-అధికార్లను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ డా.కె. మాధవీలత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చి సహకరించిన నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) డా. కె. మాధవీలత అధికారులను ఆదేశించారు. స్థానిక జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం గన్నవరం విమానాశ్రయ విస్తరణకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అమలుపై రెవిన్యూ అధికార్లతో జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా డా. మాధవీలత మాట్లాడుతూ గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములందించిన నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లో భాగంగా ఇల్లు, భూములు కోల్పోయిన నిర్వాసితులకు నిబంధనల ననుసరించి నష్టపరిహారం అందించేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. నిర్వాసితులకు అందించవలసిన ప్లాట్స్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ఎయిర్పోర్ట్ విస్తరణలో లే అవుట్ లు కోల్పోయిన ఎం.జి. బ్రదర్స్,విజయసాయి, ఆదిత్య రియల్టర్ సంస్థలను ప్లాట్స్ కేటాయింపు అంశంపై ఏ. ఎం. ఆర్.డి.ఏ సంస్థ కమీషనర్ మరియు ఆర్. అండ్ ఆర్. ప్యాకేజ్ అమలుపై నియమించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లతో చర్చించి విధివిధానాలు ఖరారు చేయాలన్నారు. నూజివీడు రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి మాట్లాడుతూ గన్నవరం విమానాశ్రయ విస్తరణకు సంబంధించి చిన్న అవుటపల్లి లోని 331 మంది నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ లో భాగంగా ఇళ్ల నష్టపరిహారం మొత్తం ఒకొక్కరికి 4 లక్షల 50 వేల రూపాయలు చొప్పున బిల్లులను సి.ఎఫ్.ఎం.ఎస్. నందు సమర్పించడం జరిగిందన్నారు. అదే విధంగా మైక్రో కెనాల్ కు భూములందించిన 37 మంది నిర్వాసితులకు వార్షిక అద్దె చెల్లింపు కార్యక్రమంలో భాగంగా మొదటి వాయిదాను చెల్లించడం జరిగిందని, 2,3 మరియు 4 వాయిదాల సొమ్ము చెల్లింపునకు సంబంధించి బిల్లులను సి.ఎఫ్.ఎం.ఎస్. నందు సమర్పించడం జరిగిందన్నారు. సమావేశంలో గన్నవరం తహసీల్దార్ నరసింహారావు, కలెక్టరేట్ సిబ్బంది, ఇతర రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.