Breaking News

ఇంధన సామర్థ్య ప్రాజెక్టులకు వడ్డీ చెల్లింపుల్లో ఆర్థిక సాయం!

-కనీసం 5 శాతం వడ్డీ సొమ్మును ప్రభుత్వం చెల్లించాలి
-అలాంటి రుణాలు అందిస్తే ఈఈ కార్యక్రమాల అమలు పెరుగుతుంది
-పరిశ్రమలు, ఎంఎస్ఎంఈల్లో ఉత్పాదక పెరుగుతుంది
-కేంద్రానికి రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి లేఖ
-రాష్ట్రంలో 2932 మిలియన్ యూనిట్ల ఆదా.. రూ.2014 కోట్ల పొదుపు
-పీఏటీ 1, 2 దశల్లో 0.21, 025 ఎంటీవోఈ ఇంధన ఆదా
-పరిశ్రమల్లో ఐవోటీ టెక్నాలజీ అమలుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక
-దేశంలో 2031 నాటికి 86.9 ఎంటీవోఈ ఆదా చేయాలని అంచనా..
-దీనివల్ల రూ.10.02 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం
-ఎంఎస్ఎంఈల ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చడంలో ఈఈది కీలకపాత్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశ్రమల్లో ఇంధన సామర్థ్య (ఈఈ) కార్యక్రమాల అమలుపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. వడ్డీ చెల్లింపులో ఆర్థిక సాయం పథకాన్ని అమలు చేయాలని కేంద్రానికి సూచించింది. తద్వారా పరిశ్రమలు ప్రత్యేకించి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ల్లో ఈఈ కార్యక్రమాల అమలుకు ముందుకు వస్తారని తెలిపింది. ఫలితంగా రాష్ట్ర, దేశ ఇంధన సామర్థ్య లక్ష్యాలు సాధించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ కేంద్ర విద్యుత్తు శాఖకు లేఖ రాసింది. ఈ పథకం కింద ఆయా పరిశ్రమలు రుణాలకు చెల్లించాల్సిన వడ్డీలో కనీసం 5 శాతం వడ్డీని (ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేస్తే) ఆర్థిక సాయంగా అందించాలని సూచించింది.
కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లలో ఎంఎస్ఎంఈలు ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కుంటున్నాయి. ఎంఎస్ఎంఈలు సహా పరిశ్రమలకు ఆర్థికంగా ఊరట కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సూచించింది. ఇందులో భాగంగా ఈఈ కార్యక్రమాల అమలుకు పరిశ్రమలకు తక్కువ వడ్డీ రేట్లతో ఆర్థిక సాయం అందించాలని పేర్కొంది. ఫలితంగా పరిశ్రమల్లో ఉత్పాదకత పెరుగుతుందని, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని.. ఇది రాష్ట్రాభివృద్ధికీ దోహదపడుతుందని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈఈ కార్యక్రమాల అమలులో క్రియాశీలంగా పనిచేస్తోందని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి కేంద్రానికి రాసిన లేఖలో గుర్తుచేశారు. వివిధ రంగాల్లో వార్షిక విద్యుత్తు డిమాండ్ 61818 మిలియన్ యూనిట్లు ఉండగా.. 25 శాతం అంటే 15000 మిలియన్ యూనిట్ల పొదుపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రంలో ఇప్పటి వరకు 2932 మిలియన్ యూనిట్ల ఆదాతో రూ.2014 కోట్లు పొదుపు చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) రాష్ట్రంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలును ప్రోత్సహిస్తోందని, బీఈఈతో కలిసి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని ఇంధన కార్యదర్శి తెలిపారు. భవన నిర్మాణ రంగంలో ఈసీబీసీని అమలు చేస్తున్నామని, ఫలితంగా పెద్ద మొత్తంలో ఇంధన పొదుపు సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
పరిశ్రమల రంగంలో ఏపీ ప్రభుత్వం పెర్ఫార్మ్, అచీవ్, ట్రేడ్ (పీఏటీ) పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నట్లు ఇంధన కార్యదర్శి తెలిపారు. పీఏటీ 1,2 దశల్లో 0.21, 0.25 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ (ఎంటీవోఈ) ఇంధన పొదుపు చేసినట్లు వెల్లడించారు. బీఈఈ సాంకేతిక సాయంతో ఇది సాధించినట్లు తెలిపారు. ఇంధన వృథాను అరికట్టేందుకు 65 ఎంఎస్ఎంఈల్లో ఐవోటీ టెక్నాలజీని ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 43 ఎంఎస్ఎంఈల్లో ప్రవేశపెట్టినట్లు వివరించారు. పరిశ్రమల శాఖ సహాయ సహకారాలతో ఇది సాధ్యమైందని తెలిపారు. బీఈఈ,రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) ల మద్దతుతో ఐవోటీ టెక్నాలజీని అమలు చేసేందుకు పరిశ్రమల శాఖ చురుకైన చర్యలను చేపట్టిందని వెల్లడించారు.ఎంఎస్ఎంఈలకు ఇటీవల రూ 188 కోట్ల విద్యుత్ బకాయిల రద్దు చేయటం తో పాటు వాటికి మరో రూ 1100 కోట్లను పరిశ్రమల శాఖ సహాయం అందించిన విషయాన్నీ ఆయన గుర్తుచేశారు
ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలుకు కార్యాచరణ రూపొందించడం, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ఈఈ లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తున్న బీఈఈకి ఇంధన కార్యదర్శి అభినందనలు తెలియజేశారు.
బీఈఈ నివేదిక ప్రకారం దేశంలో 2031 నాటికి 86.9 మిలియన్ ఎంటీవోఈ ఇంధన పొదుపుకు అవకాశం ఉంది. దీనివల్ల ఇంధన సామర్థ్య ప్రాజెక్టుల్లో రూ.10.02 లక్షల కోట్ల భారీ పెట్టుబడులకు అవకాశం ఉంటుంది.
పీఏటీ సైకిల్ 2లో ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని 522 మంది గుర్తింపు పొందిన వినియోగదారులు ఈఈ కార్యక్రమాల అమలుకు రూ.42,994 కోట్లు పెట్టుబడి పెట్టి 13.152 ఎంటీవోఈ ఇంధన పొదుపు చేశారు. ఆకర్షణీయమైన వడ్డీ ఉపసంహరణ పథకాలతో పీఏటీ సైకిల్ 6నాటికి 932 గుర్తింపు పొందిన వినియోగదారులు భారీగా ఇంధన పొదుపు చేస్తాయని, భారీ పెట్టుబడులకూ అవకాశం ఉంటుందని బీఈఈ పేర్కొంది.
ఎంఎస్ఎంఈల్లో ఉత్పాదక వ్యయంలో ఇంధన ఖర్చే కీలకమని, ఎంఎస్ఎంఈల ఆర్థిక పరిస్థితులూ మెరుగవుతాయని ఇంధన కార్యదర్శి కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. కాబట్టి ఆకర్షణీయ వడ్డీ రేట్లు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ఆకర్షణీయ వడ్డీ రేట్లతో ఆర్థిక సాయం అందిస్తే లక్షిత ఇంధన పొదుపును సాధించగలుగుతాయని తెలిపారు. ఏపీలోని చాలా పరిశ్రమల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేయాలని భావిస్తున్నప్పటికీ వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా లేకపోవడంతో చాలా మంది ముందుకు రావడం లేదని వివరించారు. వడ్డీ ఉపసంహరణ పథకాన్ని అమలు చేయడం ద్వారా ఈఈ కార్యక్రమాలు అమలుకు వ్యాపారులు ముందుకు వస్తారని తెలిపారు.

Check Also

సెంటు భూమి క‌బ్జా చేసినా ఖ‌బ‌డ్దార్‌..

-భూ కబ్జాలు, మోసాలు, బెదిరింపుల‌కు పాల్ప‌డితే జైలే దిక్కు -భూ స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌య్యే వర‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది -స‌మ‌స్య‌ల‌కు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *