మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని మంగినపూడి బీచ్, దత్తాశ్రమం భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నుంచే కాక రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున బీచ్ కు, దత్తాశ్రమానికి తరలివచ్చారు. భక్తులు బీచ్ లో సముద్ర స్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించి శివుని ఆరాధించారు. అనంతరం భక్తులు దత్తాశ్రమానికి చేరుకుని అక్కడ కూడా శివలింగాలకు ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మచిలీపట్నం మండలం మంగినపూడి బీచ్ లో రాష్ట్ర గనులు, భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా పోలీసు అధికారి ఆర్ గంగాధర్ రావు నేతృత్వంలో జిల్లా యంత్రాంగం బీచ్ లో స్నానం ఆచరించే భక్తుల కోసం ఎలాంటి లోటుపాట్లు లేకుండా పలు సౌకర్యాలు కల్పించింది. భక్తులు సముద్రంలో స్నానమాచరించే సమయంలో ప్రమాదాలకు గురి కాకుండా హై టైడ్, లో టైడ్ ప్రాంతాలను గుర్తించి గుంజలు పాతి, తాళ్లు కట్టి ఎర్రజెండాలు ఏర్పాటు చేశారు. భక్తులు ఆ గుంజలు దాటిపోకుండా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గమనిస్తూ ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు పైనున్న రెండు వాచ్ టవర్ల మీద నుండి పర్యవేక్షించారు. ఏమైనా ప్రమాదం పొంచి ఉంటే ముందుగానే గుర్తించి కిందనున్న పోలీసులు, గజ ఈతగాళ్లను అప్రమత్తం చేయడం జరిగింది.
భక్తులకు ఏర్పాటుచేసిన సౌకర్యాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించవలసిన పద్ధతుల గురించి ముఖ్యంగా పిల్లలకు పాలు పంపిణీ, ట్యాగ్ వేయుట, ప్రసాదాలు పంపిణీ, ఉచిత వైద్య శిబిరం వంటి వాటిపై నిరంతరము మైకు ద్వారా అనౌన్స్మెంట్లను చేశారు. అంతేకాకుండా ఒక ఆటో కు మైకు ఏర్పాటు చేసి కూడా చుట్టుపక్కల తిరుగుతూ అనౌన్స్మెంట్ ఏర్పాట్లు చేశారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా ఐసిడిఎస్ అధికారులు, సిబ్బంది పిల్లల చేతికి ఫోన్ నెంబర్లతో ట్యాగులు వేస్తూ ఉచితంగా పాలను పంపిణీ చేశారు.
సముద్ర స్నానం చేసే భక్తులు ఎవరైనా పొరపాటున ప్రమాదాలకు గురి అయితే వెంటనే రక్షించేందుకు 60 మంది గజ ఈతగాళ్ళు, మెరైన్ పోలీసులు, ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాన్ని పడవలతో సిద్ధంగా వుంచారు. తాళ్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఆరోగ్య సమస్యలు ఉన్న భక్తులకు కావలసిన మందులు ఉచితంగా అందజేశారు. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం, మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం,వేమవరం శ్రీ కొండాలమ్మ దేవస్థానం, మచిలీపట్నం బచ్చుంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ రంగనాయక స్వామి దేవస్థానం నుండి తెప్పించిన పులిహోర, లడ్డు ప్రసాదాలను భక్తులందరికీ ఉచితంగా పంపిణీ చేశారు
ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి భక్తులకు మంచినీటి ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తప్పిపోయిన వారి గురించి మైకు అనౌన్స్మెంట్ ద్వారా పోలీసులు సహాయపడ్డారు. భక్తులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు ఎక్కడ ఉన్నాయో తెలియజేస్తూ సూచిక బోర్డులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆ ప్రకారం పార్కింగ్, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులను భక్తులు సద్వినియోగం చేసుకున్నారు. అంతేకాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని భక్తులకు తెలియజేస్తూ సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. బీచ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా చెత్త లేకుండా పారిశుద్ధ కార్మికులు ఎప్పటికప్పుడు చెత్తను ఎత్తివేసి ట్రాక్టర్లలో తరలించారు. ప్రతి కౌంటర్ వద్ద చెత్తకుండీలను ఏర్పాటుచేసి చెత్తను అందులో వేసే విధంగా భక్తులకు మైకు ద్వారా మార్గ నిర్దేశం చేశారు. ఒక పోలీస్ ఔట్ పోస్టును ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు భక్తులకు సహాయక చర్యలు చేపట్టారు. తెల్లవారుజామున,రాత్రివేళ భక్తులు సముద్రంలో స్నానం చేయుటకు వీలుగా హైమాస్ట్ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. బీచు, దత్త ఆశ్రమంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక ఫాల్కన్ వాహనాన్ని ప్రత్యేకంగా తెప్పించి అందులోని మానిటర్లో డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించిన దృశ్యాలను నిరంతరం పోలీసులు గమనిస్తూ తొక్కిసలాట జరగకుండా అవసరమైనప్పుడు ఇతర పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ ఏర్పాట్లు సజావుగా జరుగుతున్నాయా లేదా అని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కుటుంబ సమేతంగా వచ్చి పరిశీలించి సముద్ర స్నానం చేశారు.
అలాగే మచిలీపట్నం రెవిన్యూ డివిజనల్ అధికారి కే స్వాతి, డిపిఓ జే అరుణ, జిల్లా పర్యాటక అధికారి రామ్ లక్ష్మణ్, డిఎస్పి అబ్దుల్ సుభాని, మచిలీపట్నం, మోపిదేవి తహసిల్దారులు మధుసూదన్, శ్రీవిద్య తదితర అధికారులు బీచ్ లో భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Prajavartha Online Telugu News