-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరదల పేరుతో ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం వడ్డనకు సిద్దమైందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. రాష్ట్ర జీఎస్టీపై 1 శాతం అదనం సర్ ఛార్జీని విధించేందుకు వెసులుబాటు కల్పించాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరడాన్ని ఆయన తప్పుబట్టారు. కేంద్రం నుంచి రావలసిన నిధులు రాబట్టడంలో కూటమి సర్కార్ పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు. అది చేతగాక ప్రజలపై అదనపు భారం మోపడం సరైన విధానం కాదన్నారు. దాతలు సాయంగా అందించిన వందల కోట్ల నిధులు ఏమయ్యాయని ఈ సందర్భంగా ప్రశ్నించారు. పైగా అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి సహాయం అందించమని కేంద్రాన్ని కోరవలసిందిపోయి.. పన్ను వేసేందుకు సహకరించమని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. మిమ్మల్ని ఆదుకునేందుకు మీపైనే పన్ను వేయబోతున్నామని వరద బాధితులకు చెప్పటం దేశంలోనే తొలిసారి చూస్తున్నామన్నారు. అసలు కేంద్ర బృందాలు అంచనా వేసిన వరద నష్టమెంత..? రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అందించిన సాయమెంత.? విరాళాలు రూపంలో దాతలు అందించిన మొత్తం.. కేంద్రం ప్రకటించిన సాయంపై సవివరంగా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలు, కరెంట్ ఛార్జ్ లతో సామాన్యుడి బ్రతుకు చిత్రం భారంగా మారిపోయిందని మల్లాది విష్ణు మండిపడ్డారు. మరోసారి వడ్డనకు సిద్దమైతే ప్రజలు ఈ రాష్ట్రంలో ఎక్కడా బ్రతికే పరిస్థితి ఉండదని దుయ్యబట్టారు. కనుక రాష్ట్ర జీఎస్టీపై అదనపు సర్ ఛార్జీ విధింపు ఆలోచనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని కోరారు. లేనిపక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
Prajavartha Online Telugu News