Breaking News

భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లతో హోంమంత్రి అనిత టెలికాన్ఫరెన్స్

-శ్రీశైలం పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన హోంమంత్రి అనిత
-కుటుంబసమేతంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామిని దర్శించుకున్న హోంమంత్రి
-ఎక్స్ అకౌంట్ ద్వారా రాజ్యాంగ వజ్రోత్సవ శుభాకాంక్షలు వెల్లడి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రవాయుగుండంగా మారనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రానున్న రెండు రోజుల్లో ఉత్తరాంధ్రకు భారీ వర్షాలుంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాయలసీమ, కోస్త్రాంధ్ర సహా వర్షం పడే అవకాశమున్న జిల్లాల కలెక్టర్లు ప్రాణ, ఆస్తి నష్టాలకు ఆస్కారం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆమె ఆదేశించారు. మత్స్యకారులు, రైతులు, గొర్రెల కాపరులను వర్షం, పిడుగుల హెచ్చరికలతో ఫోన్ కాల్స్, సందేశాల ద్వారా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా చేయాలని విపత్తునిర్వహణ శాఖ ఎండీ కూర్మనాథ్ కు హోంమంత్రి ఆదేశాలిచ్చారు. వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లకుండా ఆయా శాఖ అధికారులు సమన్వయం చేసుకునేలా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని వెల్లడించారు.

నంద్యాల జిల్లా శ్రీశైలంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ను హోంమంత్రి వంగలపూడి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ రికార్డుల నిర్వహణపై ఆమె సమీక్ష చేశారు. లోన్ యాప్, సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తుల భద్రత, మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలని ఆదేశించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు సమిష్టిగా కృషి చేయాలన్నారు.

అంతకుముందు, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను మంగళవారం హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. దర్శనాంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో హోంమంత్రి అనితకు వేదపండితులు వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఏపీ ప్రజలంతా శాంతిభద్రతలతో సుభిక్షంగా ఉండాలని హోంమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హోంమంత్రి వంగలపూడి అనిత తన ఎక్స్ అకౌంట్ ద్వారా దేశ పౌరులకు రాజ్యాంగ వజ్రోత్సవ శుభాకాంక్షలు వెల్లడించారు. దేశమంతా ఒక్కటిగా నిలిపిన భారతీయుల తోడు నీడ.. కంటికిరెప్పలా..కన్నతల్లిలా 75 ఏళ్లుగా కాపాడుతున్న రక్షణగోడా రాజ్యాంగమన్నారు. రాజ్యాంగాన్ని రూపొందించడంలో 15 మంది నారీమణులు నాడు కీలక పాత్ర పోషించడం గర్వించే విషయమని పేర్కొన్నారు. విదేశీ శత్రువులు, స్వదేశీ సంక్షోభాలు ఎన్ని ఎదురైనా భారతావనిలో ప్రజస్వామ్యం నిలబడడం మాత్రమే కాదు మరింత బలపడిందన్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం గత ఐదేళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో మహోన్నత అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారన్నారు. సర్వ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే కాదు.. ప్రజల సర్వనాశనమే లక్ష్యంగా విఫలయత్నం చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలోని రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టడంతో తిరిగి నేడు రాజ్యాంగ వజ్రోత్సవాలను స్వేచ్ఛగా జరుపుకుంటున్నామని ఎక్స్ లో పేర్కొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *