-రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీకాకుళం జిల్లాను అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఇందుకు జిల్లా యంత్రాంగం, అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఉత్తరాంద్ర జిల్లాల పర్యటనలో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రతీ ఇంటికి తాగునీరు, విద్యుత్, గ్యాస్, మరుగు దొడ్లు, గృహ స్థలం, గృహం నిర్మాణం ఉండాలని, ఆ దిశగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. వాటితో పాటు విద్య, వైద్యం, రోడ్లు, వీధిదీపాలు, కాలువలు వంటి అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం తెలిపారు. ఇందుకు అధికారులు భాద్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. గత తమ ప్రభుత్వంలో చెత్తను రిక్షా ద్వారా కలెక్ట్ చేసి, రీసైకిల్ చేయడం జరిగేదన్నారు. దాన్ని నిర్వీర్యం చేసారని చెప్పారు. జల్ జీవన్ మిషన్ కింద స్వచ్ఛమైన తాగునీటిని ప్రతి ఇంటికీ అందించే కేంద్ర ప్రభుత్వ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసారని అన్నారు. ప్రస్తుతం ఈ పథకాన్ని పక్కాగా అమలుచేస్తూ ప్రతి ఇంటికి తాగునీరు అందించనున్నట్లు సీఎం తెలిపారు. ఇందుకు అందుబాటులో ఉన్న నీటివనరులను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. రానున్న ఆరు మాసాల్లో ప్రతి ఇంటికి తాగునీరు అందించాలని ఆదేశించారు.
గత ప్రభుత్వం లేనిపోని పనులు చేసి ప్రజలకు చాలా ఇబ్బందులకు గురిచేసిందని, ఐదేళ్లు పాలనలో రోడ్లు పూర్తిగా కోల్పోయి వాటికోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
రహదారులలో ఉన్న గుంతలను పూడ్చేoదుకు విజయనగరం జిల్లాలో నవంబర్ 2వ తేదీన శ్రీకారం చుట్టి, రాష్టంలో గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్ చాలా వెనుకబడిందని, గత ప్రభుత్వం నిర్వాకం వలన మరింత వెనుక బడిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రతి ప్రభుత్వ శాఖలు పనుల పురోగతికి చర్యలు చేపట్టాలన్నారు. గత ప్రభుత్వంలో ఇసుక అమ్మకాల్లో భారీ అక్రమాలు జరిగాయాని, వ్యక్తిగత ప్రాధాన్యత తప్పా, ప్రజా ప్రయోజనం గురించి ఆలోచన చేయలేదన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు మంచి చేసేలా ఉండాలన్నారు. అందుకే తమ ప్రభుత్వం వచ్చాక ఇసుకను పూర్తిగా ఉచితం చేశామని, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. గతంలో లిక్కర్ పై భారీ అవకతవకలు జరిగాయని అన్నారు వాటిని ఒక గాడిలోకి తేవడం జరిగిందని, అయితే సంబంధిత యంత్రాంగం బెల్ట్ షాపులు లేకుండా, అధిక ధరలకు విక్రయించ కుండా సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇసుక, మద్యం విషయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడిన, నిర్లక్ష్యం వహించిన బాధ్యులను జైలుకు కూడా పంపేందుకు వెనుకాడబోమన్నారు.ఎన్నికల ముందు ప్రజలకు హామీలు ఇవ్వడం జరిగిందని, వాటి అమలుకు అందరూ సహకరించి స్థానిక ప్రజా ప్రతినిధులతో అధికారులు సమన్వయం తప్పనిసరి తెలిపారు. ప్రతీ ఇంటికి ఒక ఐటి ప్రతినిధి ఉండాలని, అలాగే ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక వేత్త రావాలని సీఎం ఆకాంక్షించారు. వ్యవసాయ, పరిశ్రమలు వంటి వాటిలో పురోగతి ఉంటుందని, తద్వారా అభివృద్ధి, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందన్నారు. ఇందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని అన్నారు. ఒక శాతం గ్రోత్ అంటే దాదాపు 16వేల కోట్లు ఉంటుందని, అందుకే స్వర్ణాoధ్ర విజన్ – 2047 పేరిట ప్రతి ఏడాది 15 శాతం వృద్ధి ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయమని చెప్పినట్లు తెలిపారు. అదే జరిగితే ఆర్ధిక వృద్ధిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ టాప్ లో ఉంటుందని అన్నారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం మారిందని, ఎంత కష్టపడి పనిచేశామని కాకుండా, ఎంత స్మార్ట్ గా పనిచేసామన్నదే కావాలన్నారు. ఉపాధి, వ్యవసాయం, ఉద్యానవనం తదితరమైనవి మెరుగుపరచడం ద్వారా గ్రామాలు అభివృద్ధి కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. జీరో పోవేర్టీ, పబ్లిక్ ప్రైవేట్ పార్టీషన్, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టీషన్ వంటివి ప్రోత్సహించడం ద్వారా అభివృద్ధి బాగా జరుగుతుందని అన్నారు.వాటర్ మేనేజ్ మెంట్ పై దృష్టి సారించాలని జిల్లాలో వంశధార బహుదా నదులను అనుసంధానం చేయగలిగితే మంచి ఫలితాలు లభిస్తాయన్నారు. వాటర్ కన్వర్జేషన్ పై ప్రత్యేకత సాధించాలని, గ్రౌండ్ వాటర్ రీచార్జ్ చేయాలన్నారు. దీపం పధకం 2 ద్వారా అర్హులకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలండర్లు ఉచితంగా అందజేసే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టామన్నారు. 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గతంలో చాలా కార్యక్రమాలు చేయించడం జరిగిందని, ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగిందని అంతేకాకుండా రచ్చబండపై పలు కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేయడం జరిగిందన్నారు. 2047 నాటికి ప్రపంచంలోనే భారత దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ మెదటి స్థానంలో నిలుస్తుందన్నారు.
జిల్లాలో కొన్ని అధిక ప్రాధాన్యత అంశాలు చేపట్టడం జరుగుతుందన్నారు. అందులో రూ 4,360 కోట్లతో మూలపేట పోర్ట్ అక్టోబర్ 2025 నాటికి పూర్తి కానుందన్నారు. మూలపేట నుంచి భోగాపురం వరకు బీచ్ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. అలాగే ఇరిగేషన్ అభివృద్ధిలో బహుద నుంచి పెన్నా వరకు పనులు, నేటికీ పూర్తి అయిన ఇరిగేషన్ పనులపై సమీక్షించారు. పనులు పూర్తికి కావలసిన అంశాలపై సమీక్షించారు.
వంశధార ఎడమ కాలువ పనులు చేపట్టవలసి ఉందని దానికి సంబందించిన అనుమతులు ఇప్పించవలసినదిగా నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి కోరగా ప్రాధాన్యత క్రమంలో అందుకు కావలసిన చర్యలు చేపట్టడం జరుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు.
శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ శివారు గ్రామానికి సాగునీరు అందటం లేదని, అందుకు కావలసిన చర్యలు చేపట్టాలని కోరగా, ప్రాధాన్యత క్రమంలో చర్యలు చేపడతామని
ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్.ఈశ్వరరావు మాట్లాడుతూ నారాయణపురం శివారు భూములకు నీరందటం లేదన్నారు. ముఖ్యమంత్రి వర్యులు మడ్డువలస పనులపై ఆరాతీయగా సంబంధిత వివరాలు ఎస్ఈ ఇరిగేషన్ ను ఆరా తీయగా సంబంధిత నిధులు, చేపట్టిన పనుల వివరాలను వివరించారు.
కొవ్వాడ పనుల పురోగతి పై ఆరా తీయగా కొవ్వాడ ఎపిఎన్పిపి అసోసియేట్ డైరెక్టర్ నేటికీ చేపడుతున్న పనులు వివరించారు.
శ్రీకాకుళం మునిసిపల్ కార్పొరేషన్ పై సమీక్ష జరిపిన సమీక్షలో పలువురు కార్పొరేషన్ అభివృద్ధికి పలు సూచనలు అందజేయగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అంచలంచాలుగా పనులు పురోగతికి చర్యలు చేపట్టాలన్నారు. కోడి రామమూర్తి స్టేడియం పనులు పురోగతి లేదని, అలాగే ఆముదాలవలస రోడ్డు పనుల చాలా మందకొడిగాజరుగుతున్నాయని పలువురు తెలియజేసారు. సంబంధిత కాంట్రాక్టర్లు పనులు నిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు.అరసవిల్లి దేవాలయంకు సంబంధించిన సమావేశంలో సుందరీకరణ, అభివృద్ధి పనుల నిమిత్తం రూ.100 కోట్లు ప్రతిపాదనలు తయారు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వివరించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ నాగావళి బ్యూటిఫికేషన్, ఇంటిగ్రేషన్ కలెక్టరేట్, జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రయివేట్ హోటల్స్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు. అందుకు కావలసిన స్థల పరిశీలన చేయాలన్నారు.
ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ కేంద్రాలపై సమీక్షించగా డిసిహెచ్ఎస్ మాట్లాడుతూ ఉద్దానం ఏరియాలో 18 పీహెచ్సీలు, 5యూపీహెచ్ఎస్లు, 6 సిహెచ్సిలు ఉన్నాయన్నారు. డయాలసిస్ కేంద్రం రన్ అవుతుందన్నారు.
గృహనిర్మాణ సంస్థ గృహ నిర్మాణాల పై సమీక్షించాగా వ్యవసాయ శాఖామాత్యులు కింజరాపు అచ్చెంనాయుడు మాట్లాడుతూ చాలా మంది లబ్దిదారులకు గృహ నిర్మాణ బిల్లులు అందలేదన్నారు. ముఖ్యమంత్రివర్యులు మాట్లాడుతూ గృహ నిర్మాణ సంస్థకు సంబంధించి రాష్ట్రంలో కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిపై పరులు చేపట్టి చర్యలు చేపడతామన్నారు.
వైన్స్ షాపులు నిర్వహణపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ బెల్ట్ షాపులు నిర్వహించుకూడదని షాపులు నిర్వహిస్తున్న వారిపై పెనాల్టీ వేయడమే కాకుండా కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుందని, అమలులో యంత్రం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.ఇసుక విధానం అమలుపై అక్రమాలు చేపడితే పి డి యాక్ట్ అమలు చేస్తామన్నారు. మూలపేటలో ఇండస్ట్రీలు, ఫార్మర్ ఇండస్ట్రీస్ వస్తే ఉపాధి అవకాశాలు చాలా ఉంటాయన్నారు.
జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ మాట్లాడుతూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో చేపట్ట బోయే ప్రగతిని ముఖ్యమంత్రికి వివరించారు.
ఈ సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమలు, ఎన్ఆర్ఐ సాధికారిత శాఖ మంత్రి మరియు ఇంచార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రాష్ట్ర వ్యవసాయ, పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు,విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పల నాయుడు శాసనమండలి సభ్యులు పాకల పాటి రఘువర్మ, వేపాడ చిరంజీవి,శాసనసభ్యులు గొండు శంకర్, కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి, ఎన్.ఈశ్వర రావు, గౌతు శిరీష, బెందాళం అశోక్, మామిడి గోవిందరావు, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె.వి.మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, సీతంపేట ఐటిడీఏ పీఓ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News