విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో జాతీయ రైస్ మిల్లర్స్ అసోయేషన్ జాతీయ స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. సోమవారం బందరు రోడ్డులోని ఎస్‌ఎస్ కన్వెన్షన్‌లో జరిగిన ఈ సమావేశంలో రాజకీయ ప్రముఖులు, వివిధ రాష్ట్రాల నుండి అసోసియేషన్ నాయకులు, సభ్యులు పాల్గొని తమ సమస్యలు భవిష్యత్ కార్యాచరణ చర్చించి పలు తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ మిల్లర్లపై మార్కెట్ సెస్ రెండు శాతం నుంచి ఒక శాతానికి తగ్గించాలనే అంశంతోపాటు నిత్యావసర వస్తువుల ధరల పర్యవేక్షణపై మంత్రుల కమిటీలో చర్చించినట్లు, ఇదే అంశాన్ని ఈ నెల 6న కేబినెట్ సమావేశం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. రైతులు, మిల్లర్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధులను ఏర్పాటు చేసి ప్రతి విషయంలోనూ పారదర్శకంగా ఉండేలా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు మిల్లర్లు సహకరించాలన్నారు. దేశ వ్యాప్తంగా యూనిఫామ్ పాలసీ తీసుకొచ్చేలా అందరమూ కలిసి లోతుగా అధ్యయనం చేద్దామన్నారు. రూ.19,800 కోట్ల టర్నోవర్ ఉన్న పౌరసరఫరాలశాఖలో రూ.41,150 కోట్లు బకాయిలు చేసి గత వైసిపి ప్రభుత్వం వెళ్లిపోయిందన్నారు. చివరికి రైతులకు కూడా బకాయిలు చెల్లించకుండా కాలం వెళ్లదీసిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్.. మంచి నిర్ణయం తీసుకోవడంతో రైతులకు నెల రోజుల్లోనే రూ.1,674 కోట్లు బకాయిలు చెల్లించినట్లు ఆయన తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యేలోపే రూ.283 కోట్లు బకాయిలు చెల్లించామని, మరో వారం రోజుల్లో రూ.200 కోట్లు చెల్లిస్తామని వెల్లడిరచారు. వరదల సమయంలో బాధితులకు 25 కేజీల బియ్యం అందించడంలో మిల్లర్లు ఎంతో సహకరించారని మంత్రి పేర్కొన్నారు. మిల్లర్ల సమస్యలపై చర్చ చేసి.. తప్పకుండా మీ ఇబ్బందులను పరిష్కరిస్తామని, పౌరసఫరాలశాఖ తరపున మీకు నేను అండగా ఉంటానన్నారు. అందరం కలిసి అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందేలా, రాష్ట్ర అభివృద్దిలో అందరూ భాగస్వామ్యం కావాలనేదే మా ఆకాంక్ష అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్లు వివిధ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో అసోసియేషన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News