Breaking News

అగ్రిగోల్డ్ పై మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… : ఎమ్మెల్యే  మల్లాది విష్ణు


-అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసేందుకు చంద్రబాబు అండ్ కో చేయని కుట్రలు లేవు…
-ఎమ్మెల్యే  చేతుల మీదుగా సీఎం జగన్మోహన్ రెడ్డి  చిత్రపటానికి క్షీరాభిషేకం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలకు చంద్రబాబే ప్రధాన కారణమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు  అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు రెండో విడత నిధులను విడుదల చేయడాన్ని హర్షిస్తూ దేవీనగర్ లోని వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  చిత్రపటానికి స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి పాలాభిషేకం చేశారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖర్ రెడ్డి  చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అగ్రి గోల్డ్ బాధితుల తరపున సీఎం జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. పాదయాత్ర సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితులకిచ్చిన హామీని నెరవేర్చే ఉద్దేశంతో రెండు దశల్లో 10.4 లక్షల కుటుంబాలకు ఏకంగా రూ.905.57 కోట్లను ముఖ్యమంత్రి విడుదల చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 91,589 మందికి రూ. 82.46 కోట్ల నిధులు చెల్లించామన్నారు. రూ. 10 వేల లోపు డిపాజిట్ దారులు 54,027 మందికి రూ. 29.52 కోట్లు, రూ. 20 వేల లోపు డిపాజిట్ దారులు రూ. 37,562 మందికి రూ. 52.95 కోట్లు వారి ఖాతాలలో నేరుగా డిపాజిట్ చేయడం జరిగిందన్నారు. 31వ డివిజన్ లో 298 మందికి రూ. 23.60 లక్షలను అందించామన్నారు. అగ్రిగోల్డ్ సంస్థ ద్వారా మోసపోయిన డిపాజిటర్లలో ఎక్కువ మంది కష్టజీవులు, రోజువారీ కూలీలు మరియు ఫ్యాక్టరీ కార్మికులే ఉన్నారన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా వారందరినీ పారదర్శకంగా గుర్తించడం జరిగిందన్నారు. కానీ గత తెలుగుదేశం ప్రభుత్వం అగ్రిగోల్డ్ యాజమాన్యంతో చేతులు కలిపి ప్రజల డబ్బును, సంస్థ ఆస్తులను దోచుకునే ప్రయత్నం చేసిందన్నారు. పైగా పక్క రాష్ట్రాలలో బాధితులకు డబ్బులు చెల్లించారా..? అంటూ అగ్రిగోల్డ్ బాధితులను బెదరిస్తూ చంద్రబాబు వారిని అవమానించారని గుర్తుచేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి  బాధితులకు అండగా నిలిచి.. మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచారన్నారు.

పేదరిక నిర్మూలనే ప్రధాన అజెండా…
పేదరిక నిర్మూలనే ప్రధాన అజెండాగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పనిచేస్తోందని మల్లాది విష్ణు అన్నారు. 6 కోట్ల మంది జనాభా ఉన్న రాష్ట్రంలో 4.5 కోట్ల మందికి రెండేళ్లలో దాదాపు రూ. 70 వేల కోట్ల సంక్షేమాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం సింగపూర్, మలేషియా వంటి దేశాలకు చెందిన కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తే.. జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం పేద, సామాన్య ప్రజలకు అండగా నిలిచిందన్నారు. చదువుతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని భావించి విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు అభినందనీయమని నీతిఆయోగ్ సైతం కితాబివ్వడం జరిగిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రంలో జగనన్న పాలన సాగుతోందని మల్లాది విష్ణు  అన్నారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్న పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పత్రులే ఇందుకు నిదర్శనమన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు చేయలేనిది.. కేవలం రెండేళ్లల్లోనే జగన్మోహన్ రెడ్డి  చేసి చూపారన్నారు. కనుకనే ఈర్ష్య, ద్వేషాలతో చంద్రబాబు, ఆయన అనుచరులు జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వంపై రెండేళ్లుగా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు సుబ్బారెడ్డి, గోపిశెట్టి శ్రీనివాస్, దుర్గారావు, నారాయణరెడ్డి, లక్ష్మీనారాయణ, రామకృష్ణ, వీర్రాజు, డబ్బుగొట్టు కృష్ణ, సచివాలయ సిబ్బంది, వైఎస్సార్ సీపీ శ్రేణులు, అగ్రిగోల్డ్ బాధితులు పాల్గొన్నారు.

Check Also

విద్యాసాగర్ పదవీ ప్రమాణస్వీకార మహోత్సవానికి తరలిరండి…

– ఏపీఎన్జీజీవో నగర శాఖ అధ్యక్షులు సివిఆర్ ప్రసాద్ పిలుపు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపి ఎన్జీజీఒ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *