లతో ఆ పనులు ప్రారంభించడం జరిగింది. బ్రహ్మంసాగర్‌ రిజర్వాయర్‌ను అన్ని రకాలుగా స్టెబిలైజ్‌ చేస్తున్నారు. ఏడు మండలాల్లోని రైతులకు ఎటువంటి కరువు పరిస్ధితులు వచ్చినా కూడా అండగా ఉండే కార్యక్రమం చేస్తున్నారు. అనేక ప్రాజెక్ట్‌లు శంకుస్ధాపనతో పాటు బద్వేలు మునిసిపాలిటీని సుందరమైన టౌన్‌గా మార్చబోతున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రతీ ఎకరాకు సాగునీరందించే విధంగా కార్యాచరణ సిద్దం అయింది. తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్ర సమగ్రాభివృద్దికి అహర్నిశలు కృషిచేస్తున్న మన జగనన్నకు ఆ భగవంతుని ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.

వైయస్సార్ కడప…
వైయస్‌ఆర్‌ కడప జిల్లాలో రెండోరోజు పర్యటనలో భాగంగా కడప నగరంలో సుమారు రూ.400 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం వైయస్.జగన్‌ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈసందర్భంగా సీఎం  వైయస్. జగన్‌ మాట్లాడుతూ ఈరోజు కడపలో దాదాపు మరో 400 కోట్ల రూపాయలకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో శంకుస్థాపనలు చేసిన కార్యక్రమాలకు సంబంధించిన పనులు వేగవంతంగా అడుగులు ముందుకు వేస్తున్నాయి. ఈరోజు మళ్ళీ ఇంకా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ మరికొన్ని శంకుస్థాపనలు చేస్తున్నాం.కడప రోడ్డు మార్గంలో వస్తుంటే, ఇక్కడ జరిగిన అభివృద్ధి పనుల వల్ల ఎంతో అహ్లాదకరకంగా అనిపించింది. గతంలో నాన్నగారి హయాంలో 2004-09 మధ్య కడపలో ఇలాంటి అభివృద్ధి జరిగింది. నాన్నగారు చనిపోయిన తరువాత కడపను, ఈ జిల్లాను ఎవరూ పట్టించుకోలేదు.
దేవుడిదయ, మీ అందరి చల్లని దీవెనలతో ఈ రోజు కడప జిల్లాకు మళ్ళీ మంచి రోజులు వచ్చాయి. గతంలో చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ మంచి చేస్తూ, అందుకు అడుగులు ముందుకు వేస్తున్నాం.

