-మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వెల్లడి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో
‘మహిళలపై నేరాలు, పరిష్కారాలు’ ప్రధాన అజెండాగా చర్చాగోష్టి మంగళవారం నిర్వహిస్తున్నట్లు కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఓ ప్రకటనలో వెల్లడించారు. విజయవాడ కానూరులో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చర్చాగోష్టి కొనసాగుతుందన్నారు. కోవిడ్ తర్వాత మహిళలపై నేరాలు ఆందోళన కలిగిస్తున్న నేపధ్యంలో ఈ చర్చాగోష్టి నిర్వహణకు మహిళా కమిషన్ పూనుకుందన్నారు. రాష్ట్రంలో జరిగిన సంఘటనలు, మహిళల భద్రత, రక్షణకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మరింత పటిష్ఠంగా అమలుచేసే కార్యాచరణలో అందర్నీ భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర మహిళా కమిషన్ ఈ చర్చాగోష్టి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళల సమస్యలపై పనిచేస్తున్న సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగ సంఘాలు, న్యాయవాదుల భాగస్వామ్యంతో చర్చాగోష్టి కొనసాగనుందని పేర్కొన్నారు. చర్చాగోష్టిలో వెలువడే అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుంటూ ప్రభుత్వానికి నివేదిక అందించడంతో పాటు కార్యాచరణను మహిళా కమిషన్ సూచిస్తుందని కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వెల్లడించారు.