-స్పందనలో అందిన విజ్ఞప్తులను గడువులోగా పరిష్కరించండి…
-కోవిడ్ కట్టడికి నో మాస్క్ – నో ఎంట్రీ”, “నో మాస్క్ – నో రైడ్”, “నో మాస్క్ – నో సెల్ ” నినాదాలతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు…
-సబ్ కలెక్టర్ బి, సూర్యసాయి ప్రవీణ్ చంద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ డివిజన్ లో గృహనిర్మాణ శాఖచే ప్రతిపాదించిన ఇళ్ల నిర్మాణ అన్ని లేఅవుట్ల అభివృద్ది అప్రోచ్ రోడ్లతో సహా వారం రోజులోగా పూర్తి చేయాలని విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కోవిడ్ వ్యాక్సినేషన్, ఫీవర్ సర్వే ఇళ్ల నిర్మాణం సిసిఆర్ సి కార్డుల పంపిణీ రేషన్ పంపిణీ తదితర అంశాలపై మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్ లో డివిజన్లోని తహాశీల్దార్లు, యంపిడివోలు, మెడికల్ ఆఫీసర్లు, వ్యవసాయ, హౌసింగ్ శాఖల అధికారులతో సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహనిర్మాణ శాఖచే ప్రతిపాదించిన ఇళ్ల నిర్మాణంలో సంబంధిత అధికారులు సమన్వయంలో పనిచేయాలన్నారు. వియంసి లేఅవుట్లకు సంబంధించి పెనమలూరు, జి.కొండూరు, కంకిపాడు, విజయవాడ రూరల్, ఇబ్రహీంపట్నం గన్నవరం మండలాల్లోని 1870 ఎకరాల్లోని 18లేఅవుట్ల అభివృద్ధి పనులపై ఆయన సమీక్షించారు. డివిజనల్ లో నవరత్నాలు ఇళ్ల స్థలాలు 90 రోజుల పథకంపై ఆయన సమీక్షిస్తూ ఇంతవరకు గ్రామీణ ప్రాంతాల్లో 6,252 ధరఖాస్తులు ఆమోదించగా అర్బన్ ప్రాంతాల్లో 5,806 ఆమోదించడం జరిగిందన్నారు. మరో 1218 ధరఖాస్తులు తిరస్కరించడం జరిగిందన్నారు. పెండింగ్ లో ఉన్న 530 యొక్క ధరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు వారంలో మూడు రోజులు కోవిడ్ పై అవగాహన కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. కోవిడ్ కట్టడికి “నో మాస్క్ – నో ఎంట్రీ”, “నో మాస్క్ – నో రైడ్”, “నో మాస్క్ – నో సెల్ ” నినాదాలతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేట్టాలన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంతోపాటు గర్భిణీ స్త్రీలకు, 5 సంవత్సరాలోపు పిల్లలు ఉన్న తల్లులకు, మొదటి విడత వ్యాక్సిన్ వేసుకుని రెండవ విడత పెండింగ్ ఉన్న వారికి కోవిడ్ టీకాలు అందించడంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వలన్నారు. ఫీవర్ సర్వే త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు సిసిఆర్ సి కార్డుల పంపిణీ లక్ష్యాలను అధిగమించాలన్నారు. కంచికచర్ల మండలంలో 120.7 శాతం లక్ష్యం సాధించి ముందు వుండగా పెనుగంచిప్రోలు మండలం 70.1 శాతంతో వెనుకబడి ఉందన్నారు. పౌర సరఫరాల విషయంలో ప్రతి నెల 15 తేది లోపుగా నిత్యావసర సరుకుల పంపిణీ పూర్తి చేయాలన్నారు. సమావేశంలో రీ సర్వే , ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్, అంగన్ వాడి సెంటర్లకు భూమి లభ్యత తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సబ్ కలెక్టర్ సమీక్షించారు. స్పందన కార్యక్రమంపై ఆయన సమీక్షిస్తూ ప్రజల నుంచి వచ్చి విజ్ఞప్తులను స్వయంగా సంబంధిత అధికారులే పర్యవేక్షించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. ఈ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యానికి తావు లేదన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక తదితరులు పాల్గొన్నారు.