-ఫ్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారు జి.వి.డి కృష్ణమోహన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాత్రికేయులు మానసిక ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతమైన ఆలోచనలతో వార్తలను నివేధించడం ద్వారా వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలని ఫ్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారు జి.వి.డి కృష్ణమోహన్ అన్నారు.
సి.రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్‌లోని ప్రెస్ క్లబ్ నందు గురువారం జర్నలిస్టులకు మానసిక ఒత్తుడులు – పరిష్కార మార్గాలు అంశంపై ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అధ్యక్షతన అవగాహన సదస్సును నిర్వహించారు. ఫ్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారు జి.వి.డి కృష్ణమోహన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత్రికేయులు నిరంతరం వృత్తి పరంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటారన్నారు. పాత్రికేయులకు వార్త సేకరించిన సమయం నుండి అవి ప్రచురితం అయ్యేవరకు ఒక విధమైన ఒత్తిడికి లోనైతే వార్త ప్రచురితమైన అనంతరం మరో విధమైన ఒత్తిడికి గురి అవుతారన్నారన్నారు. మానసిక ఒత్తిడి కారణంగా అనేక అనారోగ్యాలకు గురి కావాల్సి వస్తుందరన్నారు. జర్నిలిస్టులలో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు పరిష్కార మార్గాలను తెలియజేసేందుకు మానసిక వైద్యుల ఆధ్యర్యంలో అవగాహన సదస్సులను నిర్వహిస్తున్న ప్రెస్ అకాడమి చైర్మన్‌ను అభినందిస్తునన్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతమైన మనసుతో వార్తలను నివేధించడం ద్వారా వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలని పాత్రికేయులకు జి.వి.డి కృష్ణమోహన్ సూచించారు.
ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ పాత్రికేయ వృత్తి అనేది లక్ష ఆలోచనల పుట్ట అని అన్నారు. మేధావులు ఒక విషయం గురించి కొంత సమయం మాత్రమే ఆలోచిస్తారని పాత్రికేయుడు నిత్యం ఆలోచన చేస్తునే వుంటారన్నారు. ఈతరుణంలో మానసిక ఒత్తిడికి గురి అయి అనేక రుగ్మతులకు లోనవుతారన్నారు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు పరిష్కార మార్గాలను అన్వేషించుకోవాలన్నారు. సహజంగా మానసిక ఒత్తిడి వ్యాధికి గురి అయిన వారు చికిత్స నిమిత్తం మానసిక వైద్యుని వద్దకు వెళ్లెందుకు సంకోశించి వ్యాధిని మరింత తీవ్రతరం చేసుకుని ఇబ్బందులకు గురి అయ్యే పరిస్థితులను మనం చూస్తున్నామన్నారు. ఈతరుణంలో పాత్రికేయులు మానసిక ఒత్తిడిని తగ్గించుకునే అంశంపై అవగాహన సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. పాత్రికేయ రంగంలో నానాటికి తీవ్రమైన పోటీతత్వం పెరిగిపోతుందన్నారు. ఒక మంచి వార్తను సేకరించాలని, సేకరించిన వార్త ప్రచురితమై మంచి గుర్తింపు పొందాలని పాత్రికేయులలో కూడా పోటి తత్వం మరింత పెరుగుతుందన్నారు. ప్రచురితమైన వార్త వలన కొన్ని వర్గాల నుండి ఎదురైన ప్రతిఘటనల కారణంగా మానసిక ఒత్తిడికి గురి కావాల్సివస్తుందన్నారు. పాత్రికేయులు మానసికంగా, శరీరకంగా మంచి ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగించడంతో పాటు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు ప్రెస్ అకాడమి పూర్తి సహాయ సహకారం అందిస్తుందని కొమ్మినేని శ్రీనివాసరావు తెలిపారు.
ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ పాత్రికేయ వృత్తిలో పనిచేస్తున్న వారు మానసిక ఒత్తిడికే కాకుండా శారీరకపరమైన ఒత్తిడికి కూడా గురి కావడం జరుగుతుందన్నారు. సమాజంలో ప్రతి వృత్తికి కొంత సమయం కేటాయించడం జరుగుతుందని పాత్రికేయుడు ఉదయం నుండి రాత్రి వరకు నిరంతరం వృత్తి పరంగా శ్రమించవలసి వస్తుందన్నారు. పని ఒత్తిడి, ఆలసట కారణంతో పాటు కుటుంబ పరమైన భాధ్యతల వలన మరింత ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలకు గురి కావాల్సివస్తుందన్నారు. వృత్తిలో వార్తల సమాచారం అందించడంలో అనుసరిస్తున్న డెడ్‌లైన్ల్‌లు కూడా మానసిక ఒత్తిడికి కారణమవుతున్నాయన్నారు. సంచలన వార్తలు ప్రచురించాలనే తపన వాటి వలన ఎదురయ్యే సమస్యలు మానసిక ఒత్తిడినికి గురి చేస్తాయన్నారు. పాత్రికేయులలో ఆరోగ్యపరమైన సమస్యలను తొలి దశలోనే గుర్తించి వైద్యుల సలహాలను పొంది పాటించడం ద్వారా ఆరోగ్యవంతులుగా ఉండాలన్నారు. పాత్రికేయులు కొంత సమయాన్ని యోగా, మెడిటేషన్, వ్యాయామంల పై దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం ఉందన్నారు. మానసిక సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు సహకారం వుంటుందని రామసుబ్బారెడ్డి తెలిపారు.
కార్యక్రమంలో ప్రెస్ అకాడమి కార్యదర్శి యం. బాలగంగాధర్ తిలక్, ఐజెయు ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, ఏపిడబ్ల్యుజె ఉపాధ్యక్షులు కె. జయరాజ్, అర్భన్ అధ్యక్షులు చావా రవి, జర్నలిస్టు యూనియన్ నాయకులు ఎస్‌కె. బాబు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, కార్యదర్శి ఆర్. వసంత్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు.