-ఘనంగా జగనన్న పచ్చతోరణం నిర్వహణ…
-అడవులు విస్తరిస్తేనే పర్యావరణ సమతుల్యత…
పోలాకి, నేటి పత్రిక ప్రజావార్త :
సామాజిక వనాల పెంపకం నిరంతర యజ్ఞంలా సాగాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన మంగళవారం జగనన్న పచ్చ తోరణం (వనమహోత్సవం) కార్యక్రమంలో భాగంగా తన స్వగ్రామమైన మబగాంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం దేవాది వరకూ వైక్ ర్యాలీ నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా దేవాది జాతీయ రహదారి వరకూ 200కి పైగా మొక్కల్ని నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రంలో చెట్లు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి విరివిగా మొక్కలు నాటి.. అవి వృక్షాలుగా ఎదిగే వరకు తోడుగా నిలుద్దామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23 శాతం మాత్రమే ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచే దిశగా అందరం కలిసి ప్రయత్నం చేయాలన్నారు. మనం పీల్చే గాలి ఆక్సిజన్ అని, ప్రపంచంలో ఏ జీవి అయినా ఆక్సిజన్ ను పీల్చుకుని కార్బన్ డయాక్సైడ్ ను వదిలేస్తుందని, ఒక్క చెట్టు మాత్రమే పగటి పూట కార్బన్ డయాక్సైడ్ ను తీసుకుని ఆక్సిజన్‌ను పదులుతుందని చెప్పారు. చెట్టు ఉంటే స్వచ్ఛమైన ఆక్సిజన్ లెవెల్స్ మెరుగ్గా ఉంటాయనే విషయం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంశమని తెలిపారు. చెట్లు ఉన్న చోట మాత్రమే మంచి వర్షాలు కురిసే పరిస్థితి ఉంటుందన్నారు. మనం తరగతి చదువుల్లో పరీక్షలు రాసేటప్పుడు ఫోటో సింథసిస్, ఆస్మోసిస్ అని, ట్రాన్స్పిరేషన్ అని రకరకాల సిద్ధాంతాలు చదివి ఉంటామని గుర్తు చేశారు. చెట్ల వల్ల వర్షం ఎలా ప్రభావితం అవుతుంది, ఎక్కువ వర్షాలు పడే అవకాశాలు ఎందుకుంటాయనే విషయాలను జ్ఞాపకం ఉంచుకోవాలన్నారు. వాటి వల్ల మనకు జరిగే మంచిని దృష్టిలో పెట్టుకుంటే, చెట్లను పెంచాల్సిన అవసరం ఎప్పుడూ కనిపిస్తుందని పేర్కొన్నారు. ప్రకృతి సమతుల్యతను కాపాడాలంటే ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటడం తప్పనిసరి అని అన్నారు. వైఎస్ఆర్సీపీ యువనేత డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితం కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అందులో భాగంగానే మొక్కలు నాటడంలో ప్రజలంతా భాగస్వాములై పర్యావరణ పరిరక్షణకు కృషి చేసి ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. రాష్ట్రాన్ని పచ్చని తోరణంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కీలకపాత్ర వహించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ డైరెక్టర్ హెచ్. కూర్మారావు మాట్లాడుతూ జగనన్న పచ్చతోరణంలో భాగంగా పోలాకి మండలంలో అవెన్యూ ప్లాంటేషన్ కింద 30 కిలోమీటర్లలో రోడ్డుకు ఇరువైపులా 11500 మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్ణయించామన్నారు. హార్టికల్చర్ ప్లాంటేషన్ కింద 21.50 ఎకరాల్లో పండ్లతోట పెంపకాన్ని చేపడతామని తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కల్ని సంరక్షించడానికి 66 మంది మహిళా గ్రూపుల సభ్యులను ఎంపిక చేశామన్నారు. ఒక్కో సభ్యురాలికి 200కి తక్కువ కాకుండా మొక్కలను సంరక్షణకై అప్పగిస్తున్నామన్నారు. ఇందుకోసం మొత్తం 134.82 లక్షల రూపాయలను మూడేళ్లలో ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో డిసిసిబి ఛైర్మన్ కరిమి రాజేశ్వరరావు, సుడా చైర్ పర్సన్ ప్రతినిధి గుప్త, వైఎస్ఆర్ సీపీ నాయకులు ధర్మాన లక్ష్మణదాస్, మబగాం సర్పంచ్ పిట్ల దానమ్మ, మాకివలస సర్పంచ్ రావాడ మోహన్, పొందర, శ్రీశయన కార్పొరేషన్ల ఛైర్పర్సన్ ప్రతినిధులు రాజాపు అప్పన్న, చీపురు కృష్ణమూర్తి, ఆరంగి మురళీధర్, తంగి మురళీ, బొబ్బాది ఈశ్వరరావు, అటవీశాఖ అధికారులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.