అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో ప్రజల భద్రతకు ప్రత్యేక చర్యలు.. ప్రమాదకర నివాసాల నుంచి పునరావాస కేంద్రాలకు తరలింపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో నగరంలో ప్రజల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, సిబ్బంది అమ్మ కళ్యాణమండపం, సున్నపుబట్టి సెంటర్, మొగల్రాజపురం, చిట్టినగర్‌తో పాటు ఇతర కొండ ప్రాంతాల్లో పర్యటించి ప్రమాదకర పరిస్థితుల్లో నివసిస్తున్న ప్రజలను నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించే చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్ మాట్లాడుతూ, కొండ ప్రాంతాల్లో ప్రమాదకర నివాసాల్లో ఉంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సర్కిల్-1 పరిధిలోని చిట్టినగర్, పరిసర కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించే చర్యలు చేపట్టినట్లు వివరించారు.

అదేవిధంగా అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు మాట్లాడుతూ, సున్నపుబట్టి సెంటర్, అమ్మ కళ్యాణమండపం, మొగల్రాజపురం కొండ ప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితుల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, వారికి సురక్షితమైన వసతి కల్పించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

మరోవైపు, ఈదురుగాలుల కారణంగా కూలిపోయే అవకాశం ఉన్న ప్రమాదకర ఫ్లెక్సీలు, హోర్డింగులను తొలగించే చర్యలు కూడా చేపడుతున్నారు. స్థిరత్వం లేని ప్రకటన బోర్డులు, ఫ్లెక్సీల వల్ల ప్రజలకు ప్రమాదం కలగకుండా కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ సిబ్బంది వాటిని గుర్తించి తొలగిస్తున్నారు. తుఫాన్ నేపథ్యంలో నగరంలో సురక్షిత వాతావరణాన్ని కల్పించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు కొనసాగిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.