-నష్టం అంచనాకు త్వరగా కేంద్ర బృందాలను పంపాలని అమిత్ షాకు విజ్ఞప్తి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్‌పై అర్నబ్ తుపాను ప్రభావం, రాష్ట్రంలో జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తుపాను తీవ్రత కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని లేఖలో పేర్కొన్నారు. నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసేందుకు వీలైనంత త్వరగా కేంద్ర బృందాలను రాష్ట్రానికి పంపాలని కోరారు.
14 జిల్లాల్లో సహాయక చర్యలు
తుపాను సహాయక చర్యల్లో భాగంగా 14 జిల్లాల్లో 16 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను నియమించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి 28 వేల మందికి పైగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యల కారణంగా ఇప్పటివరకు ప్రాణనష్టం నమోదు కాలేదని లేఖలో పేర్కొన్నారు.
70,900 హెక్టార్లలో వరి పంటకు నష్టం
ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో సుమారు 180 ఇళ్లు దెబ్బతిన్నాయని, రహదారులపై 220కి పైగా చెట్లు కూలిపోయాయని ముఖ్యమంత్రి తెలిపారు. తీర ప్రాంతాల్లో పలు చోట్ల రహదారులు దెబ్బతినడంతో పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
భారీ వర్షాల కారణంగా సుమారు 70,900 హెక్టార్లలో వరి పంట నీట మునిగినట్లు ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయని తెలిపారు. మరో 10,450 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక సమాచారం అందిందని పేర్కొన్నారు.
ఆరు జిల్లాల్లో తీవ్ర ప్రభావం
కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉందని సీఎం వివరించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కంట్రోల్ రూమ్‌లు, రాష్ట్ర అత్యవసర ఆపరేషన్స్ కేంద్రం నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సహాయక చర్యలు అందించడం, విద్యుత్ సరఫరా, తాగునీటి సరఫరాను పునరుద్ధరించడం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని లేఖలో పేర్కొన్నారు.
కేంద్ర సహకారం కొనసాగించాలని విజ్ఞప్తి
తుపాను వల్ల జరిగిన నష్టంపై సమగ్ర అంచనా పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని చంద్రబాబు తెలిపారు. సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఇతర కేంద్ర సంస్థల సహకారాన్ని కొనసాగించాలని అమిత్ షాను కోరారు. నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని త్వరితగతిన పంపాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు నిరంతరం సహకారం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
