– త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడంలో అందరూ భాగస్వామ్యులవుదాం
-దేవాదాయశాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
-లబ్దిదారుల సొంత ఇంటి కలను సాకారం చేద్దాం
-ఈ మహాయజ్ఞంలో కార్పొరేటర్లు. వాలంటీర్లు తదితరులు భాగస్వామ్యం కావాలి.
-పేమెంట్ సులభతరం చేసిన ప్రభుత్వం
– జిల్లా కలెక్టర్ జె.నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడంలో అందరం భాగస్వామ్యులై విజయవంతం చేద్దామని దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి నగరంలోని తుమ్మలపల్లి కళా క్షేత్రంలో విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో వైయస్ఆర్ జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై కార్పొరేటర్లు, వీఎంసీ, పంచాయతీరాజ్, రెవెన్యూ, గృహనిర్మాణశాఖ అధికారులతో దేవాదాయ శాఖా మంత్రి, స్థానిక శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావుతో కలసి నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ జె.నివాస్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగనన్న ప్రతి పేదవాళ్లకు ఇల్లు ఉండాలని భావిస్తూ ఇళ్ల స్థలాలు అందించడంతో పాటు ఇళ్ల నిర్మాణ మహాయజ్ఞాన్ని చేపట్టారన్నారు. ఈ యజ్ఞంలో మనందరం భాగస్వామ్యులై విజయవంతం చేయాలన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి వెలగలేరు, సున్నంపాడు, మునగపాడు తదితర లే అవుట్లలో 29 వేల మందికి ఇళ్ల స్థలాలు అందించి జగనన్న ఇళ్ల కాలనీలలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. భవానీ పురం ప్రాంత తదితర ప్రాంత వాసులకు కూడా సీఆర్ డిఎ ప్రాంతంలో కుడా 9 వేల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని నిర్ణయించామని అయితే అది కోర్టులో ఉన్నందున కొద్దిగా ఆలస్యం జరుగుతుందన్నారు. అది రాని పక్షంలో వేరే ప్రాంతంలో స్థలాన్ని కేటాయించడం జరుగుతుందన్నారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 1.80 లక్షలు అందిస్తోందని మరో లక్ష రూపాయలు అధనంగా బ్యాంకుల ద్వారా రుణాలు అందించేందుకు జిల్లా కలెక్టర్ జె.నివాస్ ప్రత్యేక కృషి చేశారన్నారు. మొత్తం రూ.2.80 లక్షలతో ఇళ్లు నిర్మించుకొనే అవకాశం కలిగిందన్నారు. బ్యాంకు రుణంకు సబంధించి మొదటి ఆరు నెలలు వడ్డీ వుండబోదని, తదుపరి రుణ సొమ్ము 5 సంవత్సరాల్లో తిరిగి కట్టవలసిన అవసరం ఉందన్నారు. ఈ విషయంపై ఇళ్ల లబ్దిదారుల్లో పూర్తి అవగాహన కల్పించాలన్నారు. నున్న లేఅవుట్లో ఇప్పటికే ఇళ్ల ర్మాణాలు ప్రారంభమైయ్యాయన్నారు. అయితే మిగిలిన లేఅవుట్లలో అప్రోచ్ రోడ్లు. లెవీలింగ్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించే విషయంపై దృష్టి పెట్టాలన్నారు.
జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ అర్బన్ ప్రాంత లబ్దిదారులు ఇళ్ల నిర్మాణం మరింత పురోగతిలో ఉంచేందుకు తీసుకోవలసిన చర్యలపై అవగాహన కలిగిం చేందుకు ఈ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. అర్బన్ పరిధిలోని లబ్దిదారులకు ముందుగా సమావేశం నిర్వహించి వారు సొంతగా ఇళ్లు నిర్మించుకొనేది లేదా కాంట్రాక్టర్ ద్వారా నిర్మించుకొనేది స్పష్టత తీసుకోవాలన్నారు. తద్వారా ప్రతి వార్డు ఇంజనీర్ అసిస్టెంట్ లబ్దిదారుల నుంచి సుముఖత పత్రం తీసుకుంటారన్నారు. నున్న లేఅవుట్ లో రూ.1.20 లక్షలతో ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్ ముందుకు వచ్చి ఇప్పటికే కొన్ని ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారన్నారు. వారు కోరిన విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను కల్పించామని. మెటీయల్ లో కూడా నాణ్యత పాటిస్తున్నారన్నారు. అంతే కాకుండా ఒక ఇంటికి మరో ఇంటికి మధ్య నిడివి ఉంచి ఇళ్ల నిర్మాణం చేస్తున్నారని ఇప్పటికే 50 ఇళ్లు బేస్ మెంట్ లెవెల్ కు తీసుకువచ్చారన్నారు. వారు ప్రతి రోజు 50 నుంచి 100 ఇళ్లు బేస్మెంట్ లెవెల్ కు తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ విషయాన్ని పరిశీలన చేస్తున్నామని చెప్పారు. వారికి అవసరమైన ఇసుక, స్టీలు, సిమెంట్ బయటకన్నా తక్కువ ధరకే అందిస్తున్నామని అయితే వారు మెటల్ కూడా తక్కువ ధరకు కొరియున్నారన్నారు. ఇందుకు అవసరమైన ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. నగరం నుంచి లబ్దిదారులు వారికి నిర్దేశించిన లేఅవుట్ లలో రోజు వెళ్లి చూసుకోవాలన్నా, దగ్గర వుండి నిర్మించుకోవాలన్నా కొంత కష్టమేనని అయితే గ్రూపులుగా ఏర్పడి కాంట్రాక్టర్ ద్వారా ఇళ్లు నిర్మించుకోవచ్చని చెప్పారు. తద్వారా లబ్దిదారులకు కూడా త్వరగా ఇల్లు అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ విషయం పై కూడా లబ్దిదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం వుందన్నారు. ఇండియన్ బ్యాంకు వారు ఇప్పటికే 3 వేల మందికి అదనపు రుణాలు అందించడం జరిగిందన్నారు. గృహలక్ష్మి పథకం కింద లక్ష రురాపాయల వరకు 7.2 శాతం వడ్డీ తో రుణం అందించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అయితే వడ్డీ రాయితీ అందించేందుకు గౌరవ ముఖ్యమంత్రి ప్రకటించడం కూడా జరిగిందని దీని మూలంగా వడ్డీ భారం కూడా తగ్గుతుందన్నారు. దీనితో లబ్ధిదారులు కూడా ముందుకు వస్తున్నారన్నారు. అయితే లబ్దిదారుల్లో పేమెంట్ విషయంలో ఉన్న సందేహాలను నివృత్తి చేయాలన్నారు. నెల వ్యవధిలోనే పేమెంట్ చేస్తామని గౌ. ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారన్నారు. ఇళ్ల నిర్మాణానికి ఇసుక సమస్య లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. పేమెంట్ ప్రక్రియను కూడా సులభతరం చేయడం జరిగిందని, గతంలో 5 విడతలుగా ఇచ్చే బిల్లులను మూడు విడతల్లోనే చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఇసుక విషయంలో లేఅవుట్ల సమీపంలోని ఇబ్రహీంపట్నం, మైలవరం స్టాక్ యార్డులను అందుబాటులో ఉంచావున్నారు.
ఈ సమావేశంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, ఏపి ఐడిసి ఛైర్యన్ బి. పుణ్యశీల, వీఎంసి కమీషనర్ వి.ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్లు డా.కె.మాధవీలత, నుపూర్ శ్రీనివాస్ అజయ్ కుమార్, సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్ . ప్రవీణ్ చంద్, హౌసింగ్ పీడి రామచంద్రన్, పశ్చిమ నియోజకవర్గంకు చెందిన 22 డివిజన్ల కార్పొరేటర్లు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.