-ఓటర్ డేటాకు ఆధార్ అనుసంధానించుకోండి…
-ఓటర్లు తమ ఓటును బిఎల్‌వోల ద్వారా నిర్థారించుకోండి…
-జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టి 18 నుండి 21 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన యువతను ఓటర్లగా నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
నగరంలో సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని గిరిపురంలో సోమవారం క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరిగి ఓటర్ జాబితాపై గల్లిప్రోగు రాణి, పాలా రాజు, తదితర నిర్వాసితులతో మాట్లాడి బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వేపై అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మట్లాడుతూ గిరిపురం ప్రాంతంలో 82 శాతం ఓటర్ డేటాకు ఆధార్ అనుసంధానం ప్రక్రియ పూర్తి చేశారని ఇదే స్పూర్తితో నగరంలోని అన్ని నియోజకవర్గ ప్రాంతాలలో బూత్ లెవల్ అధికారులు అనుసంధాన ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్ క్లయిమ్‌ల వివరాలను, ఓటు నిర్థాణను సంబంధిత బూత్‌లెవల్ స్థాయి అధికారులు నమోదు చేయాలన్నారు. 2023 జనవరి 1వ తేది నాటికి 18 సంవత్సరాలు నిండబోతున్న ప్రతి ఇక్కరిని ఓటర్‌గా నమోదు చేయవలసి ఉందన్నారు. ఏ ఒక్క ఓటరు తనను ఓటర్‌గా నమోదు చేయలేదనే పిర్యాదు రానీయరాదన్నారు. బూత్ స్థాయి అధికారులు వారి పరిధిలోని ప్రతి ఇంటింటికి వెళ్లి ఓటర్ జాబితాలోని వివరాలను నివాసం వుంటున్న వారితో పరిశీలించాలన్నారు. వలస, మరణించిన, ఓటర్‌గా నమోదు కాకపోయిన వారిని గుర్తించి సంబంధిత పత్రాలను వారి నుండి స్వీకరించాలన్నారు. ఓటర్లు తమ ఓటు నమోదు, ఓటు తొలగింపు/మార్పు మరియు తమ ఆధార్ వివరాలను ఓటర్ల జాబితాకు అనుసంధానంకై బూత్ లెవల్ అధికారులకు క్లయిమ్‌లు సమర్పించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి డేటాను సేకరించి అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటర్‌గా నమోదు చేయించాలని కలెక్టర్ డిల్లీరావు ఆదేశించారు.
ఓటర్ డేటాకు ఆధార్ అనుసంధానం చేయించుకోండి: కలెక్టర్
భారత ఎన్నికల సంఘం అదేశాల మేరకు ఈ ఏడాది ఆగస్టు 1వ తేది నుండి ఓటర్ డేటాకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ దేశమంతటా ప్రారంభమయిందన్నారు. దీనిలో భాగంగా జిల్లాలోని 7 అసంబ్లీ నియోజకవర్గాలలో ఈ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందన్నారు. ఓటర్ డేటాకు ఆధార్ అనుసంధానంతో నాణ్యమైన, ఖచ్చితమైన ఓటర్ జాబితా సాధ్యపడుతుందన్నారు. ఓటర్ల గుర్తింపును పెంపొందించడం, జాబితా ప్రమాణికరణకు ఒకే వ్యక్తికి ఒకే పోలింగ్ స్టేషన్‌లో రెండు ఓట్లు,అదే పేరుతో పలు పోలింగ్ స్టేషన్‌లలో ఉందని గుర్తించడానికి ఉపయోగపడుతుందన్నారు. ఓటు ప్రతి పౌరుని హక్కు అని ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి పౌరుని భాధ్యతగా గుర్తించుకోవాలన్నారు. ఒక వ్యక్తి ఒక ఓటు విధానం వలన నాణ్యమైన ఓటర్ జాబితా తయారికి, నకిలీ ఓట్లను గుర్తించి, తొలగించడం తద్వారా పారదర్శక ఎన్నికలు నిర్వహించడానికి దోహదపడుతుందని కలెక్టర్ అన్నారు. జిల్లాలో నేటివరకు 16,47,643 మంది ఓటర్లు నమోదు కాగా, వీరిలో 11,61,361ఓటర్ల కార్డులకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తి కాగా ఇది 70.49 శాతంగా నమోదు అయిందన్నారు. ఇంకనూ మిగిలిన 29.51శాతం ప్రక్రియను ఈనెల 31వ తేదిలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. జిల్లాలోని తిరువూరు 84.65, నందిగామ 82.41, జగ్గయ్యపేట నియోజకవర్గాలలో 82.30 శాతం పైగా పూర్తి కాగా, మైలవరం నియోజకవర్గంలో 72.46 శాతంగా ఉందన్నారు. విజయవాడ తూర్పు 60.62, పశ్చిమ 60.87 సెంట్రల్ నియోజకవర్గాలలో 57.82 శాతం ఓటర్ డేటాకు ఆధార్ అనుసంధానం పూర్తి అయిందన్నారు. నగర పరిధిలో బూత్ లెవల్ అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ డేటాకు ఆధార్ అనుసంధానం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల డేటాకు ఆధార్ అనుసంధానం వలన కలిగే ప్రయోజనాలను, ఓటర్ డేటాకు ఆధార్ అనుసంధానంతో ఓటరు యొక్క ఆధార్ నెంబర్, సమాచారం గోప్యంగా ఉంచబడుతుందని భారత ఎన్నికల సంఘం నియమ నిబంధనలలో పొందుపరచారనే విషయాన్ని ఓటర్లకు తెలిపి అవగాహన కల్పించాలని కలెక్టర్ డిల్లీరావు అన్నారు. గిరిపురం పర్యటనలో కలెక్టర్ వెంట తహాశీల్థార్ వెన్నెల శ్రీను, బిఎల్‌వోలు సతీష్, మల్లికార్జునరావు, విశ్వశ్రీ, వెంకటేష్ తదితరులు ఉన్నారు.