– వాణిజ్యవ్యాపార సంస్థలకు జరిగిన నష్టాన్ని కూడా అంచనా వేస్తాం
– నష్టం వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తాం
– ఎలాంటి లోటుపాట్లు లేకుండా వాస్తవ అంచనా వేసేలా చర్యలు
– జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరద ముంపు కారణంగా గృహాలు, వ్యాపార సంస్థలకు జరిగిన ఆస్తి నష్టాలను అంచనా వేసేందుకు 1700 బృందాలను ఏర్పాటుచేసి ప్రత్యేక యాప్ ద్వారా వివరాలను నమోదుచేసేందుకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.సృజన తెలిపారు.
వరద ముంపు నష్టాలను నమోదు చేసేందుకు ఏర్పాటుచేసిన బృంద సభ్యులకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ, విపత్తుల నిర్వహణ, భూపరిపాలన, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్) ఆర్‌పీ సిసోడియా నేతృత్వంలో స్థానిక తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కలెక్టర్ సృజన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ భారీ వర్షాలు, వరద ముంపు కారణంగా నష్టపోయిన ప్రతిఒక్కరికీ న్యాయం చేసేందుకు తక్షణమే ఎన్యూమరేషన్ చేపట్టాలని గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేయడం జరిగిందన్నారు. ఆయన ఆదేశాల మేరకు గృహాలు, వ్యాపార సంస్థలకు జరిగిన నష్టాలను నమోదుచేసేందుకు రెవెన్యూ శాఖ, సచివాలయాలకు చెందిన సిబ్బందితో 1,700 బృందాలను ఏర్పాటుచేసి, మూడు రోజుల్లో ప్రత్యేక యాప్‌ద్వారా నష్టాలను నమోదు చేయనున్నట్లు ఆమె తెలిపారు. ముంపు ప్రాంతాల్లో ఇప్పటివరకు పూర్తిస్థాయిలో సహాయకచర్యలు ఆహారం, తాగునీరు, పాలు, బిస్కట్లు, పండ్లు వంటివి పంపిణీ చేయడం జరిగిందన్నారు. ముంపు నుంచి బయటపడిన ప్రతి ఇంటినీ, వ్యాపార సంస్థనూ బృంద సభ్యులు క్షేత్రస్థాయిలో సందర్శించి నష్టాలను నమోదు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి బృందసభ్యులకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.
మొత్తం 170 సచివాలయాల పరిధిలో 2,32,000 గృహాలతో పాటు ఆయా ప్రాంతాల్లో వాణిజ్య వ్యాపార సంస్థలకు జరిగిన నష్టాలను అంచనా వేయనున్నట్లు తెలిపారు. ఒక్కో ఎన్యూమరేషన్ బృందానికి డిప్యూటీ తహశీల్దార్. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నేతృత్వం వహిస్తారని.. బృందంలో వార్డు సెక్రటరీ, వాలంటీర్, పోలీస్ ఉంటారని వివరించారు. నష్టాల అంచనా ప్రక్రియను ప్రతి వార్డుకు ఒక ఐఏఎస్ అధికారి, ఒక జిల్లా అధికారి పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు. వాస్తవ పరిస్థితులను అంచనా వేసి ప్రతిఒక్క బాధితునికి న్యాయం జరిగేలా నివేదికను సమర్పించాలని బృంద సభ్యులను ఆదేశించడం జరిగిందన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో నష్టం అంచనా వేసిన గృహాలను కొన్ని గృహాలను ర్యాండమ్ చెక్ చేసేలా చర్యలు తీసుకున్నామని.. ఎక్కడా ఎలాంటి అవకతవకలకు లోటుపాట్లకు తావులేకుండా వాస్తవ పరిస్థితులకు అద్దంపట్టేలా అంచనా నివేదికలను రూపొందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం ముంపు నుంచి బయటపడిన ప్రాంతాల్లో ముందుగా నష్టాలను అంచనా వేయడం జరుగుతుందన్నారు. ముంపు నీరు తగ్గిన వెంటనే ఆయా గృహాలు, వ్యాపార సంస్థల్లో నష్టాలను అంచనావేసి రానున్న మూడునాలుగు రోజుల్లో ప్రతి ఇంటికీ, వ్యాపారవాణిజ్య సంస్థకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడం జరుగుతుందన్నారు.
ఎన్యూమరేషన్ బృందాలకు బాధితులు అందుబాటులో ఉండాలి
వరద ముంపు కారణంగా జరిగిన నష్టాలను అంచనా వేసేందుకు గృహాలను సందర్శించే ఎన్యూమరేషన్ బృందాలకు సహకరించేలా ఆయా గృహాలు, వ్యాపార వాణిజ్య సంస్థలకు చెందిన యజమానులు అందుబాటులో ఉండి, వారికి జరిగిన నష్టాలను వివరించి నమోదు చేసేందుకు సహకరించాలన్నారు. ముంపు కారణంగా కొందరు వారి ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లడం జరిగిందని.. ముంపు నుంచి బయటపడిన నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు తిరిగి వారి గృహాలకు చేరుకొని గృహాలను శుభ్రపరచుకోవడంతో పాటు నష్టానికి సంబంధించిన వివరాలను బృంద సభ్యులకు వివరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఎన్యూమరేషన్ బృందం ఇంటిని సందర్శించిన సమయంలో ఏదైనా కారణంగా వివరాలు ఇంట్లో లేనందున వివరాలను అందించలేకపోతే వారికి సంబంధించి సచివాలయంలో సెక్రటరీని సంప్రదిస్తే తిరిగి మరోసారి ఇంటిని బృంద సభ్యులు స్వయంగా పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి నివేదిక సమర్పించడం జరుగుతుందని కలెక్టర్ సృజన వివరించారు.