హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
ఖమ్మం రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తెలంగాణ బీజేపీ నేతలు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఈ నెల 22న జరగనున్నట్టు సమాచారం.
ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి రెండు లోక్‌సభ స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. అవి ఖమ్మం, వరంగల్. ఇప్పటికే అరూరి రమేష్‌కి వరంగల్ టిక్కెట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఖమ్మం స్థానంపై తేల్చుకోలేని స్థితిలో బీజేపీ నేతలు ఉన్నారు. ఈ క్రమంలో ఖమ్మం సీటును టీడీపీకి వదులుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చర్చ కొనసాగుతుండగానే ఖమ్మం సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఖమ్మం టికెట్ ఆశించిన బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు బీజేపీలో చేరారు. పార్టీ మార్పుపై నామా పెదవి విప్పలేదు. ఇక్కడ టీడీపీ పోటీ చేయడాన్ని తెలంగాణ బీజేపీ నేతలు అంగీకరించడం లేదు. తెలంగాణలో టీడీపీ పోటీ చేయాల్సిన అవసరం లేదని కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌తోపాటు బీజేపీ సీనియర్ నేతలు చెబుతున్నారు.
ఖమ్మం సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతున్న క్రమంలో బీజేపీ నేతలు నామాను సంప్రదించారు. బీఆర్ఎస్ నామా నాగేశ్వరరావు పేరును ఇప్పటికే ప్రకటించినప్పటికీ… అక్కడి నుంచి పోటీ చేసేందుకు నామా సుముఖంగా లేరని తెలుస్తోంది. అయితే పార్టీ మారే విషయాన్ని నామా ఇంకా ఖండించలేదు. బీజేపీ కూడా నామాతో టచ్‌లో ఉన్నట్లు చెప్పలేదు.