-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వ అసమర్ధ పాలనకి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల సమీక్ష సమావేశంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు లేవనెత్తిన సమస్యలే నిదర్శనమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రజల నుంచి నానాటికి వ్యతిరేకత పెరుగుతుండటంతో.. 6 నెలల కాలంలోనే చివరికి ఎమ్మెల్యేలు సైతం ప్రశ్నించే పరిస్థితి నెలకొందన్నారు. ముఖ్యంగా విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తి 3 నెలలు గడిచినా బాధితులను నేటికీ పూర్తిగా న్యాయం జరగలేదని ఆరోపించారు. వరదల కారణంగా నష్టపోయిన సామాన్య ప్రజలు, ఆటో కార్మికులు, చిరు వ్యాపారులకు న్యాయం జరగలేదని మొదటి నుంచి వైసీపీ చెబుతూనే ఉందని.. కానీ రాజకీయ విమర్శలుగా కొట్టి పారేసారని మండిపడ్డారు. వీఎంసీ కౌన్సిల్ సమావేశంలోనూ తెలుగుదేశం కార్పొరేటర్లు అడ్డగోలుగా వాదించారని.. కానీ ఇప్పుడు డీఆర్సీ సమావేశంలో సాక్షాత్తు టీడీపీ ప్రజాప్రతినిధులే ఒప్పుకున్న పరిస్థితి నెలకొందన్నారు. బుడమేరు వరద బాధితులకు నేటికీ పరిహారం అందలేదని ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడితే.. తాగునీటి సమస్యపై ఓ ఎమ్మెల్యే, రైతులకు ప్రత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని మరో ఎమ్మెల్యే ప్రశ్నించటం ఈ ప్రభుత్వ చేతకానితనానికి అద్దం పడుతోందన్నారు. కూటమి సర్కారుకి ప్రజలపై 1 శాతం SGST భారం వేయటంపై ఉన్న శ్రద్ద.. ప్రజా సమస్యల పరిష్కారంలో లేదని దుయ్యబట్టారు. మరోవైపు రైతు బజార్లన్నీ అవినీతి కంపు కొడుతున్నాయని.. సిండికేట్లు తనకే డబ్బు ఇవ్వటానికి వస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పటం ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని అంగీకరించటమేనని అభిప్రాయపడ్డారు. పరిపాలన ఈ విధంగా ఉంటే కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అధికార యంత్రాంగం ఏం చేస్తోందని సూటిగా ప్రశ్నించారు. ఓవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తి గళం వినిపిస్తుంటే.. జిల్లా ఇంచార్జి మంత్రి సత్యకుమార్ మాత్రం అన్నీ అసత్యాలే మాట్లాడుతున్నారని మల్లాది విష్ణు మండిపడ్డారు. ధాన్యం సేకరణ, గిట్టుబాటు ధరలపై ఉమ్మడి కృష్ణా జిల్లా రైతులు తమ గోడుని వెలిబుచ్చినా.. ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తీరా కూటమి ఎమ్మెల్యేలే జిల్లా సమీక్ష సమావేశంలో ప్రశ్నించటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజా సమస్యలపై సీరియస్ గా వ్యవహరించాలని.. వరద బాధితులకు, రైతులకు తక్షణ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.