నగరంలో మహావీర్ సర్కిల్ నుంచి పుట్లంపల్లి వరకు 100 అడుగుల వెడల్పుతో ఆరు వరుసల రోడ్లు వేశాం.
మహావీర్ సర్కిల్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ఎనబై అడుగుల వెడల్పుతో ఫోర్ లైన్ రోడ్లను నిర్మించాం. ఇప్పుడు వీటిని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. దాదాపు ఎనబై కోట్ల రూపాయలతో ఈ పనులు పూర్తయి, చూడటానికి ఎంతో చక్కగా కనిపిస్తున్నాయి.
శంకుస్థాపనలు చేసే కార్యక్రమాల గురించి చెప్పాలంటే…
కడప నగరంలో మరికొన్ని ముఖ్యమైన రోడ్లను విస్తరిస్తున్నాం.
కృష్ణాథియేటర్ నుంచి దేవుడి కడప వరకు రూ.101 కోట్లతో ఫోర్ లైన్ల రోడ్లకు శంకుస్థాపన చేస్తున్నాం.
అన్నమయ్య సర్కిల్ నుంచి గోకుల్ లాడ్జ్ వరకు రూ.74 కోట్లతో రోడ్ల విస్తరణ చేస్తున్నాం.
అంబేద్కర్ సర్కిల్ నుంచి వై జంక్షన్ రోడ్డు వరకు రూ.62 కోట్లతో రోడ్లు విస్తరణకు శంకుస్తాపన చేస్తున్నాం.
అలాగే ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుంచి పుట్లంపల్లి వరకు రహదారి విస్తరణకు శంకుస్థాపన చేస్తున్నాం.
ఈ రోడ్ల విస్తరణలు జరిగి, సుందరీకరణ పూర్తయితే మంచి నగరాల జాబితాలో కడప కూడా ఖచ్చితంగా చేరుతుంది.
ఒక్కోసారి బుగ్గవంక పొంగి, వరద వచ్చినప్పుడు ఆ కష్టాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. నాన్నగారి హాయంలో బుగ్గవంక వరద నుంచి రక్షణ గోడ, అయిదు బ్రిడ్జ్‌లు నిర్మించడం జరిగింది. ఇంకా మిగిలిపోయిన పనులు ఆ రోజు నుంచి ఎవరూ పట్టించుకోలేదు. ఇటీవల కాలంలో వరద వచ్చినప్పుడు నగర ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. తిరిగి అటువంటి పరిస్థితి పునరావృత్తం కాకుండా ఉండేందుకు రూ. 49.60 కోట్లతో బుగ్గవంక పెండింగ్ పనులు పూర్తి చేసి, వరద సమస్యను నుంచి పూర్తిగా పరిష్కరించేందుకు, రిటైనింగ్ వాల్ నిర్మాణంను పూర్తి చేసే పనులకు ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నాం.
చర్లోపల్లి, పుట్లంపల్లి, రామన్న, బుడ్డాయిపల్లి గొలసుకట్టు చెరువులను పునరుద్దరించడంతో పాటు బ్యూటిఫికేషన్ పనులకు ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నాం.
తెలుగుభాష అభివృద్ధికి విశేష కృషి చేసిన ప్రఖ్యాత సిపి బ్రౌన్ స్మారకార్థం గ్రంథాలయ ఆవరణలో రూ.5.5 కోట్ల వ్యయంతో నిర్మించే నూతన భవనానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషం కలిగిస్తోంది.
దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం.
బుగ్గవంక నుంచి కడప నగరానికి రక్షణ కల్పించిప్పటికీ నగరంలోని ఆర్‌కే నగర్, తిలక్‌నగర్, మృత్యుంజయకుంట, ఎస్‌బిఐ కాలనీ, ప్రకాశ్ నగర్, ఎన్జీఓ కాలనీ, ఎఎస్‌ఆర్ నగర్, గంజికుంట కాలనీ తదితర ప్రాంతాల్లో చిన్నపాటి వర్షానికే జలమయం అవుతున్నాయి. ఈ సమస్యకు స్ట్రామ్‌వాటర్ డ్రైయిన్ ద్వారా శాశ్వత పరిష్కారం చూపాలని డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మేయర్ సురేష్‌ చెప్పారు. దీనికి సంబంధించి నాలుగు డ్రైన్‌లను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుని, దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం.ఈ పనుల వల్ల కడప నగరానికి మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను.
గతంలో ప్రారంభించిన పనుల పురోగతికి సంబంధించిన విషయాలకు వస్తే…
రూ.125 కోట్లతో డాక్టర్ వైయస్‌ఆర్ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
మరో రూ. 40.82 కోట్లతో డాక్టర్ వైయస్‌ఆర్ సైకియాట్రిక్‌ ఆసుపత్రి పనులు చక్కగా జరగుతున్నాయి.
మరో రూ.107 కోట్లతో డాక్టర్ వైయస్‌ఆర్ క్యాన్సర్ కేర్ సెంటర్ ఏర్పాటుకు టెండర్ల ప్రకియ పూర్తయింది. ఆటమిక్ రెగ్యులేటరీ బోర్డ్ అనుమతి రావడానికి కాస్త ఆలస్యం అయ్యింది. అవి కూడా త్వరలోనే వస్తాయి. రాగానే ఆ పనులు కూడా వేగంగా జరుగుతాయి.
దీనితో పాటు రాజీవ్‌మార్గ్ అభివృద్దికి సంబంధించి సుమారు రూ.4 కోట్లతో చేపట్టిన పనులు జోరుగా జరుగుతున్నాయి.
రూ.55 కోట్లతో చేపట్టిన దేవుడి కడప సరస్సు అభివృద్ధి పనులు రివర్స్‌ టెండరింగ్ స్టేజ్‌లో ఉన్నాయి. ఈ పనులు వచ్చే నెలలో ఊపందుకుంటాయి.
ఇవాళ మీ అందరితో ఒక చిన్న విషయం ఖచ్చితంగా చెప్పాలి. కడప జిల్లాకు ఎంత చేసినా కూడా తక్కువే. ఈ జిల్లా రుణం నేను తీర్చుకోలేను. ఈ జిల్లా ప్రజలు నన్ను ఎప్పుడూ గుండెల్లో పెట్టుకున్నారు. మీరు ఇచ్చిన భరోసాతోనే నేను రాష్ట్రం వైపు చూడగలిగాను. ఈ జిల్లాను చూడాల్సిన పనిలేదన్న భరోసాతోనే ఇది నేను చేయగలిగాను. ఆ అభిమానం, ఆప్యాయతలు ఎల్లప్పుడ నా మనస్సులో ఉంటాయని, ఇంతటి ఆప్యాయతలు, ప్రేమాభిమానాలు చూపినందుకు సదా మీకు రుణపడి ఉంటానని చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను అని సీఎం శ్రీ వైయస్ జగన్ తన ప్రసంగం ముగించారు.

అమర జవాన్‌కు సీఎం నివాళి
-కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ.50 లక్షల ఆర్థిక సహాయం

ఉగ్రవాదులపై పోరులో భాగంగా కశ్మీర్‌లో ప్రాణత్యాగంచేసిన గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెంకు చెందిన జవాను జశ్వంత్‌రెడ్డి చిరస్మరణీయుడని సీఎం  వైయస్‌.జగన్‌ వ్యాఖ్యానించారు. దేశ రక్షణలో భాగంగా కశ్మీర్‌లో తన ప్రాణాలు పణంగాపెట్టి పోరాటంచేశారని, జశ్వంత్‌రెడ్డి త్యాగం నిరుపమానమైనది అన్నారు. మన జవాన్‌ చూపిన అసమాన ధైర్యసాహసాలకు ప్రజలంతా గర్విస్తున్నారన్నాంటూ నివాళులు అర్పించారు. ఈ కష్టకాలంలో జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి తోడుగా నిలవాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. జశ్వంత్‌రెడ్డి సేవలు వెలకట్టలేనివని, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి సమాచారం తెలియగానే ఈ విధంగా స్పందించారు.

 

 

Check Also

జాతీయ లోక్ అదాలత్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *