-ఫలిత ఆధారిత పరిశోధనను ప్రోత్సహించడం కోసం పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య సమన్వయం అవసరం
-ఔత్సాహిక పారిశ్రామిక రంగం మరియు ఆవిష్కరణ విషయంలో భారతదేశం నూతన శిఖరాలను అధిరోహిస్తోంది
-విద్యార్థుల్లో ఆవిష్కరణ మరియు ఔత్సాహిక పారిశ్రామిక స్ఫూర్తిని నింపండి – విశ్వవిద్యాలయాలకు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపు
-నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, వాటికి నిధులు సమకూర్చడం ద్వారా యువతకు పారిశ్రామిక రంగం మద్ధతును అందించాలి
-పేదరికం, నిరక్షరాస్యత, లింగ-సామాజిక వివక్షలను లేని నవభారత నిర్మాణం దిశగా యువత కంకణబద్ధులు కావాలి
-తమ నియోజక వర్గాల్లో టీకా కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని పర్యవేక్షించాలి
-పుదుచ్చేరి సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి
పుదుచ్చేరి, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడం కోసం పరిశోధన మరియు అభివృద్ధితో కూడిన పర్యావరణ వ్యవస్థను సృష్టించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఇందు కోసం వాతావరణ మార్పులు, కాలుష్యం, ఆరోగ్యం, పేదరికం వంటి సమకాలీన సవాళ్ళను పరిష్కరించే ఫలిత-ఆధారిత పరిశోధనలను ప్రోత్సహించడం కోసం పరిశ్రమలు మరియు విద్యాసంస్థల మధ్య సమన్వయం అవసరమని ఆయన సూచించారు.
పుదుచ్చేరి పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సోమవారం నాడు పుదుచ్చేరి సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి, ప్రసంగించారు. శాస్త్రవిజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానంలో సాగుతున్న అత్యాధునిక పరిశోధనల్లో భారతదేశాన్ని మిగిలిన దేశాలకంటే ముందు వరుసలో నిలపాలని నొక్కి చెప్పిన ఆయన, 1986లో ప్రారంభించిన పాండిచ్చేరి ఇంజనీరింగ్ కాలేజ్ ను పుదుచ్చేరి టెక్నలాజికల్ యూనివర్సిటీ పేరిట, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత తొలి విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దడం అభినందనీయమని తెలిపారు.
ఎలక్ట్రానిక్ డిజైన్, తయారీ, డ్రోన్ టెక్నాలజీ వంటి విభిన్న రంగాల్లో 15 అంకుర సంస్థలను విజయవంతంగా అభివృద్ధి మార్గంలో నడిపించడం కోసం ఇందులో ఇప్పటికే ఏర్పాటు చేసిన అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ను ప్రశంసించిన ఉపరాష్ట్రపతి, ఔత్సాహిక పారిశ్రామిక రంగం మరియు ఆవిష్కరణ రంగాల్లో భారతదేశం నూతన శిఖరాలను అధిరోహిస్తోందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అంకుర సంస్థలకు సరైన పరిస్థితులను కల్పిస్తున్న మూడో అతి పెద్ద దేశంగా భారతదేశం సగర్వంగా నిలబడడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రారంభించిన తర్వాత ఇందులో అనేక రకాల అంకుర సంస్థలు అభివృద్ధి చెంది, సేవలు అందిస్తున్నాయని తెలిపారు. అంకుర సంస్థల్లో 45 శాతం సంస్థలు మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నిర్దేశకత్వంలో ఉండడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన, ఈ ఆరోగ్యకరమైన ధోరణి మరింత మంది మహిళలను పారిశ్రామిక రంగం దిశగా ప్రేరేపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నవభారతానికి యువతే ప్రధాన బలమన్న ఉపరాష్ట్రపతి, విద్యార్థులు దేశాన్ని ముందుకు నడిపించగలిగేలా నూతన ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామిక రంగం వైపు యువత మరలేలా వారిలో పరిశోధన, ప్రయోగాల స్ఫూర్తి నింపాలని విశ్వవిద్యాలయాలకు సూచించారు. స్వరాజ్యం సముపార్జించుకుని 75 సంవత్సరాలు గడుస్తున్న ఇంకా సమాజంలో అక్కడక్కడా నిరక్షరాస్యత, పేదరికం, లింగ-సామాజిక వివక్షలు అభివృద్ధికి అవరోధాలుగా మారాయని ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, ఈ సామాజిక రుగ్మతలను రూపు మాపుతూ యువత నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
నిబంధనలను సరళీకృతం చేయడం, పన్ను మినహాయింపులను అందించడం వంటి చర్యల ద్వారా అంకుర సంస్థలకు మద్ధతు ఇచ్చేందుకు ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, యువపారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించడం, నిధులు సమాకూర్చడం, ప్రారంభంలో ఎదురయ్యే బాలారిష్టాలను దాటేందుకు మద్ధతు ఇవ్వడం లాంటి చర్యలను చేపట్టాలని సూచించారు. మెరుగైన ఫలితాల కోసం పరిశ్రమలు, విద్యాసంస్థలు ఈ దిశగా మరింత చొరవ తీసుకోవాలని ఆకాంక్షించారు. కోవిడ్ -19 నేపథ్యంలో టెస్టింగ్ కిట్లు, అందుబాటు ధరల్లో వెంటిలేటర్లు, సరఫరా గొలుసు నిర్వహణ మరియు ఇతర అత్యవసరాలకు సంబంధించిన నూతన ఆవిష్కరణలతో ముందుకు వచ్చిన భారతీయ అంకుర సంస్థలను ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభినందించారు.
కోవిడ్ మహమ్మారి కారణంగా విద్యారంగం అత్యధికంగా ప్రభావితమైందన్న ఉపరాష్ట్రపతి, ప్రస్తుతం పరిస్థితులు సానుకూలంగా మారుతున్నాయని, ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద ఉచిత టీకా కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో, కోవిడ్ అనంతర కాలంలోకి ప్రయాణిస్తున్నామని తెలిపారు. కోవిడ్ టీకా తీసుకోవడం ప్రతి ఒక్కరి పవిత్ర కర్తవ్యమన్న ఆయన, పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు తమ నియోజక వర్గాల్లో టీకాకరణ జరుగుతున్న తీరును పర్యవేక్షించేందుకు చొరవ తీసుకోవాలని సూచించారు. తరగతుల్లో ప్రత్యక్షంగా నేర్చుకునే విధానానికి, అంతర్జాల విద్య ప్రత్యామ్నాయం కాదన్న ఆయన, విద్యార్థులు తిరిగి పాఠశాలలు, కళాశాలలకు రావలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
సాంకేతిక విద్యలో ప్రమాణాలను పెంచినందుకు పాండిచ్చేరి ఇంజనీరింగ్ కళాశాలను అభినందించిన ఉపరాష్ట్రపతి, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత సామాజిక – ఆర్థిక స్థితిని ఉన్నతస్థాయికి చేర్చడంలో ఈ కళాశాల కీలక పాత్ర పోషించిందని తెలిపారు.
పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో తొలి విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన సందర్భంగా, పుదుచ్చేరి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన ఉపరాష్ట్రపతి, దీని ద్వారా అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు సహకారం, కొత్త కోర్సులు ప్రారంభించడంలో స్వయం ప్రతిపత్తి లాంటి అనేక అదనపు అవకాశాలు అందివస్తాయని తెలిపారు. పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత చరిత్రలో ఈ విశ్వవిద్యాలయ ఏర్పాటు, ఓ కీలకమైన మైలురాయి అని ఆయన తెలిపారు.
స్వాతంత్ర్య సమరయోధుడు, తత్వవేత్త అరబిందో మాటలను గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి, విద్య అనేది కేవలం జీవనోపాధి మార్గం మాత్రమే కాదని, మాతృభూమి సేవకోసం నిబద్ధత కలిగిన మరియు సమర్థులైన పౌరసమాజాన్ని సృష్టించడం దాని ప్రధాన ఉద్దేశమని నొక్కి చెప్పారు. పుదుచ్చేరి సాంకేతిక విశ్వవిద్యాలయ భవిష్యత్ ప్రయత్నాలు అందరికీ మార్గదర్శకం కావాలని అభిలషించిన ఆయన, బోధనా – బోధనేతర సిబ్బందికి, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్, పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగసామి, స్పీకర్ ఎంబలమ్ ఆర్. సెల్వమ్, డిప్యూటీ స్పీకర్ పి.రాజవేలు, పుదుచ్చేరి రాష్ట్ర మంత్రులు ఎ.నమశ్శివయమ్, కె.లక్ష్మీనారాయణన్, ఎ.కె.సాయి జె.శరవణన్, కళాపేట్ శాసనసభ్యులు పి.ఎం.ఎల్. కళ్యాణసుందరం, పుదుచ్చేరి సాంకేతిక విశ్వవిద్యాలయ ప్రిన్సిపల్ డా. కె.వివేకానందన్ సహా సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.