Breaking News

ఆషాఢమాసం… శ్రీ వారాహి నవరాత్రులు…


అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు.వీటిని గుప్తనవరాత్రులు అంటారు.

అమ్మవారి వైభవం గురించి కొంత…

మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి.

వారాహి దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని..లలిత యొక్క రధ, గజ, తురగ, సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి…అందుకే ఆవిడను దండనాథ అన్నారు.

లలితా పరమేశ్వరి యొక్క ఐదు పుష్పబాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహ ముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహా వారాహీ దేవి.

లలితా దేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు.ఆమెకు ప్రత్యేక రథం ఉంది,దానిపేరు కిరి చక్రం.ఆ రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి, రథసారథి పేరు స్థంభిని దేవి. ఆమె రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరీ, మరియు దేవవైధ్యులైన అశ్విని దేవతలు.

వారాహీ అమ్మవారు అంటే భూదేవి. హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు,శ్రీ మహావిష్ణువు వరాహరూపంలో అవతరించి, వాడిని సంహరించి,భూదేవిని రక్షిస్తాడు. స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహీ రూపం తీసుకుందని, అందువలన ఈమె వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యానశ్లోకాల్లో కనిపిస్తుంది. అంటే వారాహీ అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వసంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మీ.

అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహీ ధరణీ ధ్రువా అని కనిపిస్తుంది. కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరహాస్వామి లాగే అన్ని కోరికలను నెరవేర్చుతుంది. భూ తగాదాలను నివారిస్తుంది, లేదా పరిష్కరిస్తుంది.

అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్ట భుజాలతో, శంఖ, చక్ర, హల(నాగలి),ముసల(రోకలి), పాశ, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది.

నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే, రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు.

దీనిబట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి.

అంటే పాడిపంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లీ శ్రీ వారాహీ మాత.అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించమన్నారు. నిజానికి రైతు గోఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి, సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహీ ఉపాసనే అవుతుంది. ఎందుకంటే వారాహీ అంటే ఎవరో కాదు సాక్షాత్తు భూమాత.

పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే, ఉగ్రం వారాహి… శ్రీ విద్యా గద్యంలో “అహంకార స్వరూప దండనాథా సంసేవితే, బుద్ధి స్వరూప మంత్రిణ్యుపసేవితే” అని లలితను కీర్తిస్తారు… దేవీ కవచంలో “ఆయూ రక్షతు వారాహి” అన్నట్టు…ఈ తల్లి ప్రాణ సంరక్షిణి….ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం.

వారాహీ అమ్మవారిని స్మరిస్తే శత్రు నాశనం జరుగుతుంది, అంటే వ్యక్తిలో ఉన్న అంతఃశ్శత్రువులైన కామం, క్రోధం,లోభం,మోహం,మదం,మాత్సర్యం, అహంకారం, అజ్ఞానం నశిస్తాయి. అంతఃశ్శత్రువులను జయించినవాడికి బయట శత్రువులు ఉండరు లేదా కనిపించరు.

అంత విశాలమైన దృష్టి అతడికి కలుగుతుంది. అలాంటి దివ్యస్థాయిని ప్రసాదిస్తుంది వారాహీ మాత.

అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికి…బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి…ముఖ్య ప్రాణ రక్షిణి…

దేశం సుభిక్షంగా ఉండాలని…మనమంతా చల్లగా ఉండాలని…ధర్మం వైపు మనం నడవాలని…అమ్మ మహావారాహి పాదాలను పట్టి ప్రార్దనచేద్దాం.

Check Also

వరద బాధితులకు విరాళాల వెల్లువ

-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *